Temperature Drops In Telangana: వాతావరణం మారిపోయింది. దీపావళితో మన బాంబుల వేడితో పాటు చలి అలుముకుంది. మనం అగ్గి రాజేస్తే.. ప్రకృతి చలిని పెంచింది. ఇప్పుడు తెలంగాణ మొత్తం చలి కమ్మేసింది. ఉదయం 9 గంటల వరకూ కూడా సూర్యుడు ఆ పొగమంచు నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ముఖ్యంగా హైదరాబాద్ ను మంచు దుప్పటి ఆవహించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ తోపాటు చుట్టుపక్కల జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి , వికారాబాద్ జిల్లాలతోపాటు మిగతా జిల్లాల్లోనూ మరో 4 రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది.
ఇక రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని.. హైదరాబాద్ పరిధిలో సోమవారం 14.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలిగాలుల తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణలో సహజంగానే చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో 2 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోతుంటుంది. డిసెంబర్ , జనవరిలో ఈ స్థాయిలకు చేరుతుంది. హైదరాబాద్ లోనూ 10 డిగ్రీల లోపే ఉంటుంది. ఇప్పుడే ఇంత చలిగా ఉందంటే మున్ముందు హైదరాబాదీలు, తెలంగాణ వాసులు గడ్డకట్టే చలిని ఎదుర్కోవడం ఖాయమంటున్నారు. ఉత్తర భారతం ఆ పై నుంచి వీస్తున్న శీతల గాలుల వల్లే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నట్టు తెలుస్తోంది.