KTR Birthday: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. నేతలు తలుచుకుంటే సెలబ్రేషన్ కు ఢోకా ఉండదు. వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఫర్వాలేదన్నట్లుగా ప్రభుత్వం మనదైతే ఏమైనా చేయొచ్చు. టీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నా అది మాత్రం ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో టీఆర్ఎస్ తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. అధికార పార్టీ అనే ధీమాతో రోడ్లను అడ్డగించి పార్టీలు చేయడమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సైతం చేసినట్లు తెలుస్తోంది.
నిన్న టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని దుర్గం చెరువు వంతెనపై కార్లు నిలిపి పుట్టిన రోజు వేడుకలు చేయడం అది కాస్త ట్విటర్ లో పోస్టు చేయడం విమర్శలకు తావిస్తోంది. మంత్రి అయితే ఏంటి? ఏమన్నా కొమ్ములున్నాయా? అనే వాదనలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉందని విర్రవీగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. మంత్రి అయితే ఇంట్లో వేడుకలు నిర్వహించుకోవాల్సింది కానీ ఇలా బజారులో చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: Justice NV Ramana- Draupadi Murmu: రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్వీ రమణ.. అరుదైన అవకాశం
ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగేలా వాహనాలను ఆపి వేడుకలు చేసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నేతలెవరైనా వారి జన్మదిన వేడుకలు నడిరోడ్డుపై నిర్వహించుకుంటారా? వారికేం హక్కుంది? ప్రజలకు అడ్డు చెప్పే వారు ఎంతటి వారైనా తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని తెలుస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నా సర్కారు మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరమే.
ఇప్పటికే టీఆర్ఎస్ తీరుపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తాజాగా ఇలా జన్మదిన వేడుకలు జరపడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ నేతల రాజ్యం కాదని ప్రజాస్వామ్య ప్రభుత్వం అని తెలుసుకుంటే మంచిదనే హితవు పలుకుతున్నారు. రాజుల కాలం నాడే పోయింది రాజరికపు సంస్కృతి. ఇంకా ఉందనుకోవడం వారి భ్రమే. దీనికి సమాధానం చెప్పాల్సిందేనని నెటిజన్లు అడుగుతున్నారు. ఇక టీఆర్ఎస్ కు మూడిందనే వాదనలు కూడా వస్తున్నాయి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా బర్త్ డేలు చేయడంపై ప్రజల్లో ఆగ్రహం వస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read:BJP- TDP: టీడీపీకి బీజేపీ స్నేహ హస్తం.. కేసీఆర్, జగన్ చర్యలే కారణం?