ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పని మానేసి ప్రభుత్వ ఉద్యోగులు టిక్ టాక్ చేశారు. అది దుమారం అయ్యి వారు సస్పెండ్ అయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కూడా అప్పట్లో ఇలానే ఆఫీసులోనే టిక్ టాక్ చేశాడు. సస్పెండ్ అయ్యాడు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నా లెక్కేలేదు.. చివరకు ఆస్పత్రుల్లో కూడా ఈ టిక్ టాక్ పిచ్చి చోటుచేసుకుంది. చస్తున్నా కూడా టిక్ టాకే లోకమైంది.. చిన్నా.. పెద్ద.. ముసలి ముతక అంతా ఇప్పుడు పొద్దున లేస్తే టిక్ టాక్ లోకమే.. మొన్నీ మధ్య భార్య టిక్ టాక్ మాయలో పడి సంసారాన్ని వదిలేయడం.. ఓ యువకుడితో ఎఫైర్ పెట్టుకోవడం భర్త కడతేర్చాడు. మరో భార్య టిక్ టాక్ తో పాపులర్ అయ్యి ఓ యువకుడితో లేచిపోయింది. ఇలా టిక్ టాక్ లేని సమాజాన్ని ఇప్పుడు ఊహించలేం. అది లేకపోతే బతకలేం.. ఇప్పుడు టిక్ టాక్ భారత ప్రజలకు వ్యసనంలా మారింది..
ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?
అయితే నాణేనికి మరో వైపు కూడా ఉంది.. మురికివాడలోని ఓ ముస్లిం యువకుడు టిక్ టాక్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యి కోటీశ్వరుడయ్యాడు. మన హైదరాబాదీ ఉప్పల్ బాలు కూడా ఇలానే టిక్ టాక్ తో పాపులయ్యాడు. టిక్ టాక్ లో ఫేమస్ అయిన కొందరికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇలా టిక్ టాక్ తో పాపులరైన వాళ్లు దేశంలో వేలంలో ఉన్నారు. దీంతో డబ్బులు సంపాదించుకున్న బ్యాచ్ కూడా ఎక్కువ..
ఇలా టిక్ టాక్ సామాన్యులను సెలబ్రెటీలను చేసింది కానీ ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది. పొద్దస్తమానం టిక్ టాక్ తోనే గడుపుతూ సంసారాన్ని నాశనం చేసుకున్న జంటలు దేశంలో వేలల్లో ఉన్నారు. దేశంలో దాదాపు 20 కోట్లమందికి పైగా ఈ యాప్ ను దుర్వినియోగం చేసిన వ్యక్తులే ఎక్కువమంది దేశంలో ఉన్నారు. టిక్ టాక్ వల్ల వేల కుటుంబాలు నాశనమయ్యాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. బూతు ఎక్కువైపోయింది. విశృంఖలత్వం పెరిగిపోయింది. భారతీయ సంప్రదాయలు మంటగలిసి చిన్న పిల్లలు, యువతులు కూడా బట్టలిప్పి నగ్నంగా నృత్యాలు చేసే దుస్థితికి టిక్ టాక్ పిచ్చి తీసుకెళ్లింది.
వైసీపీలో విజయసాయిరెడ్డి సీన్ ముగిసిందా?
అందుకే ఇంత కల్లోలానికి కారణమవుతున్న టిక్ టాక్ ను నిషేధించాలని కొద్దిరోజులుగా దేశంలో సామాజిక ఉద్యమకారులు నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. మానవహక్కుల సంఘాలు దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశాయి.
అయితే టిక్ టాక్ చైనా యాప్.. దీనివల్ల భారత్ కు రూపాయి లాభం లేదు. యాడ్స్ రూపంలో వేల కోట్లను ఈ చైనా యాప్ కొల్లగొట్టింది. ఆ సంపద అంతా చైనాకే పోయింది. రాజకీయ నేతలు, ప్రభుత్వాలను మెయింటేన్ చేసిన ఈ సంస్థ ఇన్నాళ్లు పబ్బం గడిపిందన్న ప్రచారం ఉంది. కానీ పాపం పండింది. అదే చైనా వల్లే కావడం గమనార్హం.
ఎందరు సామాజిక ఉద్యమకారులు, మానవ హక్కుల సంఘాల వారు గళమెత్తిన మన సర్కార్ టిక్ టాక్ ను నిషేధించలేదు. కానీ చైనా తాజాగా 20 మంది భారత సైనికులను చంపగానే ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. కేంద్రాన్ని తాకాయి. కేంద్రం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చైనాపై దౌత్య యుద్ధం చేయడానికి డిజిటల్ యుద్ధం మొదలుపెట్టింది. చైనాయాప్స్ నిషేధించి మనతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు బుద్ది చెప్పింది.
ఏది ఏమైతేనేం.. ఈ టిక్ టాక్ వల్ల ఎన్నో కాపురాలు కూలాయి. ఎన్నో జీవితాలు కుదేలయ్యాయి. ఇన్నాళ్లకు చైనా దుందుడుకు చర్యల వల్లే ఆ దేశ యాప్ నిషేధానికి గురైంది. భారతీయులకు విముక్తి కలిగింది. ఇప్పటికైనా ఈ విశృంఖలత్వ యాప్ లకు ప్రజలు దూరంగా ఉంటే అందరికీ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సమాజాన్ని కలుషితం చేస్తున్న ఇలాంటి యాప్స్ ప్రమాదకరం అంటున్నారు.
-నరేశ్ ఎన్నం