Congress Rachabanda: తెలంగాణలో ఎనిమిదేళ్లుగా ఏకఛత్రాధిపత్యం చెలియిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ ఉందని వ్యంగ్యంగా మాట్లాడిన కేసీఆర్‌కు ఉప ఎన్నికల్లో విజయాలతో కనువిప్పు కల్పించింది. ఫాం హౌస్‌కే పరిమితమయ్యే కేసీఆర్‌ను బయటకు తీసుకొచ్చింది. తాజాగా కాంగ్రెస్ వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ కేసీఆర్‌కు కొత్త తలనొప్పిగా మారింది. రైతులను ఆకట్టుకునేలా ఉన్న డిక్లరేషన్ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న భావన సీఎంలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో దాదాపు 16 రోజులపాటు ఫాం హౌస్‌కు పరిమితమైన కేసీఆర్ కాంగ్రెస్ డిక్లరేషన్‌కు దీటుగా ప్రణాళిక రూపొందించే ప్రయత్నాలు చేశారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కేసీఆర్ ప్రణాళికకు అడ్డువస్తున్నాయి. ఇప్పటికే అప్పుల కోసం చేతులు చాస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజాకర్షక ప్లాన్ తయారీకి తిప్పలు పడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాని నిర్ణయించింది. మే 21 నుంచి నెల రోజులపాటు రైతు రచ్చబండ పేరుతో గ్రామగ్రామాన సమావేశాలు నిర్వహించాలని న ర్ణయించింది. దీంతో అప్రమత్తమైన కేసీఆర్ రైతు డిక్లరేషన్ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు రైతు రచ్చబండ కార్యక్రమాలను అడ్డుకోవాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకోవాలని కూడా సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా రైతు రచ్చబండ ప్రారంభం..
వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభ సందర్బంగా ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని టీపీసీ నిర్ణయించింది. ఈమేరకు ఇటీవల రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లడం అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రైతు రచ్చబండ పేరుతో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు శనివారం నుంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర జయశంకర్ స్వగ్రామం పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతురచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించి పాల్గొన్నారు.
మానకొండూర్ నియోజకవర్గంలో అడ్డగింత..
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన రైతు రచ్చబండ కార్యక్రమం శనివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభం కాగానే అక్కడకు చేరుకున్న టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. కాంగ్రెస్‌కు, టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిష¯Œ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ ఎస్సై ప్రమోద్‌రెడ్డి వెంటనే సిబ్బందితో మొగిలిపాలెం చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చారు. కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే వెళ్లిపోయారు.
పల్లెపల్లెకూ కాంగ్రెస్ పేరుతో..
రైతు డిక్లరేషన్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈమేరకు పల్లె పల్లెకూ కాంగ్రెస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించాని పిలుపునిచ్చింది. నియోజకవర్గాల వారీగా పల్లెపల్లెకు కాంగ్రెస్ పేరుతో సమావేశాలు, సభలు నిర్వహించి రైతులకు ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయం, గత హామీలను విస్మరించిన తీరును వివరించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు నెల రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
అయితే ఈ సభలను వీలైనంతవరకు అడ్డుకోవాలని టీఆర్‌ఎస్ నిర్ణయించడం ఆ పార్టీలో రైతు డిక్లరేషన్‌పై ఉన్న టెన్షన్ తెలియజేస్తుందని రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
Also Read:Pawan Kalyan CM Candidate: పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్.. టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందస్తు షరతు?