TRS: 2018, డిసెంబర్ 7.. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి జరిగిన ఎన్నికల రిజల్ట్. అది ధర్మపురి నియోజకవర్గం. 2010 నుంచి నిర్విరామంగా గెలుస్తూ వస్తున్న నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మధ్య పోటాపోటీ రిజల్ట్ ఉంది. ఎవ్వరూ ఊహించని విధంగా కొప్పుల ఈశ్వర్‌కు తక్కువగా ఓట్లు నమోదయ్యాయి. డక్కామొక్కీలు తిని కేవలం 441 ఓట్ల మెజారిటీతో కొప్పుల ఈశ్వర్ గట్టెక్కారు. తన మెజారిటీకి అక్కడ గండిపడింది. కారణాలు ఆరా తీయగా రోడ్డు రోలర్ గుర్తుకు 16 వేలకుపైగా ఓట్లు పడ్డాయి. కారు గుర్తును పోలి ఉండటం వల్ల వృద్ధులు, నిరక్షరాస్యులు గంపగుత్తగా రోడ్డురోలర్ గుర్తుకు ఓటేసినట్టు తెలిసింది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో అచ్చం కారును పోలినట్టుగా ఉండే రొట్టె పీట గుర్తుపై పోటీ చేసిన స్వతంత్య్ర తమకు రావాల్సిన ఓట్లు పడ్డాయి.దుబ్బాకలో హౌరాహౌరీగా సాగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌లో విజయం చివరకు బీజేపీనే వరించింది. వెయ్యి ఓట్లకుపైగా మెజార్టీతో బీజేపీ, తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌ను ఓడించి సంచలనం స ష్టించింది. చివరి రౌండ్ వరకు దోబూచులాడిన విజయం.. చివరకు బీజేపీని వరించి అధికార టీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చింది. ఈ హౌరాహౌరీగా సాగిన ఈ పోటీలో తమ ఓటమికి ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించిన గుర్తు కూడా కారణం కావొచ్చని అనుమానిస్తోంది. దుబ్బాకలో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బండారు నాగరాజుకు మొత్తం 3489 ఓట్లు వచ్చాయి. అతడికి ఎన్నికల్లో కేటాయించిన గుర్తు రొట్టెలు చేసే పీట.
పై రెండు ఎన్నికల్లో దెబ్బతిన్న టీఆర్‌ఎస్‌కు ఈసారి హుజూరాబాద్‌లోనూ ఇలాంటి అనుభవమే ఎదురుకానుంది. హుజూరాబాద్ ఎన్నికను సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను, పార్టీ ప్రముఖులను హుజూరాబాద్‌లో ఉంచి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ ఉప ఎన్నికలోనూ కారును పోలిన చపాతిరోలర్ గుర్తు ఆ పార్టీకి గుబులు పుట్టిస్తోంది. ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌కు సంబంధించిన ఈ గుర్తు ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. అలాగే వెంకటేశ్వర్లుకు చెందిన రోడ్డు రోలర్ గుర్తు కూడా ఉంది. దీంతో దుబ్బాక సీన్ ఇక్కడా రిపీటైతే టీఆర్‌ఎస్ ఓటమి లేదా మెజారిటీ తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గుర్తుల పట్ల పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ద వహించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో మెజారిటీ తగ్గిన అంశాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏకంగా నమూనా బ్యాలెట్‌ను చూపిస్తూ ప్రజలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. కన్ఫూజ్ కాకుండా కారు గుర్తుకే ఓటేయాలని, రెండో నెంబర్‌లో ఉన్న గుర్తుకే ఓటేయాలని మరీ చెబుతూ గురువారం ప్రచారం నిర్వహించడం గమనార్హం.