
కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని బెంబెలేత్తిస్తోంది. కరోనా మహమ్మరి దాటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో కరోనా అంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాయి. ఇదిలా ఉండగానే కరోనాపై సోషల్ మీడియాలో పలురకాల తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ముందు వెనుక ఆలోచించకుండా ఈ పుకార్లను నమ్మి కొందరు ఆస్పత్రి పాలవుతోన్నారు. కరోనా రాకుండా ఈ పదార్థాలను తీసుకోవాలని టిక్ టాక్ లో వీడియో వచ్చింది. ఈ వీడియోలోని పదార్థాలను తిని పలువురు ఆసుప్రతిపాలైన సంఘటనలో ఆంధప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని ఆలపల్లికి చెందిన రెండు కుటుంబాలు కరోనాపై వచ్చిన టిక్ టాక్ వీడియోను తిలకించారు. ఉమ్మెత్త పువ్వు జ్యూస్ తాగితే కరోనా వ్యాప్తి చెందదని ఈ వీడియోలో ఉంది. ఇందులో చెప్పింది నిజమేనని నమ్మిన ఈ రెండు కుటుంబాల్లోని వ్యక్తులు ఉమ్మెత్త పువ్వు జ్యూస్ చేసుకుని తాగేశారు. వీరంతా కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థత పాలుకావడంతో గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. 10మంది వరకు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరిలో చిన్నపిల్లల నుంచి వృద్ధులదాకా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి ప్రాణహాని కలుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ నేపథ్యంలో వైద్యాధికారులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనాపై కేవలం ప్రభుత్వ సూచనలు మాత్రమే ప్రజలు పాటించాలని కోరుతుంది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని సూచించారు. శుభ్రతను పాటించడం, ముఖానికి మాస్కు ధరించడం, శానిటైజర్ వాడడం, తరచూ చేతులు శుభ్రంగా కడుకోవడం, స్వీయనియంత్రణ పాటించడం ద్వారా కరోనా మహమ్మరికి దూరంగా ఉండొచ్చని వైద్యులు, పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా కరోనాపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.