అత్యాధునిక వైద్య సదుపాయాలు, అపారమైన వనరులు గల అమెరికా నేడు కరోనా వైరస్ తో కకావికలం కావడానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలి దశలో అనుసరించిన నేరమయ నిర్లక్ష్య వైఖరియే కారణమా? అవుననే ఆ దేశంలోని సీనియర్ అధికారులు, రాజకీయ నేతలు వాపోతున్నారు.
మొదట్లో ఈ వైరస్ తీవ్రతను గుర్తించడంలో విఫలం కావడమే కాకుండా, వైట్ హౌస్ లోని ఉన్నతాధికారులు దృష్టికి తెచ్చే ప్రయత్నం తెచ్చినా కొట్టిపారవేశారని చెబుతున్నారు. ఇప్పుడు అమెరికాలో మృతుల సంఖ్య 1,000 కు చేరుకోగా, మొత్తం నమోదైన కేసులు 9,200 దాటిన్నట్లు తెలుస్తున్నది.
జనవరి 3నే ఈ విషయమై ట్రంప్ ను సంప్రదించడం కోసం అమెరికా ఆరోగ్య కార్యదర్శి అలెక్స్ అజార్ ప్రయతించారు. అయితే పక్షం రోజుల తర్వాత గాని ఆయనతో ఈ విషయమై చర్చించే సౌలభ్యం ట్రంప్ కలిగించలేదు. అమెరికాకు ఈ వైరస్ ప్రమాదం ముంచుకొస్తుందనే ఉన్నతాధికారుల ఆందోళనను ఆయన మార్చి మొదటి వరకు ఖండిస్తూ వచ్చారు.
ఇప్పుడు `చైనా వైరస్’ అంటూ నిద్రిస్తున్న ఆయన మొదట్లో దీనిని ఘనంగా కట్టడి చేస్తున్నదని ఆ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. చైనా వాస్తవాలను చెప్పడం లేదని, తీవ్రతను తక్కువ చేసి చూపుతున్నదని నిఘా నివేదికలు కూడా తెలుపుతున్నా పట్టించుకోలేదు. చైనా ఎంతో `పారదర్శకత’తో వ్యవహరిస్తున్నట్లు జనవరి 24న కూడా ట్రంప్ కొనియాడారు.
చైనాకు విమానాలను, రాకపోకలను జనవరి 17నే భారత్ కట్టడి చేయగా, అమెరికా ఫిబ్రవరి 3న గాని తగు చర్యకు పూనుకోలేదు. అప్పుడు కూడా చైనాలో రెండు వారల పాటు ఉన్నవారిని అమెరికాలో ప్రవేశింపకుండా మాత్రమే నిషేధం విధించారు.
ఇప్పుడు కూడా భారత్ తో సహా పలు దేశాలు సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించినా, ట్రంప్ అందుకు సిద్దపడటం లేదు. ఆ విధంగా చేస్తే దేశం ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోందని అంటున్నారు. పైగా, మొత్తం ప్రపంచం లాక్ డౌన్ ప్రకటించినా తాను మాత్రం ప్రకటించానని భీషించుకొని కూర్చున్నారు.
ఇటువంటి పరిస్థితులలో చరిత్రలో ఎరుగనంత భారీగా 2 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక ప్యాకేజీని రూపొందించవలసి రావడం తెలిసింది.