TRS MLAs Purchase Case- KCR: ఢిల్లీలో చక్రాలు తిప్పాలి. దేశానికి ఒక రోల్ మోడల్ కావాలి. దానికి ముందు బిజెపిని ఇరకాటంలో పెట్టాలి. అందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ మార్గం అనుకున్నాడు.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు పాత్రధారులు అయ్యారు. అదృష్టం బాగా లేక “ఆ ముగ్గురు” నిందితులయ్యారు. కెసిఆర్ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇక్కడ కథ బాగానే నడిచేది. మరో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ అయ్యేది. బిజెపి ఇరకాటంలో పడేది. నరేంద్ర మోడీకి తన బొప్పి కట్టేది. అమిత్ షాపై పరుచుకున్న ముసుగులన్ని తొలగిపోయేవి. కానీ జరిగిందేమిటి? ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఆ స్టీఫెన్ రవీంద్ర ను నమ్ముకుంటే వమ్ము చేశాడు..సిట్ అధికారి ఆనంద్ దర్యాప్తునకు మాత్రమే పరిమితం అయ్యాడు. కోర్టుకు సీల్డ్ కవర్లో ఆధారాలు పంపించినా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవి ఎక్కడ పెట్టుకోవాలి అని ప్రశ్నించాడు. తాజాగా ఏసీబీ కోర్టు మెమో కొట్టివేసింది. అసలు కేసులోనే దమ్ము లేనప్పుడు కెసిఆర్ ఎన్ని జాకీలు పెట్టి లేపినా ఫాయిదా ఏముంటుంది? కెసిఆర్ సార్.. మీ ప్లాన్ ఎక్కడో బెడిసి కొట్టింది. అందుకే మాడు వాసన వస్తున్నది.

పరిస్థితులు బాగోలేవు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భారతీయ జనతా పార్టీని నిండా ముంచాలి అనుకున్న కెసిఆర్ కు, దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందానికి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. పైగా రోజు రోజుకు కేసు వీక్ అయిపోతున్నది. తాజాగా బి ఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి అనే ముగ్గురిని నిందితులుగా చేర్చాలని చేసిన ప్రయత్నం అడ్డంగా బెడిసి కొట్టింది. వాస్తవానికి ఫామ్ హౌస్ లో కేసు నమోదు చేసినప్పుడు ఈ ముగ్గురి పేర్లు ప్రస్తావించలేదు.. తర్వాత వారికి నోటీసులు జారీ చేశారు.. వారు తమ పేర్లు ఎఫ్ ఐ ఆర్ లు లేకుండా నోటీసులు జారీ చేయడం సరికాదని కోర్టు గుమ్మం తొక్కారు.. స్టే తెచ్చుకున్నారు.. ఇక్కడే ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు.
ఏసీబీ కోర్టు ఏం చేసిందంటే
తుషార్, సంతోష్, స్వామిని నిందితులుగా చేర్చాలని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. కానీ ఏసీబీ కోర్టు ఆ మెమోను తిరస్కరించింది. ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని, ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చలేరని తెలిపింది.. దీంతో పోలీసుల ప్రయత్నం అడ్డంగా బెడిసి కొట్టింది.. మరోవైపు హైకోర్టులో కనీసం స్టే కూడా ఎత్తి వేయించలేకపోతున్నారు.. దాంతో మాకు సంబంధం లేదని వారి తరపు న్యాయవాదులు గట్టిగా వాదిస్తున్నారు.. ఇక ఈ వ్యవహారంలో వారి పాత్ర ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యాలను ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా హైకోర్టుకు సమర్పించలేకపోతోంది.. ఇదే కాదు అసలు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఇవ్వాలని జగ్గు స్వామి వేసిన పిటిషన్ పై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ప్రత్యేక దర్యాప్తు బృందం తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకువచ్చి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడే అసలు విషయాన్ని అటు ప్రభుత్వం, ఇటు ప్రత్యేక దర్యాప్తు బృందం గమనించడం లేదు. తేడా గనుక వస్తే మొత్తం కేసు చేజారిపోతుంది.. సీన్ రివర్స్ అయిపోతుంది.

కెసిఆర్ సార్ కి ఏమైంది
సమకాలీన తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ తల పండిన రాజకీయ నాయకుడు. స్కెచ్ వేస్తే పకడ్బందీగా ఉంటుంది. అది బనీయన్ కు తెలియకుండా డ్రాయర్ ను లాగినట్టు ఉంటుంది. 2015లో ఇటువంటి ప్లాన్ వేసి చంద్రబాబును ఆంధ్రకు ఎలా తరిమికొట్టాడో చూశాం కదా! రేవంత్ రెడ్డి ని కారాగారం పాలు ఎలా చేశాడో తిలకించాం కదా! కానీ అటువంటి కెసిఆర్ వేసిన ప్లాన్ ప్లాఫ్ అవుతుందని అనుకుంటామా? కానీ రోజులన్నీ ఒకే తీరుగా ఉండవు అన్నట్టు.. ఇప్పుడు కేసీఆర్ వేస్తున్న ప్లాన్లు కూడా పెద్దగా వర్కౌట్ అవడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసు. బిజెపిని ఇరకాటంలో పెట్టాలని.. ప్లాన్ వేసిన కేసిఆర్ కు మునుగోడు విజయం మాత్రమే దక్కింది. అంతే అంతకుమించి ఏమీ లేదు. కమాన్ కేసీఆర్ సార్.. మీ బుర్రకు పదును పెట్టండి.