పవన్ కల్యాణ్ గొప్పేంటీ? సినిమా ఇండస్ట్రీలో.. అందరిలాగే ఆయన కూడా ఒక నటుడు. మిగతా హీరోల మాదిరిగానే ఆయనకూడా నటిస్తాడు.. వారిలాగే డైలాగులు చెబుతాడు.. డ్యాన్సులు కడతాడు.. మరి, ఈయన ఎందుకంత స్పెషల్? అభిమానులు కాకుండా.. భక్తులు మాత్రం ఎందుకు ఉంటారు ఈయనకు? ఇది చాలా మంది ప్రశ్న. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి కేవలం ప్రజలు ఆనందించడానికి నటించడం మాత్రమే కాదు.. జనం కోసం జీవిస్తాడు. వారి బాగు కోరుకుంటాడు. అందుకోసం ఉద్యమిస్తాడు కూడా! అందుకే.. ఆయన స్పెషల్. వెరీ వెరీ స్పెషల్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేని ఫ్యాన్ బేస్ సంపాదించుకొని, మహోన్నత ఆశయం వైపు కదులుతున్న సినీరాజకీయ నేత పవర్ స్టార్!
అయితే.. పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా మారిన సంగతి అందరికీ తెలుసు. రీ-ఎంట్రీతో సినిమాలు కూడా చేస్తున్న సంగతీ తెలుసు. కానీ.. పవన్ రాజకీయ నాయకుడిగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది? చెమట చిందని కారవాన్ లో రిలాక్స్ కావాల్సిన అగ్ర నటుడు.. మండు టెండలో నడవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? సినిమాలు.. ఓపెనింగ్స్.. రెమ్యునరేషన్.. స్టార్ డమ్ వంటివి లెక్కేసుకోవాల్సిన పవర్ స్టార్.. ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అన్నప్పుడు మాత్రం సూక్ష్మంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
‘‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో’’ అంటారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ మాటలు పవన్ చదువుకున్నాడో లేదో కానీ.. ఆచరణలో మాత్రం పెట్టేశాడు. ఒక్క సినిమాకు కోట్లాది రూపాయల పారితోషికం.. ఆయనతో సినిమాలు చేసేందుకు ఎదురు చూసే దర్శకులు, నిర్మాతలు.. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడి హోదా.. ఇవేవీ ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు. ప్రజల కోసం పనిచేయడం, వారికోసం జీవించడమే ఆయనకు తృప్తినిచ్చాయి. అయితే.. ఈవైపుగా ఆయనను పురి కొల్పింది ఏంటీ అన్నప్పుడు.. ముందుగా కనిపించే ఏకైక సమాధానం ‘పుస్తకం’!
అవును.. పవన్ కల్యాణ్ ను ఈవైపుగా నడిపించింది పుస్తకాలేనని ఆయన చాలాసార్లు చెప్పారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఉత్సుకత కల్పించింది కూడా పుస్తకమేనంటారు పవర్ స్టార్. అయితే.. ఇప్పటి వరకూ ఎన్నో పుస్తకాలు చదివిన పవన్ కు.. అత్యంత ఇష్టమైన పుస్తకాలు ఏవీ? అన్నప్పుడు ఒక షార్ట్ లిస్టు ఇక్కడ ఉంది. మరి, అవి ఏంటీ? అన్నది చూద్దాం.
పవన్ కల్యాణ్ ఇంటర్ లో ఉన్నప్పుడే చదివిన పుస్తకం ‘‘తాకట్టులో భారతదేశం’’. తన తండ్రి దగ్గర నుంచి ఈ పుస్తకం తీసుకొని చదివినట్టు ఒక సందర్బంలో చెప్పారు పవన్. ఈ పుస్తకంలోని అంశాలు, సారాంశం తనను చాలా కదిలించాయని, తనపై ఎంతో ప్రభావం చూపాయని చెబుతారు.
సౌతాఫ్రికా స్వాతంత్ర్య సమరయోధుడు నెల్సన్ మండేలా జీవితం గురించి చాలా మందికి తెలుసు. ఆయన రాసిన ‘లాంగ్ వాక్ టూ ఫ్రీడమ్’. అనే పుస్తకం కూడా తనను చాలా ప్రభావితం చేసిందని అంటారు పవన్. బద్రి సినిమా షూటింగ్ సమయంలో మండేలా జైలు శిక్ష అనుభవించిన గదిని స్వయంగా వెళ్లి చూసి వచ్చారు. ఇది తనలో ఎంతో స్ఫూర్తి నింపిందని అంటారు పవర్ స్టార్. దీన్నిబట్టి.. పవన్ రాజకీయాల్లో రావడానికి ముందే సామాజిక స్పృహ కలిగి ఉన్నాడని స్పష్టమవుతోంది.
చేగువేరా గురించి పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పవర్ స్టార్ ప్రతి సినిమాలోనూ చేగువేరా బొమ్మ కనీసంగా ఉండేది. ఆ విధంగా మెజారిటీ తెలుగు వారికి చేగువేరా పరిచయం కావడంలో పవన్ సినిమాల పాత్ర కూడా ఉందని చెప్పొచ్చు. అలాంటి పవన్ ను చేగువేరా రచనలు, ఆయన చరిత్ర ఎంతగానో ప్రభావితం చూపాయని అంటారు పవర్ స్టార్.
అదేవిధంగా.. మార్టిన్ లూథర్ కింగ్ పుస్తకాలు కూడా తనపై ఎంతో ప్రభావం చూపాయని చెబుతారు. కొన్ని సంవత్సరాల పాటు మార్టిన్ లూథర్ కింగ్ పుస్తకాలు తనను వెంటాడాయని అన్నారు. వీటిని మిగిలిన వారు కూడా చదవాలని చెప్పారు పవన్.
ఇక, పవన్ ను అమితంగా ఆకర్షించిన పుస్తకాల్లో మరొకటి బాలగంగాధర తిలక్ కవితా సంపుటి ‘అమృతం కురిసిన రాత్రి’. ఈ కవితా సంపుటి పవన్ ను ఎంతగా కదిలించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జనసేన ప్రారంభోత్సవం సమయంలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ నోటి నుంచి వినిపించిన తొలి మాటలు.. ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటిలోనివే కావడం గమనార్హం. ఈ విధంగా.. తనలో భాగమైన పుస్తకాలను అందరూ చదవాలని కోరుకున్నారు పవన్. దీంతోపాటు వనవాసి, ఆధునిక మహాభారతం, తొలిపొద్దు వంటి పుస్తకాలను కూడా చదవాలని సూచించారు. పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్బంగా.. ఇదీ ఆయన పుస్తక జీవితంపై కథనం. హ్యాపీ బర్త్ డే టూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్.