Telangana Congress: తెలంగాణ ఎన్నికల సమరం జోరందుకుంది. నామినేషన్ల ప్రిక్రియ మొదలు కావడంతో టికెట్లు దక్కిన నేతలు నామినేషన్ వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు ఇంకా మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ వంద స్థానాలకు, కాంగ్రెస్ 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా 4స్ధానాలకు అభ్యర్దులను ప్రకటించలేదు. ఇందులో మూడు స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవే కావడం గమనార్హం. దీంతో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక విధమైన అయోమయం నెలకొంది.
అధికార పార్టీలో ఢీ కొట్టేందుకు..
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగ స్ధానాలకు అభ్యర్దులను ప్రకటించకపోవడంతో ఆపార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. ఒకవైపు మిగిలిన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసుకొని ప్రచారాలలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ నాలుగు స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఎప్పుడుంటుందోనని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ఈ మూడు స్థానాలు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్నవే కావడంతోపాటు ఈసారి కూడా అక్కడ కాంగ్రెస్ గెలుపుపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో అందరి దృష్టి ఆమూడు స్ధానాలపైనే ఉంది. రెండు రోజుల తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.
క్యాడర్‌లో అయోమయం..
రాష్ట్రమంతా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. క్యాడర్ కూడా ఉత్సాహంగా తమ నేతలను గెలిపించాలని ప్రచారం చేస్తుంది. కానీ ఈ మూడు నియోజకవర్గాల్లోనే పరిస్థితి పునరావృతం కావడంతో ఇక్కడి పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి, అయోమయంలో ఉన్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, మందుల సామేల్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పోటీపడుతున్నారు.
ఆ మూడు జిల్లాల్లో పట్టు..
కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మంచి పట్టు ఉంది. ఈసారి ఈ మూడు జిల్లాల్లో కలిపి కనీసం 30 స్థానాలు గెలవాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ఆ మేరకు పార్టీ కూడా పుంజుకుంది. ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో ఇప్పటికే ప్రచారం జోరు పెంచింది. అయితే నల్లగొండ విషయంలోనే ఆచితూచి అడుగులు వేస్తోంది.