https://oktelugu.com/

సీఈసీ ఏం నివేదిక ఇవ్వబోతున్నారు..? దొంగ ఓట్ల కథ కంచికేనా..!

ఎంతో ఉత్కంఠ.. మరెన్నో ఆసక్తికర పరిణామాల మధ్య తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ముగిసింది. 55 శాతానికి పైగా ఓటింగ్‌ శాతం నమోదైంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేశారా.. లేదా అని తెలియకుండా ఓటింగ్‌పై ప్రతిపక్షాలు లొల్లి పెడుతున్నాయి. ఈ పోలింగ్‌లో దొంగ ఓట్లు వేశారంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. వైసీపీ పూర్తిగా రిగ్గింగ్‌కు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి లిఖితపూర్వకంగా అలిపిరి పీఎస్‌లో ఫిర్యాదు […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 21, 2021 1:37 pm
    Follow us on

    Tirupati Lok Sabha seat
    ఎంతో ఉత్కంఠ.. మరెన్నో ఆసక్తికర పరిణామాల మధ్య తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ముగిసింది. 55 శాతానికి పైగా ఓటింగ్‌ శాతం నమోదైంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేశారా.. లేదా అని తెలియకుండా ఓటింగ్‌పై ప్రతిపక్షాలు లొల్లి పెడుతున్నాయి. ఈ పోలింగ్‌లో దొంగ ఓట్లు వేశారంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. వైసీపీ పూర్తిగా రిగ్గింగ్‌కు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి లిఖితపూర్వకంగా అలిపిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

    ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదని, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని పనబాక లక్ష్మి అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి జిల్లా నలువైపులా నుంచి దొంగ ఓట్లు వేయించేందుకు మనుషులను తీసుకొచ్చారని.. అంతేకాదు నకిలీ ఓటరు కార్డులను సైతం సృష్టించారని ఆరోపించారు. ఎస్పీకి ఫోన్‌ చేసినా స్పందించలేదని.. ఈసీకి ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని అన్నారు. మరోవైపు.. తిరుపతి ఉప ఎన్నికను వెంటనే రద్దు చేసి రీ పోలింగ్‌ పెట్టాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపిస్తున్నారు.

    ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికలో రిగ్గింగ్‌ జరిగినట్లుగా ఆధారాలతో సహా విపక్షాలు ఈసీ ముందు ఉంచారు. దొంగ ఓటర్లు ఎక్కడి వారు.. ఎలా వచ్చారు.. కళ్లకు కట్టారు. టీడీపీ అభ్యర్థితోపాటే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈసీకి ఏకంగా 12 పేజీల లేఖ రాశారు. టీడీపీ, బీజేపీలతో పాటే ఇతర పార్టీల నేతలు, స్వతంత్ర అభ్యర్థులు సైతం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌‌కు ఫిర్యాదు చేశారు. కానీ.. ఈసీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.

    అయితే.. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ఇక్కడ సీనియర్‌‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌‌ విజయానంద్‌ సీఈవోగా విధుల్లో ఉన్నారు. ఆయన సైతం దొంగ ఓటర్లపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని టీడీపీ ప్రధాన ఆరోపణ. అయితే.. ఇప్పుడు ఈ పంచాయితీ అంతా కూడా సీఈసీ ఇచ్చే నివేదికపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే దీనిపై విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ విజయానంద్‌ కనుక ఎలాంటి దొంగ ఓట్లు పోల్‌ కాలేదని నివేదిక ఇస్తే రీపోలింగ్‌కు ఎలాంటి ఆస్కారం ఉండదు. అయితే.. విజయానంద్‌ అధికార పార్టీకి మద్దతుగా ఉంటారని.. ఆయన నివేదిక సైతం వైసీపీకి అనుకూలంగా వెళ్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ సీఈసీ కనుక అదే నిర్ణయం ప్రకటిస్తే.. హైకోర్టుకు వెళ్లేందుకు టీడీపీ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడు సీఈసీ ఇచ్చే నివేదిక.. భవిష్యత్తులో టీడీపీ చేసే ఫిర్యాదులపైనే ఈ దొంగ ఓటర్ల లెక్క తేలనుంది.