Revanth Reddy- Dharani: దివాలా కంపెనీకి ధరణి బాధ్యతలు: కెసిఆర్ చేసిన పాపమిదీ!

వాస్తవానికి ధరణి పథకాన్ని 2008లో ఒడిస్సా ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. అప్పుడు కూడా ఇదే సంస్థతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

Written By: Bhaskar, Updated On : June 14, 2023 7:04 pm

Revanth Reddy- Dharani

Follow us on

Revanth Reddy- Dharani: ధరణి మీద కాంగ్రెస్ ఏమాత్రం రాజీ పడటం లేదు. ధరణిని రద్దు చేస్తామని చెప్పేవాళ్లను బంగాళాఖాతంలో కలిపేయాలని కెసిఆర్ పిలుపునిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. పైగా రోజుకొక కీలకమైన సమాచారాన్ని తెరపైకి తీసుకొస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తీసుకొస్తున్నారు. అధికారులను బోనులో నిలబెట్టేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ మాటకు ఆ మాట భారత రాష్ట్ర సమితికి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి మాత్రం ఇది చేతకావడం లేదు. అది కేవలం రాముడు, పాతబస్తీ చుట్టే చక్కర్లు కొడుతోంది. ఇక రేవంత్ రెడ్డి కేవలం ధరణి మీద మాత్రమే కాకుండా.. భూదాన్ భూములను ప్రభుత్వం ఎలా ఇతరులకు కట్టబెట్టిందో వివరాలతో సహా నిరూపించారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో భూదాన్ భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ పెద్దపెద్ద వ్యక్తులకు ఎలా కట్టబెట్టింది, ధరణి లోకి రాకుండా ఎలా అడ్డుకుంది అనే వివరాలను పూస గుచ్చినట్టు రేవంత్ రెడ్డి విలేకరులకు వివరించారు. దీనిని ఆ మండలానికి చెందిన తహసీల్దార్ ధ్రువీకరించారు. ఇది మర్చిపోకముందే భారత రాష్ట్ర సమితి పై రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు.

దివాళా కంపెనీకి ధరణి అప్పగించారు

తన మానస పుత్రికగా చెప్పుకునే ధరణి మొత్తం లోప భూయిష్టమేనని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గేమ్ చేంజర్ లాగా అభివర్ణించుకుంటున్న ఈ ధరణి ని ఫిలిప్పీన్స్ లో 90 వేల కోట్లకు అక్కడి బ్యాంకులను ముంచిన ఐ ఎల్ ఎఫ్ ఎస్ అనే సంస్థకు అప్పగించారని, దీని బాధ్యతను ఆంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీధర్ రాజు అనే వ్యక్తి పర్యవేక్షిస్తున్నాడని రేవంత్ రెడ్డి సంచలన విషయాలు బయట పెట్టారు. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయని భూ దోపిడిని కేసీఆర్ ప్రభుత్వం చేసిందని రేవంత్ రెడ్డి లెక్కలతో సహా చూపించారు.

ఏం చేసినా తప్పు లేదు

వాస్తవానికి ధరణి పథకాన్ని 2008లో ఒడిస్సా ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. అప్పుడు కూడా ఇదే సంస్థతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అదంతా తప్పుల తడకగా ఉండడంతో ఆ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పైగా కొద్ది రోజులపాటు ధరణి సేవలు నిర్వహించిన ఆ సంస్థ పనితీరును కాగ్ తప్పు పట్టింది. అలాంటి సంస్థతో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక భారీ భూ దోపిడి ఉందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ధరణి వచ్చిన 22 నెలల్లో 50 వేల కోట్ల భూ లావాదేవీలు జరిగాయి. ఇవన్నీ కూడా శ్రీధర్ రాజు ఖాతాలోకి వెళ్తున్నాయని రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం చెల్లిస్తున్న డబ్బులు మొత్తం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడని, ఒకవేళ భూమి రిజిస్ట్రేషన్ కాకపోతే ఆ డబ్బులు తిరిగి రావడం లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కెసిఆర్ పుణ్యం వల్ల ఇక్కడి ప్రజల విలువైన డాటా ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఐఎల్ఎఫ్ ఎస్ సంస్థ చేతిలోకి వెళ్తుందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలాంటి నెత్తి మాసిన పనులు చేసిన కేసీఆర్, కేటీఆర్ ను అసెంబ్లీలో చెట్టుకు వేలాడదీసి ఉరి తీసినా పాపం లేదని రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ధరణి వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరిగిన భూ లావాదేవీలపై విచారణ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.