TRS vs BJP- YS Sharmila: తెలంగాణలో పార్టీ పెట్టి.. తనంతట తాను పాదయాత్ర చేసుకుంటూ వెళ్లున్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్.షర్మిలను ఇన్నాళ్లూ పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో ఆమె తండ్రి, సోదరుడు చేసిన పాదయాత్రలు అధికారం తెచ్చిపెట్టాయని, తాను కూడా యాత్ర చేస్తే అధికారంలోకి వస్తానని యాత్రకు బయల్దేరారు. కానీ, వైఎస్సార్ యాత్ర, జగన్ యాత్ర సమయంలో ఉన్న పరిస్థితులు వేరు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయాలు వేరు. ఈ నేపథ్యంలో యాత్రను కొనసాగిస్తూ 3,500 కిలోమీటర్లు నడిచిన షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనంగా మారారు. ఎట్టకేలకు ఆమె గురించి ఇతర పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు వారు మాట్లాడుతున్నది కూడా.. ఆమె ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణ రాజకీయాల్లో పనిచేస్తున్నారని, ఎవరి కోసం టీఆర్‌ఎస్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలపై నిందలు మోపుతోందని ప్రశ్నిస్తున్నారు.

ఎవరి అస్త్రమో..?
తెలంగాణలో ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ పార్టీలు కనపడుతున్నాయి. ఎవరికి వారు తమని నష్టపరచడానికి ఎదుటి పార్టీ ప్రయోగించిన అస్త్రం షర్మిల అంటూ ఆమెకు ప్రయోజనాలు ఆపాదిస్తున్నారు. 3,500 కిలోమీటర్లు నడిచే వరకూ షర్మిలను గానీ, ఆమె యాత్రను గానీ ఎవరూ పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో టీఆర్‌ఎస్ నాయకులు దాడి చేయడం, తర్వాత షర్మిల ప్రగతిభవన్‌కు వాహనాలతో వెళ్తుండగా పోలీసులు అరెస్టులు వాటికి సంబంధించి జరిగిన రభసతో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఇప్పుపడు హాట్ టాపిక్‌గా మారారు.
టీఆర్‌ఎస్ వదిలిన బాణమే..
తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి అధికార టీఆర్‌ఎస్ పార్టీ వదిలిన బాణమే షర్మిల అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమె పాదయాత్ర చేస్తున్నది కూడా కాంగ్రెస్ ఓట్లు కొల్లగొట్టడానికే అని పేర్కొంటున్నారు. వైఎస్సార్ పేరు మీద స్థాపించిన పార్టీ తెలంగాణలో ఏ కొంతైనా బలపడితే కచ్చితంగా కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుంది. వైఎస్‌ఆర్‌ను అభిమానించే, ఆయన పేరు కోసం ఓట్లు వేసేవాళ్లు సహజంగా కాంగ్రెస్ ఓటర్లే అయి ఉంటారనేది ఒక అంచనా. ఆ రకంగా కాంగ్రెసుకు నష్టం జరగడం గ్యారెంటీ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీని దెబ్బ కొట్టడానికి కేసీఆర్ ప్రయోగించిన బాణం షర్మిల అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కమల బాణమే అంటున్న కవిత..
మరోవైపు షర్మిల కమల బాణం అని సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆమె కచ్చితంగా కమల బాణమే అని.. షర్మిల తానా అంటే బీజేపీ తందానా అంటుందని భారతీయ జనతా పార్టీ ప్రయోగించిన బాణమే షర్మిల అని ట్వీట్ చేశారు. దీంతో షర్మిల కూడా రీట్వీట్‌తో దీటుగా సమాధానం ఇచ్చారు. తాను కవితలా తన తండ్రి అండతో రాజకీయాల్లోలకి రాలేదని, తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించలేదని పేర్కొన్నారు. పాదయాత్ర చేసింది లేదు.. ప్రజల సమస్యలు తెలుసుకున్నది లేదని, కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడ అని విమర్శించారు.

లాభం టీఆర్‌ఎస్‌కే..
ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. టీ రాజకీయాల్లో ఏం జరిగినప్పటికీ షర్మిల పార్టీ అనూహ్యంగా బలపడి సొంతంగా సీట్లు గెలిచే స్థాయికి వస్తే తప్ప ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఉండలేదు. ఇదే సమయంలో ఓ మోస్తరు బలాన్ని పొందడం వలన అంతిమంగా మేలు జరిగేది టీఆర్‌ఎస్‌కే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి మాత్రమే షర్మిల ఉపయోగపడుతుంది తప్ప, గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సాధ్యం కాదు’ అనేది విశ్లేషకులు అంచనా. ఆ కోణంలో చూసినప్పుడు టీఆర్‌ఎస్‌కు ప్రయోజనం కలిగించే తరహాలో కమలం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు బాణాలను ప్రయోగిస్తాయి అనే అనుమానం కలుగుతుంది.
మొత్తానికి తాజా ఎపిసోడ్‌తో ఇన్నాళ్లూ షర్మిలను విస్మరించినట్లుగా నటించిన నాయకులందరూ కూడా ఇప్పుడు ఆమె రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతున్నారు. ఇది షర్మిలకు, ఆమె పార్టీకి శుభపరిణామం.