I And PR Telangana: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఏ మూలన కూర్చున్న సింహభాగం దక్కుతుందని ఒక నానుడి. భారత రాష్ట్ర సమితి ఏలుబడిలో అత్యంత కీలకమైన సమాచార పౌర సంబంధాల శాఖలో పై నానుడి నూటికి నూరుపాళ్ళు నిజమైంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమాచారం ఇవ్వాల్సిన ఆ శాఖ కారు పార్టీకి సలాం కొట్టింది. ఏకంగా వందల కోట్ల ప్రభుత్వ సొమ్మును మంచి నీళ్లలాగా ఖర్చు చేసింది. కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నానని చెప్పటమే ఆలస్యం ఆ శాఖ కీలక అధికారి సూచనతో గులాబీ రంగు పూసుకుంది. తెలుగులో ఆంధ్రజ్యోతి, వెలుగు మినహా అన్ని పత్రికలకు, జాతీయస్థాయిలో అన్ని పత్రికలకు అడ్డగోలుగా ప్రకటనలు ఇచ్చింది. పైగా భారత రాష్ట్ర సమితి అధికారిక రంగు అయినటువంటి గులాబీ వర్ణంలో ఈ ప్రకటనలు ప్రచురించడం విశేషం. దీనికి తోడు దేశానికి తెలంగాణ మోడల్ అంటూ ప్రచారం చేసుకోవడం విశేషం.
కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ప్రచురితమయ్యే వార్తాపత్రికలకు అడ్డగోలుగా ప్రకటనలు ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి ప్రకటనలకు భారత రాష్ట్ర సమితి సొమ్ము వెచ్చించాలి. కానీ ఇక్కడ ఆ పార్టీ ఎదుగుదల కోసం.. కెసిఆర్ ను దేశ నాయకుడిగా చేయడం కోసం ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేశారు. కొన్ని పత్రికల కైతే ఒక్కొక్క ప్రకటనకు నాలుగు కోట్ల వరకు వెచ్చించారని ఐ అండ్ పిఆర్ వర్గాలు చెబుతున్నాయి. అవుట్ డోర్ మీడియాకు పార్టీ యాడ్స్ లాగా ప్రభుత్వ ప్రకటనలు వాడారు అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉన్న నేపథ్యంలో అడ్డగోలుగా ప్రజల సొమ్మును కేసీఆర్ ప్రాపకం కోసం వాడారు.
ఉదాహరణకు తెలుగు నాట మొదటి స్థానంలో ఉన్న ఒక పత్రికకు కోటి రూపాయల విలువైన ప్రకటన ఇస్తే.. ఐ అండ్ పి ఆర్ లో పనిచేసే ఒక వ్యక్తి అందులో కమిషన్ గా 60 లక్షలు తీసుకునేవాడు. కేవలం 40 లక్షలు మాత్రమే ఆ పత్రికకు వెళ్లేవి. ఇక కొన్ని పత్రికలకు ఇష్టానుసారంగా ఎక్కువ రేట్లతో యాడ్స్ ఇచ్చారు. కవర్ ప్రైస్ ను అమాంతం పెంచారు. గడచిన 10 సంవత్సరాలలో చిన్న పత్రికలకు అసలు యాడ్సే ఇవ్వలేదు. ఎవరైనా పోరాటం చేస్తే తప్ప ఇవ్వలేదు. ఇచ్చినా కూడా ఈ యాడ్ టారిఫ్ ను తగానికి సగం తగ్గించి ఇచ్చారు. అయితే సొంత రాష్ట్రంలో పత్రికలకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల్లో వారికి అనుకూలమైన పత్రికలకు మాత్రమే ప్రకటనలు ఇచ్చేవారు. ఇందులో కమిషన్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో నేపథ్యంలో సమాచార పౌర సంబంధాల శాఖ పనితీరుపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక అధికారి పనితీరు పై వెల్లువలా ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే వీటిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయని అంటున్నారు.
గత ప్రభుత్వంలో ఎన్ని డబ్బులు విడుదలయ్యాయి? వీటిలో ఎన్ని ఏజెన్సీలకు వెళ్లాయి? పబ్లిషర్స్ తీసుకున్నది ఎంత? ఎన్ని స్లాట్స్ లలో ప్రచారం చేశారు? అవుట్ డోర్ మీడియాలో ఎన్ని రోజులు బోర్డులపై ప్రచారం చేశారు? ఎన్నింటికి ఆర్వోలు తీసుకొని ఎన్నింటికి వేశారు? చిన్న చానల్స్ రేట్లు ఎందుకు తగ్గించారు? ఎక్కువ స్లాట్సులో ఎంత నొక్కేశారు? కొన్ని చానల్స్ కు మాత్రమే ప్రైమ్ టైం లో యాడ్స్ ఇవ్వాల్సిన అవసరమేంటి? ఏం ప్యానల్ ను ఒక్క అధికారి మాత్రమే ఎందుకు పర్యవేక్షించారు? అందులో కొత్త వాటిని చేర్చకుండా అడ్డుకున్నది ఎవరు? కేవలం రెండు ఏజెన్సీలకు మాత్రమే ఎందుకు కీలక బాధ్యతలు అప్పగించారు? గతంలో ఉన్న ఏజెన్సీలలో ఎందుకు తొక్కి పెట్టారు? ఒక అధికారి వచ్చిన తర్వాత ఆ శాఖ పనితీరు ఎందుకు మారిపోయింది? అనే కోణాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ సాగిస్తే అనేక విషయాలు వెలుగు చూస్తాయని.. వందల కోట్ల ప్రజాధనం ఎలా పక్కదారి పట్టిందో అవగతమవుతుందని సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులు అంటున్నారు.. ఇప్పటికే ఈ శాఖ పని తీరుపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో పనిచేసి, ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి ప్రస్తుతం అదే పోస్ట్ కోసం పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం.