AP CM Jagan : ఏపీ సీఎంగా జగన్ కొలువుదీరగానే టీడీపీ దండు ఆయన మీద పడింది. జగన్ ప్రతీ నిర్ణయాన్ని కోర్టుకెక్కి అడ్డుకుంది. జగన్ ఏరికోరి చేసిన మూడు రాజధానుల నిర్ణయం కూడా కోర్టు స్టేతో ఆగిపోయింది. ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్న ధృడమైన అభిప్రాయంతో వైసీపీ అధ్యక్షుడు , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే న్యాయవ్యవస్థతో ముఖాముఖి ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సీఎం జగన్ మూడు రాజధానులపై సంచలన స్టెప్ వేశారు. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల సమస్యపై కేసు విచారణ నుంచి తమను తాము విరమించుకునేలా చూడాలని జగన్ ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాను కోరడం సంచలనమైంది.
రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కీలక వాదన వినిపించారు. ఇద్దరు న్యాయమూర్తులు గత టీడీపీ ప్రభుత్వం నుంచి ప్లాట్లు పొందారని.. వారిని ఈ మూడు రాజధానుల పిటీషన్ నుంచి తొలగించాలని కోరుతూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మీ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పిటీషన్ దాఖలు చేశారు. ఇద్దరు న్యాయమూర్తులకు గత ప్రభుత్వం భూములు కేటాయించినందున.. వారు మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పును ప్రభావితం చేయవచ్చని ప్రభుత్వం తరుఫున వాదించారు.
అయితే ప్రధాన న్యాయమూర్తి ఈ పిటీషన్ ను తిరస్కరించినప్పటికీ ప్రస్తుత న్యాయమూర్తులపై జగన్ కు ఉన్న విశ్వాసం లేకపోవడాన్ని ఇది స్పష్టంగా బట్టబయలు చేసింది. పలువురు న్యాయమూర్తులు గత టీడీపీ ప్రభుత్వం నుంచి ప్లాట్లు పొందారని తేలింది.
న్యాయమూర్తుల చిత్తశుద్ధిని ప్రశ్నించినందుకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మిశ్రా ప్రభుత్వాన్ని నిలదీశారు. తాను కూడా ఏపీ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నానని.. కేసు విచారణ నుంచి తప్పుకోవాలా? వద్దా అని కూడా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. తీర్పు చివరి దశలో ఇద్దరు న్యాయమూర్తుల ఉపసంహరణ అంశాన్ని పరిశీలిస్తామని సీజే తెలిపారు. కావాలంటే మీరు కేసును మరో రాష్ట్ర హైకోర్టు బదిలీ చేసుకోవచ్చని.. సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేయవచ్చని ఏపీ సర్కార్ కు గట్టి షాక్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు మూడు రాజధానుల కేసు విచారించేందుకు జగన్ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ కేసును సీజే చెప్పినట్టు మరో హైకోర్టుకు బదిలీ చేస్తారా? లేక ఏపీ హైకోర్టు తీర్పును అంగీకరిస్తారా? అనేది ఆసక్తికంగా మారింది.
కర్ణాటక లేదా చెన్నై హైకోర్టుకు కేసును బదలాయించిన చట్టపరమైన ప్రక్రియ మళ్లీ ప్రారంభం కావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకూ మూడు రాజధానుల ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతుంది.