Chandrababu Jail: చంద్రబాబు కేసులో రేపు కీలకం..

ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారా? అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు తొలినుంచి క్వాష్ కోసమే ప్రయత్నం చేశారు.

Written By: Dharma, Updated On : October 26, 2023 1:58 pm

Chandrababu Jail

Follow us on

Chandrababu Jail: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత 48 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏసీబీ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయనకు ఇంతవరకు ఊరట దక్కలేదు. మరోవైపు సిఐడి కేసుల మీద కేసులు వేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ తరుణంలో చంద్రబాబు ఆరోగ్యం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆది నుంచి కేసుల కొట్టివేత వైపే చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అయితే అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో పిటీషన్ దాఖలు అయింది. దీనిపై రేపు విచారణ జరగనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారా? అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు తొలినుంచి క్వాష్ కోసమే ప్రయత్నం చేశారు. హైకోర్టులో ఈ పిటిషన్ డిస్మిస్ అయింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అయితే నవంబర్ 8 వరకు తీర్పును రిజర్వ్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా 17 ఏ సెక్షన్ చుట్టూనే వాదనలు సాగాయి. అటు ఫైబర్ కేసులో సైతం మద్యంతర బెయిల్ కేసు విచారణ నవంబర్ 9కి వాయిదా పడింది. ఇటువంటి పరిస్థితుల్లో స్కిల్స్ స్కామ్ లో హైకోర్టులో బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ల పైన వెకేషన్ బెంచ్ రేపు విచారణ చేపట్టనుంది. దీంతో అందరి దృష్టి హైకోర్టు పైనే ఉంది.

ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్య దుస్థితిని దృష్ట్యా మధ్యంతర బెయిల్ లభిస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జతపరిచినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా చంద్రబాబు ఆరోగ్యం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టులో క్వాష్ ఎటువంటి తీర్పు వచ్చినా.. అంతకంటే ముందుగానే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేయడం వ్యూహాత్మకమేనని తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండడంతో హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వచ్చినా…ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని.. చంద్రబాబు అనారోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించే అవకాశం ఉంది. మొత్తానికైతే చంద్రబాబు కేసులు విషయంలో రేపు కీలకము. రేపు గానీ బెయిల్ రాకుంటే… నవంబర్ వరకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.