https://oktelugu.com/

ఓవర్‌‌ టూ దుబ్బాక : అటు హామీలు.. ఇటు ప్రారంభోత్సవాలు..

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సీజన్‌ మొదలైంది. ఎమ్మెల్సీ, దుబ్బాక ఉప ఎన్నిక, కార్పొరేషన్లకు ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చిన అధికార పక్షం తన స్టంట్‌ను మొదలుపెడుతూనే ఉంటుంది. ఇన్నాళ్లు సమస్యలు బాబోయ్‌ అని మొత్తుకున్నా వినని ప్రభుత్వం.. ఇప్పుడు అడగకున్నా నిధులు కుమ్మరిస్తోంది. ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ అక్కడి ప్రజలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఎటుపెట్టి మరోసారి ఆ స్థానాలను కైవసం చేసుకోవాలనే టార్గెట్‌తో పెద్దలందరూ అక్కడ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 11:58 am
    Follow us on


    తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సీజన్‌ మొదలైంది. ఎమ్మెల్సీ, దుబ్బాక ఉప ఎన్నిక, కార్పొరేషన్లకు ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చిన అధికార పక్షం తన స్టంట్‌ను మొదలుపెడుతూనే ఉంటుంది. ఇన్నాళ్లు సమస్యలు బాబోయ్‌ అని మొత్తుకున్నా వినని ప్రభుత్వం.. ఇప్పుడు అడగకున్నా నిధులు కుమ్మరిస్తోంది. ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ అక్కడి ప్రజలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఎటుపెట్టి మరోసారి ఆ స్థానాలను కైవసం చేసుకోవాలనే టార్గెట్‌తో పెద్దలందరూ అక్కడ వాలుతున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రలోభాలకు దిగుతున్నారు.

    Also Read: కేటీఆర్ సీఎం కావడం కల్ల.!?

    గ్రేటర్‌‌ హైదరాబాద్‌తోపాటు వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ల పదవీ కాలం వచ్చే ఫిబ్రవరితో ముగుస్తున్నాయి. ఈ లోపు వాటికి ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీహార్‌‌ ఎన్నికలతోపాటే దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. దీంతో టీఆర్‌‌ఎస్‌ పార్టీ నేతలు అప్పుడే ఆయా ప్రాంతాల్లో జోరుగా పర్యటిస్తున్నారు.

    హైదరాబాద్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌‌, దుబ్బాకలో మంత్రి హరీశ్‌రావు పోటాపోటీగా ప్రారంభోత్సవాలు చేస్తూ.. తీర్చలేని హామీలు ఇస్తున్నారు. ముఖ్యంగా ముందు నుంచి టీఆర్‌‌ఎస్‌ ఖాతాలోనే ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించాలని ఉవ్విల్లూరుతోంది. ఈసారి పోటీ అంత ఈజీగా లేకపోవడంతో ఆ నియోజకవర్గంపై అధిష్టానం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది.

    సిద్దిపేట, మెదక్‌, దుబ్బాక ఈ నియోజకవర్గాలన్నీ ఒకే జిల్లాకు చెందినవి. కానీ.. సీఎం కేసీఆర్‌‌, మంత్రి హరీశ్‌రావుకు సిద్దిపేట, మెదక్‌ల మీద ఉన్న ప్రేమ దుబ్బాక మీద లేదని అక్కడి ప్రజలు చెబుతుంటారు. అందుకే.. ఆ రెండు నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిలో కనీసం 20 శాతం కూడా ఇక్కడ లేదనేది వారి అభిప్రాయం. ఇన్నాళ్లు సోలిపేట రామలింగారెడ్డి మీద ఉన్న అభిమానంతో ఆయన్ను గెలిపించుకుంటూ వస్తున్నారు. అంతేతప్ప టీఆర్‌‌ఎస్‌ మీద వారికి ఎలాంటి ఉత్సుకత లేదనేది పలు పార్టీల నేతలు కూడా అంటున్నారు.

    దుబ్బాక గెలుపు బాధ్యతను టీఆర్‌‌ఎస్‌ అధిష్టానం మంత్రి హరీశ్‌రావు నెత్తిన పెట్టినట్లుగా కనిపిస్తోంది. అందుకే.. ఆయన టీఆర్‌‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో పాగా వేశారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ పది రోజుల్లో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్‌, రాయపోలు మండలాల్లో పర్యటించిన ఆయన.. రూ.11 కోట్ల విలువైన 36 పనులకు శంకుస్థాపనలు చేశారు. దుబ్బాక మున్సిపాలిటీతోపాటు మండలాల్లో రూ.7.30 కోట్లతో 23 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.3.70 కోట్లతో 13 పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. వీటితోపాటే నియోజకవర్గంలో ఆర్‌‌అండ్‌బీ రోడ్ల కోసం రూ.12 కోట్లు, నియోజకవర్గంలో 19 గ్రామ పంచాయతీలకు కొత్త బిల్డింగ్‌ల కోసం ఒక్కో దానికి రూ.20 లక్షల చొప్పున రూ.3.80 కోట్లు మంజూరు చేశారు. మల్లేశంపల్లి గ్రామంలో 20 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రకటించారు. 546 స్వయం సహాయక సంఘాలకు రూ.17.8 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. 400 వరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు అందించారు.

    Also Read: తెలంగాణలో పొలిటికల్ హీట్

    వీటితోపాటే.. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రూలింగ్‌ పార్టీ దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ తీర్మానాలతో ముందుకెళ్తోంది. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌కే మద్దతు ఇస్తామని గ్రామాల్లో తీర్మానాలు చేయిస్తున్నారు. ముఖ్యనేతల కనుసన్నల్లోనే ఈ తతంగం అంతా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా.. ఇప్పటికే దుబ్బాక మండలంలోని వెంకటగిరితండా, శిలాజీ నగర్‌‌, పద్మనాభునిపల్లి, దౌల్తాబాద్‌ మండలంలోని నర్సంపేట, గువ్వలేగి, రాయపోలు మండలంలోని ఉదయపూర్‌‌, గొల్లపల్లి గ్రామాలు టీఆర్‌‌ఎస్‌కు అనుకూలంగా తీర్మానాలు చేశాయి. శిలాజీనగర్‌‌లో ఏకగ్రీవ తీర్మానంపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

    అయితే.. టీఆర్‌‌ఎస్‌ ఆడుతున్న ఈ ఎన్నికల నాటకాన్ని ప్రజలు ఎంత వరకు విశ్వసిస్తారో అర్థం కాకుండా ఉంది. ఇన్నాళ్లు అభివృద్ధి పట్టించుకోని వారంతా ఇప్పుడు వచ్చి ప్రారంభోత్సవాలు చేయడం.. చెక్కులు పంపిణీ చేయడంలాంటివి ఆ పార్టీకి ఓట్లు రాలుస్తాయా అనేది ప్రశ్నలా మారింది. మొత్తంగా ఈసారి దుబ్బాక పోరు మాత్రం నల్లేరు నడకలా లేదనేది అధికార పక్షానికి అర్థమైనట్లుగా స్పష్టమవుతోంది.

    -శ్రీనివాస్