ఇటీవల వరుస ప్రమాదాలు తెలంగాణలోని ప్రభుత్వానికి, అధికార పార్టీకీ కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. అసలే ఎన్నికల సీజన్ దగ్గర పడుతున్న వేళ ఈ ప్రమాదాలు.. ఈ వైపరీత్యాలు పార్టీ కేడర్‌ను డిఫెన్స్‌లోకి నెట్టుతున్నాయి. ఇటీవల ప్రాజెక్టుల్లో ప్రమాదాలు.. హైదరాబాద్‌లో వరదలు మరింత ఇబ్బంది పెట్టాయి.
Also Read: బండి సంజయ్ పై తొడగొట్టిన హరీష్ రావు
ఇప్పటికే హైదరాబాద్‌లో పరామర్శలకు వెళ్లిన నేతలకు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పలేదు. మున్ముందు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో ఈ విమర్శలన్నింటినీ ఎలా సమర్ధించుకోవాలని అర్థం కాకుండా టీఆర్‌ఎస్ సతమతం అవుతోంది. పలువురు మంత్రులు స్పందిస్తూ.. ఇదంతా గత పాలకుల పాపమేనని చెబుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల స్కీం ఎప్పుడూ లేని విధంగా నీట మునిగింది. దీనికి కారణం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మిస్తున్న కాంట్రాక్టర్ల కక్కుర్తేనని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లిన మంత్రి నిరంజన్ రెడ్డి.. కల్వకుర్తి నీట మునగడానికి కారణం.. గత ప్రభుత్వాలేనని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఎలా కారణం అవుతాయో.. ఆయన లెక్క ఆయన చెబుతారు కానీ.. వినేవారికి మాత్రం తేడాగా అనిపిస్తూ ఉంటుంది.
ఇంత పెద్ద భాగ్యనగరంలోనూ వరదలు రావడానికి కారణం గత పాలకులేనని చెప్పుకొస్తున్నారు. సరే.. గత పాలకుల పాలనల్లో సిటీ ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉందా..? అప్పటికి ఇప్పటికి తేడా ఏం లేదా..? ఈ స్థాయిలో జనం పెరిగినా.. ఈ స్థాయిలో రోజురోజుకు విస్తరిస్తున్న సిటీలో అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వంపై లేదా..? ఆ స్థాయిలో వసతులను మెరుగుపరచాల్సిన బాధ్యత లేదా..? సిటీలోని డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయాలని హామీలిచ్చి ఇప్పుడెందుకు మరిచారు..? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మొదటి విడతలోనే ఆ పనులు మొదలు పెడితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా..? మరి ఇవన్నీ చేయకుండా ఇప్పుడున్న మంత్రులు సిగ్గులేకుండా ఎందుకు గత పాలకుల మీదకు నెట్టుతున్నారు.
ముఖ్యంగా ఈవిషయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తెర ముందుకొచ్చారు. నాలాలు, చెరువులపై కట్టడాలు తమ ప్రభుత్వంలో కట్టినవి కావని .. పాపాలు చేసిన నేతలే ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని ఆరోపించారు. నిజానికి తలసాని పార్టీలు మారి మరీ ప్రభుత్వాల్లో కొనసాగుతున్నారు. ఆ ప్రభుత్వాల్లో తలసాని కూడా ఉన్నారు. అంటే నైతికంగా ఆ వైఫల్యానికి ఆయన కూడా కారకులు అన్నట్లే కదా..! అంతేకాదు.. హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రధాని జోక్యం చేసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Also Read: దండకారణ్యంలో అలజడి: ఆపరేషన్ ప్రహార్ తో మావోల ఏరివేత
టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న ఈ మాటలు రాజకీయ నేతలకు కౌంటర్ ఇవ్వడానికి పనికి వస్తుంది కానీ.. ప్రజలను మాత్రం మెప్పించలేదు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతోంది. ఇలాంటి సమయంలోనూ.. జరిగే ప్రతీ దానికి గత పాలకులు.., సమైక్యాంధ్ర పాలకులు అని కారణాలు చెబుతూ పోతే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రస్తుతం ఉన్న నేతలంతా.. ఆ సమైక్య పాలక ప్రభుత్వాల్లో భాగంగానే ఉన్నారు. కొన్నాళ్ల కిందట వరకూ టీఆర్ఎస్ ఇలా వాదనలు వినిపిస్తే కాస్త ఎఫెక్టివ్‌గా ఉండేది. కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు కష్టాలొచ్చినప్పుడల్లా.. వారి కష్టాలను తీర్చేప్రయత్నం చేయకుండా పక్కనోళ్లపై నిందలేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు భావ్యం. ఇప్పటికైనా టీఆర్‌ఎస్ పాలకులు తమ వైఖరిని మార్చుకొని రాష్ట్రాన్ని ఎలా బాగుచేయాలో అనే అంశంపై దృష్టి సారిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.