Homeఆంధ్రప్రదేశ్‌‘తిరుపతి’ అభ్యర్థుల ఆస్తిపాస్తులు ఇవీ

‘తిరుపతి’ అభ్యర్థుల ఆస్తిపాస్తులు ఇవీ

Tirupati by-poll
మరికొద్ది రోజుల్లో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల జరగబోతోంది. ఇప్పటికే నామినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండగా.. అఫిడవిట్లలో నమోదు చేసిన అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. తొమ్మిదిసార్లు తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఆరుసార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చింతా మోహన్‌కు ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు. అలాగే.. వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గురుమూర్తి పేరిట కారు లేదు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు రూ.19.50 కోట్ల ఆస్తిపాస్తులున్నాయి.

గురుమూర్తి ఆస్తుల వివరాలివీ..
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన అఫిడవిట్‌లో సమర్పించిన ఆస్తులు మొత్తంగా రూ.47.25 లక్షలుగా చూపారు. ఆయన పేరిట రూ.10,66,515 విలువైన చరాస్తులున్నాయి. ఇందులో గురుమూర్తి భార్య పేరిట రూ.7 లక్షల విలువైన కారు ఉంది. ఏర్పేడు మండలంలో మన్నసముద్రం గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి (డీకేటీ), 2610 చదరపు అడుగుల్లో ఇల్లు ఉంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం వీటి విలువ రూ.5 లక్షలుగా పేర్కొన్నారు. వీరికి ఎలాంటి అప్పులు లేవు. క్రిమినల్‌ కేసులూ లేవు. గురుమూర్తిపై ఆధారపడిన కార్తికేయ నిక్షాల్‌ దగ్గర రూ.2.92 లక్షల విలువైన 62 గ్రాముల బంగారం, డెలీనా నిక్షాల్‌ దగ్గర రూ.3.73 లక్షల విలువైన 83 గ్రాముల బంగారం ఉన్నట్లు వెల్లడించారు.

రత్నప్రభ ఆస్తులు
బీజేపీ అభ్యర్థి.. రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌‌ అయిన రత్నప్రభ కుటుంబ ఆస్తుల విలువ మొత్తం రూ.24,68,52,141. ఇందులో రత్నప్రభ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.19,57,75,095. రత్నప్రభ భర్త ఎ.విద్యాసాగర్‌‌ పేర ఉన్న ఆస్తుల విలువ రూ.5,10,77146గా పేర్కొన్నారు. రత్నప్రభ చేతిలోని నగదు కేవలం రూ.25,000. వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు రూ.2.81 కోట్లు. బాండ్ల రూపంలో రూ.28 వేలు, తపాలా పొదుపు ఖాతాలో రూ.4 లక్షలు ఉన్నాయి. రూ.52 లక్షల విలువైన 1,250 గ్రాముల బంగారం, రూ.1.95 లక్షల విలువైన 3 కిలోల వెండి ఉంది. రూ.16 లక్షల విలువైన రెండెకరాల వ్యవసాయ భూమి, రూ.3 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి కలిగి ఉన్నారు. ఎస్‌బీఐలో ఆమె పేరిట రూ.2.43 లక్షల రుణం ఉంది. ఎ.విద్యాసాగర్‌‌ పేరిట కోటి విలువైన చరాస్తులు, రూ.4.10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆంధ్రాబ్యాంకులో రూ.17.30 లక్షల వ్యవసాయ రుణం తీసుకున్నారు. వీరిపై ఎలాంటి కేసులు లేవు.

చింతా మోహన్‌ ఆస్తులు
కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌ పేరిట ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు. ఆయన వార్షికాదాయం రూ.6.10 లక్షలుగా అఫిడవిట్‌లో ప్రస్తావించారు. ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.3.27 కోట్లు. ఇవన్నీ భార్య చింతా రేవతి పేరిటనే ఉన్నాయి. వీటిలో రూ.2 లక్షల నగదు, రూ.14,40,000 విలువైన 400 గ్రాముల బంగారం ఉంది. తిరుపతిలో 20 సెంట్ల వ్యవసాయేతర భూమి ఉంది. దీని విలువ రూ.1.20 కోట్లుగా పేర్కొన్నారు. తిరుపతి రామచంద్రనగర్‌‌లో రూ.95 లక్షల విలువైన కమర్షియల్‌ కాంప్లెక్స్‌ ఉంది. ఎస్‌బీఐలో రూ.19.11 లక్షల అప్పు ఉంది. వీరిపై ఎలాంటి కేసులు లేవు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular