India and China: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు భారత్‌పై ఒత్తిడి పెంచిన నేపథ్యంలో, భారత్–చైనా సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెడుతున్నాయి. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ఉద్రిక్తతలతో నిండిన ఈ సంబంధాలు, ఇప్పుడు ఆర్థిక, రాజకీయ అవసరాల ఆధారంగా సానుకూల మార్పుల వైపు సాగుతున్నాయి. మరోవైపు భారత్‌కు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ మొదటి సమాధానం ట్రంప్ టారిఫ్ వారే చైనా–భారత్‌ను దగ్గర చేశాయి.
ట్రంప్ పరిపాలన భారత్‌పై 50 శాతం వరకు టారిఫ్‌లను విధించడం, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపడం ద్వారా భారత్–అమెరికా సంబంధాలకు గట్టి దెబ్బ తీసింది. ఈ టారిఫ్‌లు భారత ఎగుమతులు, ముఖ్యంగా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా, భారత్ తన ఆర్థిక స్థిరత్వం కోసం చైనాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2024 అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమావేశాల్లో ఇరు దేశాల నాయకుల సమావేశం ఈ మార్పుకు నాంది పలికింది. అమెరికా ఒత్తిడి ఎదుర్కొనేందుకు భారత్, చైనా కలిసి నిలబడాలనే సందేశాన్ని ఈ సమావేశాలు ఇచ్చాయి. చైనా కూడా ఈ టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ, భారత్‌తో సహకారాన్ని పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో చైనా రాయబారి జు ఫీహాంగ్, ఇరు దేశాల స్నేహం ఆసియా, ప్రపంచ ఆర్థిక వృద్ధికి మేలు చేస్తుందని పేర్కొన్నారు.
గత ఘటనల నేపథ్యం..
2020 గల్వాన్ లోయ ఘర్షణలో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికుల మరణం ఇరు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించాయి, ఇది మూడు నాలుగేళ్లపాటు ఉద్రిక్తతలను కొనసాగించింది. అయితే, 2014 తర్వాత చైనా భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదని, గల్వాన్, డోక్లాం వంటి ప్రాంతాల్లో భారత సైన్యం దృఢంగా నిలబడిందని గమనించాలి. ఇక 1962 భారత్–చైనా యుద్ధంలో చైనా అక్సాయ్ చిన్‌లో 30 వేల చ.కి.మీ భూమిని ఆక్రమించుకుంది. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో చైనా సరిహద్దు అతిక్రమణలకు పాల్పడింది. అయితే, ఇటీవలి కాలంలో చైనా యుద్ధం కాకుండా శాంతి, సహకారాన్ని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. 2024లో ఎస్‌సీవో సమావేశం తర్వాత చైనా సైనికులను ఉపసంహరించుకోవడం, కమాండెంట్ స్థాయి చర్చలు, విదేశాంగ మంత్రుల పరస్పర పర్యటనలు ఈ దిశలో సానుకూల సంకేతాలు.
భారత ఆర్థిక బలం..
భారత ఆర్థిక స్థిరత్వం ఈ కొత్త విధానానికి పునాదిగా నిలుస్తోంది. 655 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు, 1% కన్నా తక్కువ జీడీపీ లోటు, నెలవారీ 68.7 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 2.4% రిటైల్ ఇన్‌ఫ్లేషన్, 8.9% సివిల్ ఉత్పాదక రంగ వృద్ధి, 7.8% స్టీల్ వినియోగం వంటి గణాంకాలు భారత్ యొక్క ఆర్థిక బలాన్ని సూచిస్తున్నాయి. ప్రపంచంలో ఐదో అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా, 81 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులతో భారత్ ఆర్థిక శక్తిగా ఉద్భవిస్తోంది. ఈ బలమైన ఆర్థిక నేపథ్యంలో భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అదే సమయంలో, చైనాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకుంటూనే, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించింది. గల్వాన్ ఘటన తర్వాత నీటిలో కరిగే ఎరువుల తయారీ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం ద్వారా చైనా నుంచి ఎరువుల దిగుమతులను గణనీయంగా తగ్గించింది.
చైనాతో స్నేహం, అమెరికాకు చెక్..
భారత్ చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నప్పటికీ, పూర్తిగా నమ్మడం లేదు. 1962 యుద్ధం, నెహ్రూ హయాంలో చైనా దురాక్రమణలు, టిబెట్ విషయంలో అనుమానాలు వంటి గత అనుభవాల నేపథ్యంలో భారత్ అతి జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రతిపాదించిన ఎనిమిది సూత్రాలు సరిహద్దు ఒప్పందాలకు కట్టుబడటం, ఎల్‌ఏసీని గౌరవించడం, శాంతి కొనసాగించడం చైనాతో సంబంధాలను నిర్వహించడంలో భారత్ యొక్క వ్యూహాత్మక దృష్టిని చూపిస్తున్నాయి. అదే సమయంలో, భారత్ అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు రష్యా, చైనా, జపాన్ వంటి దేశాలతో వాణిజ్య, రాజకీయ సంబంధాలను బలోపేతం చేస్తోంది. జపాన్‌తో 10 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం, బుల్లెట్ రైలు చర్చలు, ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు భారత్ యొక్క బహుముఖ విధానాన్ని సూచిస్తున్నాయి. ఈ వ్యూహం ద్వారా భారత్ చైనాకు దగ్గరవుతూనే, దాని ఆధిపత్యానికి లొంగకుండా, అమెరికా ఒత్తిడిని తట్టుకునే సమతూక విధానాన్ని అవలంబిస్తోంది.