YCP: ఇప్పటివరకు వైసీపీ ఆరు జాబితాలను ప్రకటించింది. దాదాపు 69 చోట్ల సిట్టింగ్లను మార్చింది. ఎంపీలను ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్యేలను ఎంపీలుగా స్థానచలనం కల్పించింది. అయితే మరో రెండు, మూడు జాబితాలు వెల్లడించే అవకాశం ఉంది.అయితే ఇంతవరకు కీలక మంత్రుల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం విశేషం. ఇందులో చాలామంది మంత్రులు సొంత పార్టీ నుంచి అసమ్మతి ఎదుర్కొంటున్నారు. మరికొందరు పార్టీ చేపట్టిన సర్వేల్లో వెనకబడ్డారు. అటువంటి వారంతా ఆందోళన చెందుతున్నారు. హై కమాండ్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తే… ప్రత్యామ్నాయ అవకాశాలను చూసుకుంటామని ఎదురుచూస్తున్నారు.
మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, విశ్వరూప్, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, దాడిశెట్టి రాజా, రాజన్న దొరల విషయంలో ఇంతవరకు స్పష్టత లేదు. ఇందులో కొంతమంది సీనియర్లకు పోటీ లేదు. నియోజకవర్గంలో ప్రత్యామ్నాయం కూడా లేదు. అయితే అలాగని వారిని కొనసాగిస్తారని గ్యారంటీ లేదు. గుడివాడ అమర్నాథ్ స్థానంలో ఒక యువకుడిని నియమించారు. మంత్రి గుమ్మనూరు జయరాం స్థానంలో ఒక జడ్పిటిసికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తమ విషయంలో కూడా అది జరగదన్న గ్యారెంటీ ఏంటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు.
అయితే సీట్ల కేటాయింపులో జాప్యం జరుగుతుండడంతో చాలామంది మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే మంత్రులం కానీ.. గత నాలుగున్నర సంవత్సరాలుగా తమను పనిచేసుకోనివ్వలేదని.. కనీసం తమ శాఖల గురించి.. ప్రగతి గురించి చెప్పుకోలేని పరిస్థితి తమదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికీ నవరత్నాల్లో లెక్క కట్టి తమ చేతులు కట్టేశారని వాపోతున్నారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట తమ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం అవమానకరంగా భావిస్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేల విషయంలో ఖరారు చేశారు. మంత్రులుగా ఉన్న తమను మాత్రం విస్మరించారు. దీంతో తమ స్థాయి ఏంటో తేల్చుకోలేక పోతున్నామని కొందరు సీనియర్ మంత్రులు లోలోపల మదన పడుతున్నారు. నియోజకవర్గం క్యాడర్ కు సైతం తమకే టికెట్ వస్తుందని చెప్పలేక సతమతమవుతున్నారు. మరికొందరు అయితే తమను ఎక్కడ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటిస్తారోనని ఆందోళన చెందుతున్నారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ను తప్పించి భరత్ అనే యువకుడికి అప్పగించారు. గుడివాడ అమర్నాథ్ ను గాల్లో పెట్టారు. మంత్రి గుమ్మనూరు జయరామ్ ను ఆలూరు నియోజకవర్గం నుంచి తప్పించారు. కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. జయరాం స్థానంలో జడ్పిటిసి విరూపాక్షకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కర్నూలు ఎంపీ అభ్యర్థి నుంచి సైతం జయరాంను తప్పించారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజులకు సొంత పార్టీలోనే అసమ్మతి ఉంది. వీరి విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. మొన్నటి వరకు ఒంగోలు ఎంపీగా రోజాను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెబుతున్నారు. గుడివాడ అమర్నాథ్ కు ఎంపీగా అవకాశమిస్తారని టాక్ నడిచింది. కానీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి ప్రకటించారు. అక్కడ కూడా అవకాశం లేకుండా పోయింది. అటు సీదిరి అప్పలరాజుకు పలాసలో ఇతర సామాజిక వర్గాల నుంచి పోటీ ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మంత్రుల టెన్షన్ అంతా కాదు. తమ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంపై అధినేత జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు.