KCR vs BJP: కేంద్రంతో ఏడాదిగా యుద్ధం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎక్కడా పైచేయి సాధించలేకపోతున్నారు. తాజాగా మునుగోడు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవమారం తెరపైకి తెచ్చి కొంచెం పైచేయి సాధించినట్లు కనిపించారు. కానీ.. తర్వాత పరిస్థితితులు పెద్దగా అనుకూలించడం లేదు. రాష్ట్రంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తు చేయిస్తుండగా, కేంద్రం కూడా ఈడీ, ఐటీ, సీబీఐని రంగంలోకి దించి కేసీఆర్ సర్కార్‌కు ఊపిరి సడలకుండా చేస్తోంది. మరోవైపు గవర్నర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రొటోకాల్ విషయంలో బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కేంద్రానికి నివేదికలు పంపుతున్నారు. ఈ క్రమంలో కేంద్రాన్ని, గవర్నర్‌ను మరోసారి టార్గెట్ చేయాలనుకుంటున్నారు కేసీఆర్. ఇందుకు తెలంగాణ అసెంబ్లీని వేదికగా చేసుకోనున్నారు. కేంద్రంతోపాటు గవర్నర్ తీరుపై అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈమేరకు ముహూర్తం కూడా ఖరారైంది.

కీలక నిర్ణయాల తీసుకునే చాన్స్..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం – గవర్నర్ లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కేంద్రం – గవర్నర్ తీరుపైన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఈసారి కూడా స్పీకర్ అనుమతితోనే సమావేశాలు నిర్వహించబోతున్నారు. గవర్నర్ అనుమతి కోరకుండానే సెప్టెంబరులో సమావేశాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సెప్టెంబరు 6న సమావేశాలను ప్రారంభించగా.. 12, 13 తేదీల్లో మూడు రోజులు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో గవర్నర్ అధికారాల్లో ప్రధానమైన అంశంపై ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
12 నుంచి అసెంబ్లీ సమావేశాలు..
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 10న జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టే తీర్మానాలు – బిల్లుల పైనా కేబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. గత సమావేశాల కొనసాగింపుగానే ఈ సమావేశాల నిర్వహణగా ప్రభుత్వం పేర్కొంటోంది. గవర్నర్‌ను దూరం పెట్టాలన్న ఉద్దేశంతో ఈసారి కూడా స్పీకర్ ద్వారానే సమావేశాలను ప్రారంభించనుంది. ఈ సమావేశాల ద్వారా కేంద్రం తెలంగాణపై వ్యవహరిస్తున్న తీరు.. గవర్నర్ వైఖరిపైనా ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు.. ప్రతిపాదించే తీర్మానాలు కీలకం కానున్నాయి.
కేంద్ర తీరుకు నిసనగా తీర్మానాలు..
ఇప్పటికే కేంద్రం తెలంగాణ ప్రభుత్వంపై వ్యవహరిస్తున్న తీరును సీఎం కేసీఆర్‌తోసహా ఆ పార్టీ నేతలంతా తప్పు బడుతున్నారు. ఈ సమయంలోనే అసెంబ్లీ సమావేశాల వేదికగా కేంద్ర తీరును నిరసిస్తూ తీర్మానాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రుణాలపైన ఆంక్షలు, గ్రాంట్లను పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడాన్ని సభ ద్వారా ప్రజలకు వివరించనుంది. కేంద్రం ఆంక్షలు విధించకపోతే రాష్ట్ర జీఎస్‌డీపీ మరో రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ.14.50 లక్షల కోట్లకు చేరేదని, ఆంక్షల కారణంగా రూ.11.50 లక్షల కోట్లకే పరిమితమైందన్న ఆగ్రహంతో ప్రభుత్వం ఉంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన గ్రాంట్లను ఇవ్వడం లేదని.. 14వ, 15వ ఆర్థిక సంఘాల సిఫారసుల మేరకు గ్రాంట్లు విడుదల చేయడం లేదని ప్రభుత్వం చెప్పుకొస్తోంది.
దర్యాప్తు సంస్థల దాడులపై..
తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులపై ఐటీ, ఈడీ దాడులపైనా అసెంబ్లీ వేదికగా నిరసన తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేవలం కక్షపూరితంగానే దాడులు చేయిస్తోందని ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా మరోమారు తెలగాణ సమాజానికి తెలియజేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ వైఖరిని సభకు వివరిస్తూనే.. తీర్మానాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపే అవకాశముంది.

గవర్నర్ అధికారాల్లో కోతకు !?
రాష్ట్ర గవర్నర్ తీరును కూడా ప్రభుత్వం తప్పుపడుతోంది. ఈ సమావేశాల్లో గవర్నర్ వైఖరిపై చర్చించనున్నట్లు సమాచారం. గత సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదం కోసం గవర్నర్‌కు సిఫార్సు చేయగా, ఒక్క జీఎస్టీ బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించారు. మిగిలిన బిల్లులను పెండింగ్ లో ఉంచారు. ఈ బిల్లులను ఆమోదించాలంటూ ఓ తీర్మానం చేసి, గవర్నర్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తొలగించే బిల్లునూ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు మంత్రులు – పార్ట నేతల ఖండిస్తున్నారు. అయితే, సభలో జరిగే చర్చ ద్వారా గవర్నర్ తీరును ప్రజలకు వివరించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. గవర్నర్ కేంద్ర పెద్దలతో సమావేశాలు.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలతో రాజ్ భవన్ – ప్రభుత్వం మధ్య గ్యాప్ మరింతగా పెరుగుతోందనే అభిప్రాయం ఉంది. దీంతో, అసెంబ్లీ వేదికగా ఏం చేయబోతున్నారనే విషయంలో కేబినెట్ భేటీలో క్లారిటీ రానుంది.