Modi Rahul KCR: భారత్ జోడోయాత్ర ద్వారా తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు రాహుల్ గాంధీ, భారతీయ జనతా పార్టీతో తెగ తెంపులు చేసుకొని రాష్ట్రీయ జనతా దళ్ తో చేతులు కలిపిన నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ లో పునరుత్థానం కోసం సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, మహారాష్ట్రలో బాల్ ఠాక్రే వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే, జాతీయ పార్టీ ప్రారంభిస్తున్న కేసీఆర్.. వీరి ప్రస్థానం ఏ దిశ గా సాగుతుందో తెలిపేందుకు ఐదు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు నిర్దేశించనున్నాయి. నవంబర్, డిసెంబర్లలో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డోకా లేదని, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అంతగా ప్రభావం చూపవని ఏబిపి_ సి ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది. అయినప్పటికీ ఏ ఎన్నికనూ తేలికగా తీసుకోని నరేంద్ర మోడీ గత ఆరు నెలలుగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వేలకోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ లో గతవారం మండిలో బిజెపి యువ మోర్చా నిర్వహించిన విజయ్ సంకల్ప ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. ఇదే రాష్ట్రంలో విజయదశమినాడు ఎయిమ్స్ ను ప్రారంభించనున్నారు. ఈ రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు ముందే ఐదు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటికి విశేష ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే పైన చెప్పుకున్న రాజకీయ నాయకుల భవితవ్యం వీటి మీదే ఆధారపడి ఉన్నది కనుక.

-సాఫీగా ఎలా సాగుతుంది
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయాలకు ఇప్పట్లో డోకా లేనప్పటికీ.. భవిష్యత్తులో అది అంత సాఫీగా సాగుతుందని చెప్పలేం.. ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు, గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ లో ఒకవేళ బిజెపి గెలిస్తే.. అసలు యుద్ధం 2023 లో ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గడ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల రూపంలో బిజెపి అసలు పరీక్ష ఎదుర్కోనుంది.. 2024 లో సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీకి సవాల్ గా నిలవనున్నాయి. ఇక పాలనపరంగా తాను ఎదుర్కొంటున్న విమర్శలు మోడీకి తెలియనివి కావు. పెరిగిపోతున్న నిరుద్యోగం, ధరలు, ఆర్థిక అసమానతలు దేశ ఆర్థిక ప్రగతికి అవరోధంగా నిలుస్తున్నాయి. సరే.. అధికార పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సర్వసాధారణం. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే తమ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ నిర్వహించిన ఒక వెబి నార్ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం తీసిపారేయదగినవి కావు. ” దేశంలో పేదరికం పెరిగిపోతోంది. మన ముందు ఒక రాక్షసిలా నిల్చున్నది. 20 కోట్ల మంది పేదలు ఇంకా దారిద్రరేఖ దిగువన ఉన్నారు. ప్రజలు రోజుకు 375 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు.. లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మన దేశంలో నిరుద్యోగం 7.6% మేరకు ఉన్నది” అని దత్తాత్రేయ ఘాటుగా విమర్శలు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం మంచిదే, కానీ దేశ జనాభాలో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఇరవై శాతం జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తున్నారని, 50 శాతం మంది చేతుల్లో 13 శాతం జాతీయ ఆదాయం ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ ఆర్థిక అసమానతల గురించి మనం ఆలోచించాలని దత్తాత్రేయ సూచించారు. దత్తాత్రేయ హోసబలే ఎత్తి చూపిన అనేక సవాళ్ళను దేశం ఎదుర్కొంటున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మోదీ పట్ల గత 8 ఏళ్లుగా విశేషమైన ఆదరణ చూపిస్తున్న దేశ ప్రజలు ఈ సవాళ్ల మూలంగానే అనేక సందేహాలకు గురవుతున్నారు. అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగిపోవడం, వర్తకపు లోటు ఆందోళన కలిగించటం, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండడం కంటగింపు కలిగిస్తున్న విషయాలు.. ఇవన్నీ కూడా ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే ఈ అంశాలు బిజెపికి అవరోధంగా పరిణమించకుండా చూసుకోవలసిన బాధ్యత మోడీపై ఉంది.
-ప్రతిపక్షాలు పుంజుకుంటాయా
ఇప్పటివరకు ప్రధానమంత్రి మోడీకి బలమైన ప్రతిఘటన ఇవ్వలేకపోయిన ప్రతిపక్షాలు దత్తాత్రేయ చేసిన వ్యాఖ్యలతో పుంజుకుంటాయా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఇటీవలి పరిణామాలు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి అన్నది యోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత జోడో యాత్ర కర్ణాటకలో ప్రవేశించగానే ఊహించని దానికంటే ఎక్కువగా ప్రతిస్పందన లభించడం కాంగ్రెస్ నేతలకు కొంత ఆనందం కలిగించే విషయం. ఇది మరింత వేగం పెంచుకుంటే క్రమక్రమంగా కాంగ్రెస్ తనను తాను నిలదొక్కుకునేందుకు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కార్యకర్తల నైతిక ధైర్యం పెరిగేందుకు అవకాశం ఉన్నది. ఇటీవల కాలంలో రాజస్థాన్ రాష్ట్రంలో అశోక్ గెహ్లాట్ సృష్టించిన రాజకీయ సంక్షోభం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తేరుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. తమకు వీర విధేయుడైన మల్లికార్జున ఖర్గేను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయించడం జరిగిపోయిందని శశి ధరూర్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాము ఎంత ప్రజాస్వామ్య వాదులమని చెప్పుకుంటున్నప్పటికీ తమ చెప్పు చేతల్లో నుంచి పార్టీ వెళ్లిపోతుంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారని వారు చురకలు అంటిస్తున్నారు..
-కెసిఆర్ దానిని భర్తీ చేయగలరా?
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర తర్వాత దేశ రాజకీయాల్లో ఎంత ఆసక్తి కలిగిస్తున్న అంశం కేసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు. బిజెపికి ప్రత్యామ్నాయంగా దేశంలో ఒక బలమైన పార్టీ ఉండాలన్న ఆవశ్యకత తో తాను ఈ పార్టీ పెడుతున్నట్టు కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. బిజెపికి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగడంలో కాంగ్రెస్ విఫలమవుతున్నదని, అందుకే ఆ బాధ్యత తాను తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక మిగతా ప్రతిపక్షాలన్నీ తమ రాష్ట్రాల్లో తాము నిలదొక్కుకునేందుకే నానా ఇబ్బందులు పడుతున్నాయి. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, కుమారస్వామి.. వంటి వారు జాతీయస్థాయిలో ఒక ప్రత్యామ్నాయం ఉండాలి అనుకుంటున్నప్పటికీ తమంతటి తాము జాతీయ స్థాయిలో ప్రభావం చూపేంత సాహసం వారు చేయలేకపోతున్నారు. ఇక అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీలో కాకుండా ఒక్కో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పరుగు ప్రారంభించేందుకు సలహాలు తీ సుకుంటున్నారు కానీ.. జాతీయ పార్టీ అని చెప్పుకోగలిగే ధైర్యం ఆయన చూపడం లేదు. ఇక కాంగ్రెస్ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయం చూపలేమని నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల ప్రకటించారు కూడా. మరి వీరందరూ చేయని సాహసం కేసీఆర్ ఎందుకు చేస్తున్నట్టు? తనంతట తాను తలిస్తే తప్ప ఎవరినీ కలవని కేసీఆర్.. గత కొంతకాలం నుంచి దేశంలోని రైతు సంఘాల నేతలు, మేధావులు, రాజకీయ నేతలు, జర్నలిస్టులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశ అభివృద్ధి కోసమే తాను ఒక అజెండా రూపొందిస్తున్నానని సొంత మీడియాలో చెప్పుకొచ్చారు. ఇక ఆ పార్టీకి చెందిన నాయకులు కూడా కెసిఆర్ పట్ల ఒకింత ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్నారు. హేమాహేమీలకు సాధ్యం కానిది కేసీఆర్ వల్ల అవుతుందా అనే ప్రశ్నకు ఆ పార్టీ నేతల పెదాలపై చిరునవ్వు కనిపిస్తోంది. “చూద్దాం ఏం జరుగుతుందో? ఏమో గుర్రం ఎగరావచ్చు” అనే సమాధానం వినిపిస్తోంది. అయితే కెసిఆర్ పూర్తిగా కొట్టి పారేయ దగ్గ రాజకీయ నాయకుడు కాదు. టిఆర్ఎస్ స్థానంలో జాతీయ పార్టీని ఏర్పరచడం ద్వారా ఒక కొత్త ఒరవడి సృష్టించాలని, కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరించాలని కోరుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే తెలంగాణలో పాగా వేయాలని బలంగా అడుగులు వేస్తున్న బిజెపి ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సి ఉంది. అయితే మునుగోడులో టిఆర్ఎస్కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఓ విలేఖరి ప్రస్తావించారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా పలు విషయాలను అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు. ఇదంతా విన్నాక ఆయన నవ్వుతూ “పిక్చర్ అవి బాకీ హై” అన్నారు. అంటే ఇందులో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆ తర్వాతే ఢిల్లీ లిక్కర్ స్కాం లో విషయాలు మరింత వెలుగులోకి వచ్చాయి. అంటే అమిత్ షా మాట వెనుక సవాలక్ష సంకేతాలు ఉన్నాయి. అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత.