Telangana Election Results 2023: రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు కనిపించే దర్పం.. ఆ తర్వాత క్రమేపీ మాయమవుతుంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఈ ఉదాహరణలో మొదటి దాకా నెంబర్ 2 గా వెలుగొందిన కేటీఆర్ ఉండటమే ఇక్కడ ఆశ్చర్యకరం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆయన పట్టు పట్టి ఖమ్మం, ఖానాపూర్ లో వేలు పెట్టాడు. ఫలితంగా కారు బోల్తా కొట్టింది. గులాబీ పార్టీ అభ్యర్థులను ఓడించింది. సాధారణంగా ఎన్నికల్లో ఓటమి గెలుపులు అనేవి సహజం. కానీ ఖానాపూర్, ఖమ్మం జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం కేటీఆర్ చేసుకున్న స్వయంకృతాపరాధం.
రేఖా నాయక్ ను కాదని..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రేఖా నాయక్ ఉండేవారు. ఈమె భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకురాలు. అయితే ఈ ఎన్నికల్లో ఆమెకు కాకుండా తన స్నేహితుడు జాన్సన్ నాయక్ కు కేటీఆర్ టికెట్ ఇప్పించుకున్నాడు. అయితే సర్వేలో తనకే అనుకూలంగా వచ్చిందని, జాన్సన్ నాయక్ కు టికెట్ ఎలా ఇస్తారు అంటూ రేఖా నాయక్ ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కేసీఆర్ ప్రకటించడం.. జాన్సన్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రవేశించడం.. రేఖ నాయక్ భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. తర్వాత జాన్సన్ నాయక్ కోసం కేటీఆర్ ప్రచారం కూడా చేశారు. అంతేకాదు రేఖా నాయక్ అల్లుడు మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పని చేస్తుండగా.. అతడిని ఆగమేఘాల మీద పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి బదిలీ చేశారు. ఇవన్నీ కూడా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల్లో బలమైన ముద్ర వేశాయి. చివరికి ఖానాపూర్ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ రేఖా నాయక్ కు కేటాయించింది. ప్రజల్లో సానుభూతి పెరగడంతో రేఖా నాయక్ జాన్సన్ నాయక్ మీద విజయం సాధించింది. ఇది ఒక రకంగా కేటీఆర్ కు చెంప పెట్టులాంటి తీర్పు. టూరిస్ట్ నాయకులను బలవంతంగా రుద్దితే ఎలాంటి ఫలితం ఇవ్వాలో అక్కడి ప్రజలు నిర్మొహమాటంగా చెప్పేశారు..
ఖమ్మం జిల్లాలోనూ..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కేటీఆర్ వేలు పెట్టారు. ఇక్కడ తనకు అత్యంత సన్నిహితుడైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు అపరిమితమైన స్వేచ్ఛ ఇచ్చారు. ఫలితంగా పువ్వాడ అజయ్ కుమార్ జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన తీరు నచ్చకపోవడం వల్లే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారని చర్చ నడుస్తోంది.. అయితే పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరం దాటి బయట ప్రచారానికి వెళ్లకపోవడం, కేటీఆర్ కూడా ఆయన చెప్పిన మాటలకు తల ఊపడంతో ఇక్కడ అధికార భారత రాష్ట్ర సమితికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. పువ్వాడ అజయ్ కుమార్ ఒంటెత్తు పోకడల వల్ల తాము రాజీనామా చేస్తున్నామని పలువురు కౌన్సిలర్లు, ఇతర భారత రాష్ట్ర సమితి నాయకులు తేల్చి చెప్పారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పేరు ఖరారు కావడంతోనే చాలామంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే మొదట్లో ఈ ప్రభావం అంతంత మాత్రమేనని భారత రాష్ట్ర సమితి నాయకులు భావించారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అవి భారత రాష్ట్ర సమితికి ప్రతిబంధకంగా మారాయి. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకంగా తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ బలపరిచిన సిపిఐ గెలుచుకోవడం ఇక్కడ విశేషం.. సో మొత్తానికి కేటీఆర్ ఈ నియోజకవర్గాలలో వేలు పెట్టకుండా ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.