
కరోనా మహమ్మరి రాష్ట్రంలో విజృంభిస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ మే7వరకు పొడగించిన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల షాపులు మినహా అన్ని వ్యాపార సంస్థలు బంద్ అయ్యాయి. ప్రజారవాణా స్తంభించిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన కరోనా పోరాటంలో తమవంతు సహకారాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు. వైద్యులు ఆస్పత్రుల్లో, పోలీసులు రోడ్లపై డ్యూటీలు చేస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ వార్షికోత్సవం దగ్గరపడుతోంది. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావించి 20ఏళ్లు పూర్తి చేసుకోనుంది.
సాధారణ పరిస్థితుల్లో అయితే టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. అందులో టీఆర్ఎస్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కరోనా ఎఫెక్ట్ లేనట్లయితే ఈపాటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ శ్రేణులు సందడి మొదలయ్యేది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పడింది. కరోనా విషయంలో సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని కొంచెం కఠినంగానే చెబుతోన్నారు. అలాగే ఎవరైనా శుభకార్యాలు లాంటివి ఉన్నట్లయితే వాయిదా వేసుకోవాలని అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వార్షికోత్సవం సింపుల్ గానే నిర్వహించేందుకే కేసీఆర్ మెుగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈమేరకు టీఆర్ఎస్ యువ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పార్టీ శ్రేణులకు ఓ పిలుపు నివ్వడం ఆసక్తికరంగా మారింది. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటూ.. సామాజికహితానికి పాల్పడదామంటూ ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ట్వీటర్లో టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవాన్ని సూచించేలా కేసీఆర్ చిత్రపటంతో తయారు చేసిన మాస్క్‌ను ధరించిన ఫోటోలను సంతోష్ కుమార్ ట్వీట్ చేశాడు. ఈ రకమైన మాస్క్ లను తయారుచేసి ప్రజలకు పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అంతేకాకుండా మాస్కులను ధరించిన ఫొటోలను తనకు షేర్ చేయాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు ట్విటర్లో సంతోష్ కుమార్ కోరాడు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వార్షికోత్సవం ఎలా జరుగనుందనే ఆసక్తి పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఈసారి సింపుల్ గా కేసీఆర్ మాస్కులతో వార్షికోత్సవాన్ని ముగిస్తారో లేదో వేచి చూడాల్సిందే..!