Diwali Fire: వెలుగులు పండుగ దీపావళి. జీవితంలో వెలుగులను ఆహ్వానిస్తూ ప్రజలు జరుపుకునే వేడుక. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దీపావళి అంబరాన్ని తాకింది. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఇంటిళ్లపాదీ ఘనంగా జరుపుకున్నారు. కానీ ఏపీ, తెలంగాణ ఉభయ రాష్ట్రాలకూ అగ్నిప్రమాదం రూపంలో విషాదం వెంటాడింది. భారీగా ఆస్తినష్టం జరిగింది. పల్నాడు జిల్లా నరసారావుపేటలోని మార్కెట్ జంక్షన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 15 షాపులు దగ్ధమయ్యాయి. కోట్లాది రూపాయల సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది. మంగళవారం వేకువజామున ఓ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్వ్యూట్ తో మంటలు వ్యాపించాయి. క్షణాల్లో మిగతా షాపులకు అంటుకున్నాయి. అయితే ఈ హఠాత్ పరిణామంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. కళ్లెదుటే కోట్లాది రూపాయల సరుకు తగతలబడడంతో లబోదిబోమన్నారు. ఓ వర్క్ షాపు నుంచి మంటలు వచ్చాయని.. క్షాణాల్లో మిగతా షాపులకు వ్యాపించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి అదుపు చేయడంతో మిగతా షాపులు సేఫ్ గా నిలిచాయి. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉండేది. అటు అగ్నిమాపక శాఖ విద్యుత్ షార్ట్ సర్వ్యూటే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక నిర్థారణకు వచ్చింది.
తెలంగాణలో కూడా పలు చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ముషీరబాగ్ టింబరు డిపోలో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. మేడ్చల్ లోని చెంగిచెర్లలో ఓ స్క్రాప్ దుకాణంలో కూడా మంటలు వ్యాపించాయి. దీపావళి నేపథ్యంలో బాణసంచా కాల్చే క్రమంలో నిప్పులు పడడంతో ఒక్కసారిగా అక్కడ నిల్వ ఉంచి స్క్రాప్ దగ్ధమైంది. నిర్వాహకులకు భారీగా నష్టం చేకూరినట్టు తెలుస్తోంది. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలకు అగ్నిప్రమాదం రూపంలో కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లినా.. ఎటువంటి ప్రాణ నష్టం కలగకపోవడం ఉపశమనం కలిగించే విషయం.
రెండేళ్ల కొవిడ్ విరామం తరువాత ప్రజలు ఆనందంగా పండుగ చేసుకున్నారు. 2020లో కొవిడ్ వ్యాప్తితో ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. గత ఏడాది కూడా కొంత వరకూ ఆంక్షలు కొనసాగాయి. ఈ ఏడాది కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.