Homeజాతీయ వార్తలుTRS vs BJP: ఐటీ, ఈడీ.. టీఆర్ఎస్ ను వేటాడుతున్న బీజేపీ.. కేసీఆర్ అర్జంట్ మీటింగ్

TRS vs BJP: ఐటీ, ఈడీ.. టీఆర్ఎస్ ను వేటాడుతున్న బీజేపీ.. కేసీఆర్ అర్జంట్ మీటింగ్

TRS vs BJP: అనుకున్నదే అయింది. బిజెపి చెబుతుందో అదే చేస్తోంది. కెసిఆర్ ను వరుసబెట్టి గోకుతోంది. అది కూడా మామూలు స్థాయిలో కాదు. అటు చికోటి ప్రవీణ్.. ఇటు ఢిల్లీ లిక్కర్ స్కాం.. మధ్యలో ఈడి, ఐటి.. టిఆర్ఎస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ తో ఒకటి ఇస్తే.. బిజెపి రిటర్న్ గిఫ్ట్ గా మూడు ఇచ్చింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రం మొత్తం చల్లగా ఉంటే.. ప్రగతి భవన్ మాత్రం వేడిగా ఉంది. మంత్రి మల్లారెడ్డి వైద్య కళాశాలలు, ఆయన నివాసాలు, కూతురు, అల్లుడు, కుమారుడి ఇంట్లో 50 బృందాలు మంగళవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఇక ఈ పరిణామంతో సీఎం కేసీఆర్ తనకు అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులను ప్రగతి భవన్ పిలిపించుకున్నారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన వారిలో మంత్రి మహమూద్ అలీ, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఉన్నారు.

TRS vs BJP
kcr, modi

బెంగాల్ ఫార్ములా ఇక్కడ

ఆరు నెలల క్రితం మోడీని ఎదిరించిన మమతా బెనర్జీ.. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఇందుకు కారణం ఆమె క్యాబినెట్ లో ఓ మంత్రి అక్రమాలకు పాల్పడటమే.. ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లో అక్రమాలకు పాల్పడిన ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.. అప్పుడు మొదలయిన ఈడి దాడులు నిన్న మొన్నటి వరకు బెంగాల్లో కొనసాగాయి. దీంతో మమతా బెనర్జీ మోడీ శరణజొచ్చింది. అయితే ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీకి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు. పైగా తెలంగాణకు వచ్చిన నాలుగు సార్లు కూడా నిరసన గళం వినిపించారు. పైగా మోడీ, ఈడి, బోడి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.. అన్నింటికీ మించి మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ అనే కేసును తెరపైకి తీసుకొచ్చారు.. దీంతో బీజేపీపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమంటూ సంకేతాలు పంపారు. అంతేకాదు బిజెపి జాతీయ నాయకులను రోడ్డుమీదికి లాగే ప్రయత్నం చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు దీనిని అంతగా పరిగణలోకి తీసుకొని బిజెపి.. ఇప్పుడు అసలు సిసలైన ఆట మొదలుపెట్టింది.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. దీనికి సంబంధించి అనేక పెద్ద తలకాయలు బయటపడుతున్నాయి.

ఎందుకు భయపడుతున్నారు

ఇటీవల జరిగిన టిఆర్ఎస్ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఒకరిద్దరి మీద ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేస్తారని కేసీఆర్ హెచ్చరించారు. ఆయన అన్నట్టుగానే ఆదాయపు పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గత వారం నుంచి అన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వస్తున్న ఆ అధికారులు.. అదును చూసి దాడులు మొదలుపెట్టారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బిజెపి జాతీయ కార్యవర్గ అధ్యక్షుడు బి ఎల్ సంతోష్ కు నోటీసు పంపిన మరుసటిరోజే ఈ దాడులు జరగడం గమనార్హం. అయితే దాడులు జరుగుతున్నంత సేపు మంత్రి మల్లారెడ్డి ఫోన్ ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన సమీప బంధువు ఇంట్లో రెండు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.. అయితే ఈ నగదుకు వారు ఎటువంటి ఆధారాలు చూపించలేదు. మల్లారెడ్డి వైద్య కళాశాలలో సీట్లను ఎక్కువ మొత్తానికి అమ్ముకున్నారని, కళాశాల లావాదేవీల లెక్కలు విరుద్ధంగా ఉన్నాయని ఐటి శాఖ అధికారులు గుర్తించారు. కేవలం మల్లారెడ్డి మాత్రమే కాకుండా ఆయన కళాశాలలోని డైరెక్టర్ల ఇంట్లో కూడా ఐటీ శాఖ సోదాలు చేస్తోంది.

TRS vs BJP
kcr, modi

కెసిఆర్ ఏం చెప్పారు

ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంపై టిఆర్ఎస్ నాయకులు నోరు మెదపడం లేదు.. అయితే ఈ సమావేశంలో ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులను కేసీఆర్ మందలించినట్టు తెలిసింది. ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే బాగుండదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తనకు తెలియకుండా ఎవరూ బయటకు వెళ్లొద్దని, అనవసర పంచాయితీల్లో వేలు పెట్టొద్దని సూచించారు. అయితే దక్షిణ తెలంగాణ చెందిన ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధుల పై ఐటీ అధికారులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. వారు చేస్తున్న వ్యాపార లావాదేవీలు లెక్కలు ఇప్పటికే సేకరించినట్టు సమాచారం. అయితే గత ఎన్నికల్లో ఈ ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్న వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే వారి వాంగ్మూలాన్ని కూడా అధికారులు రికార్డు చేసినట్టు వినికిడి. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో తెలంగాణలో వాతావరణం వేడెక్కింది. బిజెపిని గోకుతానని చెప్పిన టిఆర్ఎస్.. ఇప్పుడు అదే బిజెపి చేతిలో గోకబడుతోంది. పాపం మునుగోడు గెలిచిన ఆనందం కేసిఆర్ కు మిగలడం లేదు. టిఆర్ఎస్ కు పురాగ దక్కడంలేదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version