Pawan Kalyan- 4 Constituencies: ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని అన్నిరాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పట్టు నిలుపుకునేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా అధికార పక్షాన్ని గద్దె దించాలన్న యత్నంలో విపక్ష టీడీపీ, జనసేనలు ఉన్నాయి. ప్రస్తుతం బలం పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాయి. జనసేన ఒక అడుగు ముందుకేసి.. తమకు గెలుపు అవకాశమున్న నియోజకవర్గాలు ఏవీ? అక్కడ ఉన్న స్థితిగతులు ఏమిటి? సామాజికవర్గాల బలమెంత అన్న కోణంలో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా పవన్ పోటీచేసే నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన పవన్ రెండింటిలోనూ ఓడిపోయారు. విశాఖ జిల్లా గాజువాకతో పాటు గోదావరి జిల్లా భీమవరంలో పోటీచేసిన పవన్ కు నిరాశే ఎదురైంది. ఈ సారి అలా జరుగకుండా చూడాలని ఆ పార్టీ భావిస్తోంది. పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్న పవన్ ఏ నియోజకవర్గం సేఫ్.. ఎక్కడ సునాయాసంగా విజయం సాధించవచ్చో తెలుసుకునేందుకు ఓ ప్రైవేటు ఏజెన్సీతో సర్వే చేయించుకున్నట్టు తెలుస్తోంది.

అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు సర్వేచేసిన సంస్థ పవన్ కు నాలుగు నియోజకవర్గాలు సేఫ్ అని నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అందులో గోదావరి జిల్లా పిఠాపురం ఒకటి. మరొకటి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం. పిఠాపురం నియోజకవర్గంలో అయితే పవన్ గెలుపు సులువని గతం నుంచి ఆ పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. దానినే నిజం చేస్తూ సర్వే సంస్థ కూడా అదే నియోజకవర్గాన్ని సేఫ్ గా తేల్చింది. ఇక తిరుపతి కూడా పవన్ కు అనుకూలంగా ఉంటుందని సదరు సంస్థ గుర్తించింది. అక్కడ సామాజికవర్గంతో పాటు పవన్ అభిమానులు ఎక్కువ. ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి తిరుపతి నుంచి పోటీచేశారు. అదే సమయంలో సొంత నియోజకవర్గం పాలకొల్లు నుంచి కూడా బరిలో దిగారు. అయితే పాలకొల్లు నుంచి ఓటమి చవిచూసిన చిరంజీవి తిరుపతి నుంచి మాత్రం విజయం సాధించారు. అందుకే పవన్ కు కూడా తిరుపతి సేఫ్ జోన్ గా సదరు సంస్థ సర్వేలో తేలింది. అందుకే తిరుపతి కానీ.. పిఠాపురం నుంచి కానీ పవన్ బరిలో దిగితే బాగుంటుందన్న చర్చ అయితే జనసేన వర్గాల్లో నడుస్తోంది.
మరో రెండు నియోజకవర్గాలైనా బాగుంటుందని సర్వే సంస్థ గుర్తించింది. కాకినాడ రూరల్ నుంచి బరిలో దిగినా పవన్ సునాయాసంగా విజయం సాధించే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ నుంచి పోటీచేస్తే కాకినాడ అర్బన్ నియోజకవర్గంపై ప్రభావం చూపే అవకాశముంది. ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించాలంటే పవన్ తప్పనిసరిగా రూరల్ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. సిటీ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిత్యం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయన్ను తప్పనిసరిగా ఓడిస్తామని పవన్ తో పాటు జనసేన వర్గాలు ప్రకటిస్తూ వచ్చాయి. అందుకే కాకినాడ రూరల్ నుంచి పవన్ బరిలో దిగితే ఆ రెండు స్థానాలు జనసేన ఖాతాలో పడడం ఖాయమని భావిస్తున్నారు.

ఇక మరో సేఫ్ నియోజకవర్గం విశాఖ నగరంలోని ఉత్తర నియోజకవర్గం. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. నగరంలోని మిగతా మూడు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా.. విశాఖనగరంలో మాత్రం వైసీపీ పట్టు సాధించలేకపోయింది. ఇప్పటికీ సంస్థాగతంగా టీడీపీ బలంగా ఉంది. ఒక వేళ టీడీపీతో పొత్తు కుదిరితే మాత్రం పవన్ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీచేస్తే సునాయాస విజయం దక్కించుకోవచ్చని సదరు సర్వే సంస్థ తేల్చింది. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో ఆయన నియోజకవర్గాన్ని మారుస్తుంటారు. ఆ లెక్కన చూసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి.. సామాజికవర్గ బలం అధికంగా ఉన్న ఉత్తర నియోజకవర్గం సేఫ్ అన్న వాదన జనసేన వర్గాల్లో అయితే ఉంది. అటు పొత్తుల అంశంపై క్లారిటీ వచ్చాక.. పవన్ ప్రభావం అధికంగా ఉండే రెండు నియోజకవర్గాల నుంచి ఆయ పోటీచేసే అవకాశముందని మాత్రం తెలుస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాలను పరిగణలోకి తీసుకొని పొత్తులపై ముందుకెళ్లాలని కూడా జనసేన భావిస్తోంది.