
Kodali Nani- Viveka Murder Case: గతంలో ఎన్నడూలేనంతగా జగన్ సర్కారు ఇంటా బయటా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 175 నియోజకవర్గాలకు 175 గెలుస్తామన్న ధీమా ఉన్నా.. లోలోపల మాత్రం భయపడుతోంది. ఇటీవల వరుసగా చుట్టుముడుతున్న అంశాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కాం, పార్టీలో ధిక్కార స్వరాలు.. ఇలా ఒక్కో సమస్యా జగన్ కు చికాకు తెప్పిస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నేతలు కొడాలి నాని వంటి వారు అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కేవలం ప్రత్యర్థులపై విరుచుకుపడే నాని వంటి వారు విధానపరమైన అంశాలను తిప్పికొట్టడంలో మాత్రం తికమకపడుతున్నారు.
మొన్న వైసీపీ వర్క్ షాపు అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును ప్రస్తావించారు. అసలు సీఎం జగన్ కు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. ఈ క్రమంలో వివేకానందరెడ్డి సీఎం జగన్ బాబాయ్ అన్న విషయం మరిచిపోయారు. వివేకా చచ్చినా..బతికినా అంటూ నాని కామెంట్స్ మొదలుపెట్టారు. దినం ఖర్చులు, కాఫీ ఖర్చులు అంటూ చెలరేగిపోయారు. డి హత్యకేసులో కొన్ని విషయాలను బయటపెట్టేశారు. ‘వివేకానందరెడ్డి బతికి ఉన్నా.. జగన్ అవినాష్ రెడ్డికే ఎంపీ సీటు ఇచ్చుండేవారు. ఎందుకంటే కాంగ్రెస్ కు రాజీనామా చేసి కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీచేసినప్పుడు వివేకానందరెడ్డి ప్రత్యర్థులకే సపోర్టు చేశారు. అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కరరెడ్డి మాత్రం వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు. ఆయన విజయానికి తొడ్పాటు అందించారు. అందుకే జగన్ వారికే టిక్కెట్ ఇస్తారంటూ వ్యాఖ్యానించారు.

అంతటితో ఆగకుండా జగన్ నాశనాన్ని కోరుకున్నాడు కనుక హత్య జరిగినా తప్పులేదన్న అర్ధం వచ్చేలా నాని మాట్లాడారు. అవినాష్ రెడ్డికి అండగా జగన్ ఉండడాన్ని సమర్థించుకున్నారు. అయితే ఇది నాని అభిప్రాయమే కాదు. జగన్ అభిప్రాయం కూడా. కేవలం తమను వ్యతిరేకించారు కనుక వివేకాకు ఏం జరిగినా తప్పులేదన్న సరికొత్త వాదన ఇబ్బందికరంగా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత కుటుంబమంతా ఏకతాటిపైకి వచ్చి జగన్ ను ప్రోత్సహించింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబాన్ని ఏకతాటిపైకి తేవడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇప్పుడు కొడాలి నాని వంటి వారిని ప్రయోగించడంతో ఆయన కొన్నిరకాల వ్యాఖ్యలు చేసి హత్య వెనుక ఉన్న అనుమానాలను నిజం చేశారు.
అయితే వివేకా హత్య ఘటనలో నానిపై ముప్పేట విమర్శలు రావడంతో మరోసారి ఆయన మీడియా ముందుకొచ్చారు. నాటి సీఎం చంద్రబాబు, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు, మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలను సీబీఐ విచారణ చేస్తే వివేకానందరెడ్డి హత్యకేసు నిందితులు బయటపడతారన్నకొత్తపల్లవి అందుకున్నారు. వారే హత్యచేయించారని కూడా ఆరోపించారు. జగన్ కు సీబీఐ కేసులు కొత్త కాదన్నారు. పరిటాల రవి హత్యకేసులో తనపై తాను సీబీఐ దర్యాప్తు వేయించుకున్న వ్యక్తి జగన్ అన్నారు. చంద్రబాబు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. వివేకానందరెడ్డి హత్యకేసులో చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా వద్ద ఏమైనా ఆధారాలుంటే సీబీఐకి సమర్పించాలని సవాల్ చేశారు. మొత్తానికైతే మొన్న మాట్లాడిన మాటల్లో అనుమానాలను నివృత్తి చేసే క్రమంలో ఇప్పుడు చంద్రబాబు, ఇంటెలిజెన్స్ చీఫ్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
