Modi: నిన్నటికి వంద కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను దేశానికి పంచి ఒక గొప్ప మైలురాయిని సాధించాం. ఈ సంబరాన్ని అంబరాన్ని అంటేలా చేశారు ప్రధాని మోడీ. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంతటి ఘనత లేదని చాటిచెప్పారు. అక్టోబర్ 21 నాటికి 100 కోట్ల వ్యాక్సిన్లు పూర్తిచేయటం భారతావని సాధించిన విజయంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఇది సాధ్యం అయ్యిందన్నారు.
జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ కరోనా కారణంగా ఏర్పడ్డ కష్టనష్టాలను ముందుగా వివరించారు. దాన్ని ఎలా ఎదుర్కొంది ఇబ్బంది పడింది పేర్కొన్నారు. ఇప్పుడు 100 కోట్ల డోసులతో కరోనాను తరిమికొట్టిన వైనాన్ని ప్రపంచదేశాలు కొనియాడుతున్నాయని గర్వంతో చెప్పుకొచ్చారు. మహమ్మారిని విజయవంతంగా.. సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రధాని తెలిపారు.
దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చామని.. ఈ విజయంతో ప్రపంచదేశాలు భారత్ వైపు చూస్తున్నాయని మోడీ అన్నారు. అన్ని వర్గాలకు వ్యాక్సిన్ అందించామని.. ఇందులో ధనికులు, పేదవారు అనే తేడా లేకుండా ఒకే విధంగా వ్యవహరించామని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో 100 కోట్ల వ్యాక్సిన్ పూర్తి చేయడం గొప్ప కార్యక్రమంగా పేర్కొన్నారు.
సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా వ్యాక్సిన్ నినాదంతో భారత్ ముందుకెళుతుందని .. ఇది కొత్త చరిత్రగా ప్రధాని అభివర్ణించారు. 100 కోట్ల డోసులు దేశ సంకల్పమని అన్నారు. భారత ఫార్మా శక్తి ప్రపంచానికి తెలిసిందని ప్రధాని వ్యాఖ్యానించారు. అభివృద్ది చెందిన దేశాల్లో ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు రావడం లేదని.. కానీ మన ప్రజలు కరోనాను తరిమికొట్టేందుకు ముందుకొచ్చాని ప్రశంసించారు. ఇంత పెద్ద దేశానికి టీకాల సరఫరా అనేది సవాలేనన్నారు. కానీ కరోనాను ఎదుర్కొనే లక్ష్యంతో పనిచేశామని మోడీ తెలిపారు.
సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్లామని.. మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్లను అందించి సాధించామని మోడీ అన్నారు. రాష్ట్రాలకు డిమాండ్ అనుగుణంగా టీకాలు అందించామన్నారు. ఈ ప్రయత్నంలో ముందు నిలిచిన హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ను ప్రధాని అభినందించారు.
మేడిన్ ఇండియాకు ప్రాధాన్యం ఇవ్వాలని.. దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని.. వోకల్ ఫర్ లోకల్ ను ప్రమోట్ చేయాలని మోడీ కోరారు. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగం పుంజుకుంటుందని ప్రధాని వివరించారు. కరోనాపై పోరాటం ముగియలేదని.. పోరాడాల్సి ఇంకా ఉందని మోడీ అన్నారు. ఈ పండుగ సీజన్ లో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇక నుంచి కూడా మాస్కులు ధరించాలని.. పాదరక్షలను ధరించడాన్ని అలవాటు చేసుకున్నట్టు మాస్కులను అలవాటు చేసుకోవాలన్నారు. గత దీపావళికి దేశ ప్రజల్లో ఆవేదన, ఆందోళన ఉంటే ఈ దీపావళికి ఆ పరిస్థితి పోయిందని మోడీ ఆనందం వ్యక్తం చేశాడు. దీనివల్ల చిన్న దుకాణాలు, చిరు వ్యాపారులకు ఇది ఆశాకిరణంలా మారిందని మోడీ చెప్పారు.