Munugode By Poll- TRS: మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెలువడనుంది. రికార్డుస్థాయిలో ఇక్కడ 93 శాతం పోలింగ్ నమోదైంది. గురువారం రాత్రి వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడం, చివరి రెండు గంటల్లోనే 10 నుంచి 15 శాతం పోలింగ్ నమోదు కావడంతో ఫలితంపై మూడు ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చినా.. అవన్నీ.. మధ్యాహ్నం వరకు తీసుకున్నవే. సాయంత్ర తర్వాత 10 శాతం కన్నా ఎక్కువ పోలింగ్ నమోదు కావడంతో గులాబీ నేతల్లోనూ ఈవినింగ్ పోలింగ్ గుబులు రేపుతోంది. ఈ క్రమంలో బూత్‌ల వారీగా పోలింగ్ సరళిపై టీఆర్‌ఎస్ పార్టీ శుక్రవారం పోస్ట్‌మార్టం పూర్తి చేసింది. పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే 93 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనాకు వచ్చింది. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ ఆధిక్యత సాధిస్తారని పార్టీ అంచనా వేసింది.

మండలాలు, యూనిట్ల వారీగా నివేదికలు..
పోలింగ్ సరళిపై మండలాలు, యూనిట్ల వారీగా పార్టీ ప్రచార ఇన్‌చార్జీలుగా పనిచేసిన నేతలు తమ నివేదికలు పోస్టుమార్టం మీటింగ్‌లో సమర్పించారు. పోలింగ్ బూత్‌ల వారీగా నమోదైన ఓట్లు, వాటిలో టీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీలకు వచ్చే ఓట్లపై తమ అంచనాలను గణాంకాలతోసహా పొందుపర్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఈ నివేదికలను క్రోడీకరించి పార్టీ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
50 శాతం టీఆర్‌ఎస్‌కే అని ధీమా..
పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కే పడినట్లు గులాబీ నేతలు భావిస్తున్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ ఇన్‌చార్జీల నుంచి అందిన నివేదికలతోపాటు ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రై వేటు సంస్థల నివేదికలు, వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా సీఎం విశ్లేషించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన
ఆదివారం ఉదయం 8 గంటలకు మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈమేరకు టీఆర్‌ఎస్ అధిష్టానం పార్టీ తరపున ఓట్ల లెక్కింపులో పాల్గొనే ఏజెంట్లను ఎంపిక చేసింది. వీరికి శనివారం అవగాహన కల్పిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కౌంటింగ్ జరిగే తీరు, అభ్యంతరాలను ఎప్పుడు వ్యక్తం చేయాలి, చెల్లని ఓట్ల కౌంటింగ్, వీవీప్యాడ్ రిసిప్టుల లెక్కింపు డిమాండ్, పోస్టల్ ఓట్లు, కౌంటింగ్ తదితర అంశాలపై పార్టీ సీనియర్లతో శిక్షణ ఇప్పించారు.

రాత్రి వరకూ పోల్ మేనేజ్‌మెంట్..
ఇదిలాఉంటే సుమారు పక్షం రోజులపాటు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో క్షణం తీరిక లేకుండా తలమునకలైన నేతలు గురువారం రాత్రి పోలింగ్ ముగిసే వరకు పార్టీ కేడర్‌ను సమన్వయం చేశారు. పోల్ మేనేజ్‌మెంట్‌ను ఎమ్మెల్యేలతోపాటు మంత్రులు స్వయంగా పర్యవేక్షించారు. వాట్సాన్ కాల్‌లో కాన్ఫరెన్స్‌లో ఉంటూ బూత్‌ల వారీగా పోలింగ్, ఓటు వేసేందుకు వచ్చే వారు, ఎవరికి ఓటు వేశారు, వ్యతికులను టీఆర్‌ఎస్ వైపు ఎలా తిప్పుకోవాలి, తాయిళాల పంపిణీ ఎలా అన్నీ సమన్వయం చేసినట్లు తెలిసింది. దీంతోనే విజయం తమదే అన్న ధీమాలో పోస్టుమార్టం నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
ఇంకా పోస్టుమార్టం నివేదికలో ఏముందన్న విషయం మాత్రం ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది.