Tollywood vs YCP: టాలీవుడ్ కేంద్రం హైదరాబాద్ లో ఉంది. సినీ హీరోలు, నిర్మాతలు, ప్రముఖులంతా అక్కడే ఉంటున్నారు. సినిమా షూటింగ్ లన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎంతో పనేంటి? అక్కడ థియేటర్లు ఉన్నాయి.. షోలు నడుస్తున్నాయి.. డబ్బులు వస్తున్నాయి.. అందుకే టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఆంధ్రప్రదేశ్ సీఎంను.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు. అందుకే ఒళ్లుమండిన వైసీపీ బ్యాచ్ టాలీవుడ్ పై ప్రతీకారం మొదలుపెట్టిందా? అంటే ఔననే అంటున్నారు వైసీపీ నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైసీపీ మనోగతాన్ని ఆవిష్కరించినట్టైంది.
‘ఈ ఆంధ్రరాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అనే ఒఖ ముఖ్యమంత్రి ఉన్నాడని టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, హీరోలు అనుకుంటున్నారా? ఎంతసేపు హైదరాబాద్ లో కూర్చొని.. తెలంగాణలో సినిమాలు చేసుకొని.. అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడొక ఆంధ్రప్రదేశ్ ఉందని మీకు గుర్తుందా?.. సినిమా వాళ్లను బలిసే విధంగా చేశావ్ చంద్రబాబు’ అని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అసలు ఆంధ్రప్రదేశ్ సీఎంను.. ఇక్కడి వారిని గుర్తించారా? పట్టించుకున్నారా? అని నల్లపురెడ్డి చేసిన కామెంట్స్ నిజంగానే లాజిక్ గా ఉన్నాయి. అలా అని అంతా సినీ ఇండస్ట్రీదే తప్పు అనడానికి లేదు. జగన్ సర్కార్ తనకు లేని అధికారాన్ని అన్వయించుకొని టికెట్ రేట్లు తగ్గించి చూపించాలనుకోవడం కూడా తప్పు. కానీ ఇంత వివాదానికి కారణం టాలీవుడ్ తో చంద్రబాబుకు సాన్నిహిత్యమేనని తేలింది.
సినీ ఇండస్ట్రీలో మొత్తం చంద్రబాబు కమ్యూనిటీ ఉందని.. మీ సామాజికవర్గానికి అండగా చంద్రబాబు సినీ ఇండస్ట్రీకి పెద్దపీట వేసి పేదలకు టికెట్ రేట్లు తగ్గించలేదని వైసీపీ భావిస్తోంది. అంటే టాలీవుడ్ లో ఉన్నది కమ్మ హీరోలు.. కమ్మ దర్శకులు నిర్మాతలు.. వారికి బాబు అండ ఉంది.. వాళ్లంతా జగన్ ను సీఎంగా గుర్తించడం లేదు. అందుకే వైసీపీలో ఈ పగ ప్రతీకారం పెరిగి సినిమా టికెట్ల ధరల తగ్గింపు.. ఆన్ లైన్ టికెటింగ్ ను చేసినట్టుగా అర్థమవుతోంది.
ఇన్నాళ్లు సీఎం జగన్ , వైసీపీ ఎందుకు టాలీవుడ్ పై ఈ పగ సాధిస్తోంది.? టికెట్ రేట్లు ఎందుకు తగ్గించారన్న దానికి సరైన కారణాలు వాళ్లకు కనిపించలేదు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో సమాధానాలు దొరికాయి.. ఒకటి టాలీవుడ్ ప్రముఖులు జగన్ ను సీఎంగా గుర్తించడం లేదు. రెండోది టాలీవుడ్ అంతా చంద్రబాబుకు మద్దతుగా ఉండడం.. ఈ రెండింటి వల్లే జగన్ పంతం పట్టి టాలీవుడ్ పై పగ సాధిస్తున్నాడని వైసీపీ ఎమ్మెల్యే మాటలను బట్టి తెలుస్తోంది.