TRS Vs BJP: రాష్ట్ర ప్రభుత్వం “రైతుబంధు” పేరుతో అన్నింటికీ కత్తెర వేసిందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కల్లాలు నిర్మిస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోందని భారత రాష్ట్ర సమితి నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ఏకంగా పోటాపోటీగా నిరసనలు, ప్రదర్శనలు చేస్తున్నారు. కల్లాలు నిర్మించుకున్న రైతుల దగ్గర నుంచి డబ్బులు తిరిగి వసూలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహించారు.. నిన్న రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయాలని బిజెపి నాయకులు రాష్ట్రంలోని అన్ని తహసిల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. సో మొత్తానికి రాష్ట్రంలో మళ్లీ బిజెపి, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం మొదలైంది.

ధాన్యం కొనుగోలు విషయంలోనూ .
నిరుడు వానాకాలం ధాన్యం కొనుగోళ్ల విషయం నుంచే బీఆర్ఎస్, బిజెపి నాయకుల మధ్య వైరం మొదలైంది.. ధాన్యం కొనడం లేదంటూ రాష్ట్రం, మేం కొనకుంటే, ఇన్నాళ్లు కొనుగోలు చేసింది ఎవరు అని కేంద్రం… ఇలా ఇరు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా రెండు పార్టీలు కూడా అవసరం వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. పైగా ప్రతి దానిలో తమ రాజకీయ లాభాన్ని చూసుకుంటున్నాయి.. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు మినహా మిగతా పథకాలను అమలు చేయడం లేదు. రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు. దీంతో బ్యాంకర్లు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు.. ప్రభుత్వం రైతుబంధు డబ్బులను వేస్తే వాటిని అప్పు కింద జమ కడుతున్నారు. ఇక కేంద్రం కూడా సూక్ష్మ సేద్య పరికరాలపై జిఎస్టి విధించి రైతులను ఇబ్బంది పెడుతోంది.. ఇది ఉద్యాన పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

రైతుల బాధలు పట్టవా
రెండు పార్టీలు కూడా పంతాలకు పోవడంతో మధ్యలో రైతులు నలిగిపోతున్నారు.. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో అక్టోబర్ మొదటి వారం నుంచే వరి కోతలు షురూ అయ్యాయి. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అడ్డికి పావు శేరు చొప్పున ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్నారు. జరగాల్సిన మొత్తం జరిగిపోయిన తర్వాత ప్రభుత్వం తీరిగ్గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇక ఫసల్ బీమా యోజన పథకాన్ని వర్తింపజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.. దీనివల్ల ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదు.. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తోందంటే అది కూడా లేదు.. ఇక కౌలు రైతులను ఆదుకునే ఒక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం లో రైతులను చేర్చుకోవడం లేదు. దీనివల్ల కొత్త రైతులకు లబ్ధి చేకూరడం లేదు.. పైగా కేంద్రం కూడా వివిధ వ్యవసాయ పరికరాలపై జిఎస్టి విధిస్తుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇన్ని సమస్యలు పెట్టుకొని రెండు పార్టీలు కూడా మీరంటే మీరు అంటూ ఆరోపణలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది .