Telangana Election Results 2023: హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ పట్టు.. కానరాని కాంగ్రెస్‌!

హైదరాబాద్‌ విషయం చూసుకుంటే.. కారు జోరు నడుస్తోంది. హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో గులాబీ పార్టీ హవా నడుస్తోంది. హైదరాబాద్‌ పరిధిలోని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ 9, ఎంఐఎం 4, కాంగ్రెస్‌ ఒక స్థానంలో ముందంజలో ఉంది.

Written By: Raj Shekar, Updated On : December 3, 2023 1:59 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ జోరు నడుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 25 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిచిన స్పష్టమైన ఆధిపత్యం ఉంటుంది. కానీ, ఈసారి ఎన్నికల్లో తెలంగాణ అంతటా కాంగ్రెస్‌ గాలి వీస్తుంటే.. గ్రేటర్‌ పరిధిలో మాత్రం బీజేపీ, బీఆర్‌ఎస్‌ తమ పట్టును నిలుపుకున్నాయి. బీజేపీ గ్రేటర్‌ పరిధిలో 3 స్థానాల్లో అధిక్యత కనబరుస్తోంది. బీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే బీఆర్‌ఎస్‌ కచ్చితంగా గెలుస్తాం అనుకున్న స్థానాల్లోనూ వెనకంజలోనే ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్‌ఎస్‌ ముందు వరుసలో కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌ విషయం చూసుకుంటే.. కారు జోరు నడుస్తోంది. హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో గులాబీ పార్టీ హవా నడుస్తోంది. హైదరాబాద్‌ పరిధిలోని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ 9, ఎంఐఎం 4, కాంగ్రెస్‌ ఒక స్థానంలో ముందంజలో ఉంది. ముషీరాబాద్, అంబర్‌ పేట్, జూబ్లీహిల్స్, సనత్‌ నగర్, గోషామహల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ ముందు వరుసలో ఉంది. బీజేపీ కూడా గోషామహల్, కార్వాన్, యాకుత్‌పురాలో ఆధిక్యంలో ఉంది.

వెనుకబడిన కాంగ్రెస్‌..
హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ వెనుకబడింది. నాంపల్లిలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక్కడి నుంచి ఆ పార్టీ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ ఎంఐఎంపై ఆధిక్యం కనబరుస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ వెనుకబింది. దీనికి ప్రధాన కారణం, కాంగ్రెస్‌ గెలిస్తే హైదరాబాద్‌లో మళ్లీ అల్లర్లు జరుగుతాయన్న అభిప్రాయం హైదరాబాద్‌ ఓటర్లలో ఉంది. అందుకోసమే బీజేపీ, బీఆర్‌ఎస్‌తోనే హైరాబాద్‌ ప్రశాంతంగా ఉంటుందని చాలా మంది భావించారు. దీంతో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని తెలుస్తోంది. ఇక నాంపల్లి మైనార్టీలు ఎక్కువగా ఉన్నందున, అక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా అదే సామాజికవర్గానివకి చెందిన నాయకుడు కావడంతో గెలుపు అవకాశం కనిపిస్తోంది.

తక్కువ శాతం పోలింగ్‌..
నిజానికి హైదరాబాద్‌ పరిధిలో ఓటర్లు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. చాలా తక్కువ పోలింగ్‌ నమోదైంది. హైదరాబాద్‌ జిల్లాలో పోలింగ్‌ శాతం 46.56 మాత్రమే ఉంది. ఇది 2018లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన 50.31 శాతం కంటే తక్కువ. హైదరాబాద్‌ పరిధిలోని నియోజక వర్గాల్లోని పెద్ద సంఖ్యలో పోలింగ్‌ స్టేషన్స్‌ ఉన్నా.. ఓటర్లు ఓటు వేసేందుకు ఇంట్రస్ట్‌ చూపించలేదు.