Four TRS MLAs- Pragati Bhavan: తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు పర్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో మధ్యవర్తులతో బేరసారాలు ఆడిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావు నాలుగు రోజులుగా ప్రగతిభవన్ గేటు దాటడం లేదు. తమను కొనుగోలు చేసేందుకు ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలతో భారీ డీల్‌కు ప్రయత్నించడం.. ఆ ఎమ్మెల్యేలే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడం.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడం పెద్ద రచ్చగా మారింది.. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టులు, పదవులు ఆశ చూపిన వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది.. డీల్ సమయంలో.. ఢిల్లీలోని పెద్దలతోనూ మాట్లాడించే ప్రయత్నాలు జరిగినట్టు కూడా తెలుస్తోంది.. మొత్తంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా గుట్టును రట్టు చేశారు.. ఆడియో, వీడియో రికార్డింగ్‌లు సహా అన్ని ఆధారాలతో ఈ భారీ డీల్‌కు యత్నించినవారిని పట్టుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ బాగోతం మొత్తం బయటపడగా.. ఆ తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.

ఈ ముగ్గురు.. ఆ నలుగురితో మంతనాలు..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపెట్టినట్లు చెబుతున్న నలుగురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశరావు అదేరోజు రాత్రి ప్రగతిభవన్‌లో చర్చలు జరిపారు. మరుసటి రోజు కూడా కారికార్డ్స్, సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను ఈ ముగ్గురు, ఆ నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి వీక్షించినట్లు సమాచారం.
ఆ నలుగురు ఎందుకు బయటకు రావడం లేదు..
బీజేపీ కొనుగోలుకు బేరం ఆడుతున్నట్లుగా ప్రచారం చేస్తున్న నలుగురు ఎమ్యెల్యేలు నాలుగు రోజులుగా ప్రగతి భవన్‌కే పరిమితం కావడం విస్మయం కలిగిస్తోంది. ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి అక్కడే ఉండడం, మీడియాను తప్పించుకొనే ప్రయత్నం చేయడం చేస్తున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు మరికొన్ని రోజులు ప్రగతి భవన్‌లోనే ఉంటారని టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు చెప్తున్నారు. వాళ్లు ప్రగతి భవన్‌లోనే ఉన్నా, కేసీఆర్ వారితో మాట్లాడలేదని, వారి నుంచి వివరాలన్నీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సేకరించి కేసీఆర్‌కు వివరిస్తున్నారని చెప్తున్నారు.
ఆడియోలో కేసుల ప్రస్తావన లేదు..
రామచంద్ర భారతితో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడినట్టుగా చెప్తున్న రెండు ఆడియోలు శుక్రవారం లీకయ్యాయి. ఈ ఆడియోలో ఎక్కడా కేసుల ప్రస్తావన లేదు. బీజేపీలో చేరకుంటే ఈడీ, ఇతర సంస్థలతో దాడులు చేయిస్తామన్న మాటే లేదు. అయినా రోహిత్ తనకు డబ్బులిస్తామని చెప్పారని, తాను బీజేపీలో చేరకుంటే ఈడీ దాడులు చేయిస్తామని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 26న ఫామ్‌హౌస్‌లో కొనుగోళ్ల డీల్ జరిగినట్టు చెప్తున్నా, అంత వరకు దీనిపై రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 24కు ముందే ఆయన రామచంద్ర భారతితో ఫోన్‌లో మాట్లాడినప్పుడు తనను ప్రలోభ పెడుతున్న విషయం ఎందుకు ఫిర్యాదు చేయలేదనేది సందేహాస్పదంగా మారింది.
పార్టీ మారేందుకు రోహిత్ రెడీ..
కాగా, ఆడియోల్లో సంభాషణ చూస్తుంటే.. పైలట్ రోహిత్‌రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకే నందుతో కలిసి బేరసారాలు నడిపట్లు అర్థమవుతోంది. ఆయన వెంట మరో ఇద్దరిని కూడా తీసుకొస్తానని కూడా సంభాషణలో చెప్పడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌లో ఆడియో ఎవిడెన్స్ ఉందని చెప్తున్నా.. వాటిని పోలీసులు కోర్టుకు సమర్పించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవే ఆడియో ఫైల్స్‌ను ప్రగతి భవన్ మీడియాకు విడుదల చేయడానికి వెనుక కారణలేమిటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్‌పై అనుమానాలు..
ప్రగతి భవన్ నుండే ఆడియో రికార్డులు బయటికి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రముఖుల ఫోన్లు, ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫోన్లతోపాటు సొంతపార్టీ ఎమ్మెల్యే ఫోన్లు పైతం ట్యాపింగ్ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. తమ ఫోన్లు కూడా ట్యాప్ అయి ఉంటాయని టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రగతి భవన్ నుంచే ఫామ్ హౌస్ ఎపిసోడ్‌కు సంబంధించిన ఆడియో లీక్స్ రావడం ట్యాంపింగ్‌ల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో నందకుమార్‌తోపాటు రామచంద్రభారతి, సింహయాజీల ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. వారి ఫోన్లలో ఉన్న రికార్డింగులనే ప్రగతి భవన్ నుంచి లీక్ చేశారా? లేక రాష్ట్రంలో ప్రముఖులందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీల నాయకులు, కీలక అధికారులు, పలువురు మీడియా ప్రతినిధుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది.

ఆడియో టేప్‌లు కోర్టుకు ఎందుకివ్వలేదు?
ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ సంభాషణలు అంటూ లీక్ చేసిన ఆడియో టేప్‌లను కోర్టుకు సమర్పించకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ఈ రికార్డులు ఫోన్‌ట్యాపింగ్ ద్వాచా చేసినవే అని అనుమానిస్తున్నారు. రికార్డులు సమర్పిస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే పోలీసులు ఈ రికార్డులు కోర్టుకు సమర్పించలేదని తెలుస్తోంది.
ఎడిటింగ్‌పై అనుమానాలు..
మరోవైపు ఆడియో రికార్డులు క్రియేట్ చేసినవా అనే సందేహాలను కూడా బీజేపీ స్టేట్ చీఫ్ మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఘటన స్థలంలో దొరికిన ఆధారాలన్నీ నిందితులను కోర్టుల ప్రవేశపెట్టినప్పుడు సమర్పించాలి. కానీ పోలీసులు చాలా విషయాలు దాచినట్లు తెలుస్తోంది. మీడియాకు కనిపించిన బ్యాగులు ఏమ య్యాయో ఎవరూ చెప్పడం లేదు. ఇక లీక్ చేస్తున్న ఆడియో రికార్డులు అన్నీ క్రియేట్ చేసినవే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజమైనవే అయితే అదే రోజు లీక్‌చేయడమో, మరుసటిరోజు కోర్టులో సమర్పించడమో చేసేవారని, రెండు రోజుల తర్వాత విడుదల చేయడం, ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌లోనే ఉంచడంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు డైరెక్షన్‌లో ఆడియో క్రియేషన్ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అవి నిజమైనవే అయితే కేసీఆరే స్వయంగా రిలీజ్ చేసేవారని, ఎమ్మెల్యేలను మీడియా కంట పడకుండా దాచేవారు కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
రూ.15 కోట్లు ఏమైనట్లు..
వంద కోట్ల చొప్పున రూ.400 కోట్ల ఎమ్మెల్యేల డీల్ వ్యవహారంలో ఫామ్‌హౌస్‌లో రూ.15 కోట్లు పట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈమేరకు బ్యాగులను కూడా పోలీసులు తమ వాహనాల్లో పెట్టుకున్నారు. కానీ, వాటి గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. బ్యాగులను కోర్టుకు సమర్పించలేదు. దీంతో ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.. బ్యాగులు ఏమయ్యాయి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ కోర్టులో ఎందుకు సమర్పించలేదని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యేలు, పోలీసులు మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది.