Tigers: నీరు ఎత్తు నుంచి పల్లం ప్రాంతానికి ప్రవహిస్తుంది. అది సృష్టి నియమం కూడా. కేవలం నీరు మాత్రమే కాదు.. జంతువులకు కూడా ఇది వర్తిస్తుంది. కాకపోతే ఎత్తు, పల్లం నిబంధనలు ఇక్కడ వర్తించవు. కేవలం ఆహారం, గూడు, నీరు అనేవి మాత్రమే జంతువుల వలసకు వర్తిస్తాయి. జంతువులలో మిగతా వాటితో పోల్చి చూస్తే.. పులులు కాస్త విభిన్న తత్వాన్ని ప్రదర్శిస్తుంటాయి. ఆహారం, ఆవాసం, తోడు, సురక్షితం ఇలా అన్ని విషయాలలోనూ పకడ్బందీ లెక్కలతో ఉంటాయి.
తెలంగాణకు సరిహద్దున మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్రలో దట్టమైన అడవులు ఉన్నాయి. అయినప్పటికీ అక్కడి పులుల కొన్ని ప్రస్తుతం తెలంగాణకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలలో సంచరిస్తున్నట్టు తెలుస్తోంది.
సరిగ్గా కొద్ది రోజుల క్రితం టిప్పరేశ్వర్ అభయారణ్యం, తడోబా రిజర్వ్ నుంచి కొన్ని పులులు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అందులో కొన్ని పులులు దక్షిణ మార్గంలో ఉన్న ప్రాంతాలలోకి వెళ్లిపోయాయని తెలుస్తోంది. అయితే కొన్ని పులులు ఈ మార్గాల గుండా ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి అనుకూలమైన వాతావరణము లేదు. ఎందుకంటే ఈ ప్రాంతాలలో గతంలో దట్టమైన అడవులు ఉండేవి. అక్రమార్కులు ఈ అడవిని చదును చేయడం వల్ల పులులు ఆ మార్గాల గుండా వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందని టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో మల్యాలపల్లి సమీపంలో పులి ఉన్నట్టు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.. ” ఇక్కడ పెద్దగా అటవీ ప్రాంతం లేదు. కానీ కొన్ని కొండల వద్ద ఒక మేకల కాపరి పులి కాలి ముద్రలను చూసినట్టు మాకు చెప్పాడు. మేము పులిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని” డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కొమరయ్య పేర్కొన్నారు.
ఈ పులి గతంలో రామగుండం సమీపంలోని సింగరేణి ప్రాంతాలలో కనిపించింది. పులి కనిపించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ జిల్లా పరిధిలోని 12 మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కొమురయ్య సూచించారు. కామారెడ్డి జిల్లాలో గత వారం కల్పించిన ఒక పులి ఇప్పటికీ ఆ ప్రాంతంలో కనిపిస్తూనే ఉంది. అది అనేక పశువులను వెంబడించింది. కొన్ని పశువులను చంపి తినేసింది. పులి తిన్న తర్వాత మిగిలిన కళేబరాలను చూసి అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులి నిరంతరం సంచరిస్తున్న నేపథ్యంలో పశువులను చంపి తినే అవకాశం ఉండవచ్చని అడవి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు దోమ కుంట, బిబి పెంట, బిక్నూరు మండలాలలో పులి కదలికలు కనిపించాయి.
కొత్తగా వచ్చిన పులుల వల్ల.. ఈ ప్రాంతంలో ఉన్న మిగతా పులులు కూడా బయటకు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం లో ఒక పులి ఉన్నట్టు అటల్ శాఖ అధికారులకు సమాచారం అందింది. ఈ పులి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి మల్లేశ్వరం, వేమకల్, యంగంపల్లి ప్రాంతం నుంచి వచ్చి ఉండవచ్చని అధికారులు భావించారు. ” ఈ పులి ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి కృష్ణ నదికి అవతలి వైపు నుంచి వచ్చింది. గత ఏడాది కూడా ఒక పులి నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి తిరిగి వచ్చింది” అని కొల్లాపూర్ అటవీశాఖ అధికారి ముజీబ్ గౌరీ వెల్లడించారు. ” అప్పటినుంచి అది కనిపించలేదు. దాని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం. మా రేంజ్ ఆఫీసర్ హుస్సేన్, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర నాయకత్వంలో పులి సంచారం గురించి పరిశీలిస్తున్నాం. ఇక్కడ కెమెరా ట్రాప్ లు అందుబాటులో ఉంచాం. నదిని దాటి నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ లోకి తిరిగి వెళ్లే బదులు అది అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లోకి వెళ్లి ఉండవచ్చని” గౌరీ ప్రకటించారు. పులి సంచారం ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో సమీప ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. మహారాష్ట్ర ప్రాంతంలో ఆహారం సరిగా లభించకపోవడం, ఆడపులుల సంఖ్య తక్కువగా ఉండడంతో పులులు ఇటువైపు వస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.