KCR BJP Tushar : మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ విషయంలో మొదట్లో ఆడియోలు, తర్వాత వీడియోలు.. కానీ కెసిఆర్ అనుకున్నంత ఫాయిదా దక్కడం లేదు. దేశమంతా గాయి గత్తర కావడం లేదు. మునుగోడు పోలింగ్ జరుగుతుండగానే కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా మాట్లాడాడు. అది కూడా బిజెపి నాయకులను పల్లెత్తు మాట అనకుండా.. కానీ అంతటి సుదీర్ఘ ప్రెస్ మీట్ లో ఆయన పదేపదే పలకరించిన పేరు తుషార్. ఇంతకీ ఎవరు ఈ తుషార్? అతడి నేపథ్యం ఏమిటి? సెర్చ్ చేస్తే పలు నవ్వు పుట్టించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తుషార్ బిజెపి మనిషి కాదు. తను రాహుల్ పై పోటీ చేసిన బిజెపి అభ్యర్థి కాదు. అన్నింటికీ మించి ఏ లెఫ్ట్ పార్టీలు అయితే పాపం ఇప్పుడు కెసిఆర్ చంకలోకి ఎక్కాయో.. సూది దబ్బునం అని విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు వారిని బహుళ కీర్తనలతో బుజ్జగిస్తున్నాడో… ఆ ఎడమ చేతి వాటం పార్టీలకు ఈ తుషార్ సన్నిహితుడు.

ఎంత చెబితే అంత
తుషార్ అలియాస్ తుషార్ వెల్లపల్లి.. ఇతడి తండ్రి పేరు నటేషన్.. వీళ్లకు ఒక పార్టీ ఉంది దాని పేరు భారత ధర్మ జనసేన..కేరళలోని బిజెపికి వేరే దిక్కు లేక నిలబడే వాడు లేక ఈ తుషార్ కు మద్దతు ఇచ్చింది. నువ్వే మా ఎన్డీఏ అభ్యర్థి అంటూ ప్రకటించింది. తర్వాత పట్టించుకోలేదని నటేశన్ పలు మార్లు ఆరోపించాడు. వాస్తవానికి తుషార్ కు అక్కడ పెద్ద సీన్ లేదు. అది ముస్లింలకు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి రాహుల్ గాంధీకి వచ్చిన ఓట్లల్లో 10 శాతం కూడా తుషార్ కు రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే డిపాజిట్ కూడా రాలేదు. కానీ ఇక్కడితోనే కథ ముగియలేదు. ఇక తుషార్ తండ్రి నటేషన్ కు ఒక సంస్థ ఉంది. దాని పేరు శ్రీ నారాయణ ధర్మ పరిపాలనయోగం. కేరళలోని ఈలవ అనే ఒక బలమైన బీసీ కమ్యూనిటీని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ సంస్థకు నటేషస్ ప్రధాన కార్యదర్శి. ఆమధ్య కేరళ ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు నటేషస్ నివాసానికి స్నేహపూర్వక పర్యటనకు వెళ్లారు. ఎందుకంటే హిందువుల సమస్యలపై ఈ సంస్థ సిపిఎం కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇక ఇదే నటేషస్ ఆ మధ్య శబరిమల కర్మ సమితి మీద విమర్శలకు దిగాడు. అది అన్ని హిందూ వర్గాలకు ప్రాతినిధ్యం వహించడం లేదని ఆరోపించాడు. అప్పట్లో సిపిఎం వాల్ ఆఫ్ ఉమెన్ అనే కార్యక్రమానికి నటేశస్ మద్దతు ఇచ్చాడు. ఆమధ్య ఇదే తుషార్ ను 19 కోట్ల చెక్ బౌన్స్ కేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అరెస్ట్ చేశారు. అయితే దీనిపై కేరళ ప్రభుత్వం రంగంలోకి దిగింది. నా కొడుకును అక్రమంగా అన్యాయంగా ట్రాప్ చేసి అరెస్ట్ చేశారంటూ తుషార్ తండ్రి గగ్గోలు పెట్టాడు. అసలే బలమైన ఈలవ కమ్యూనిటీ, పైగా హిందూ ఇష్యూస్ లో నటేషన్ సహకరిస్తూ ఉంటాడు. దీంతో కేరళ ముఖ్యమంత్రి రంగంలోకి దిగాడు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కు లేఖ రాశాడు. జైలులో తుషార్ ఆరోగ్యం బాగాలేదు, కాస్త వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవాలని కోరాడు. వాస్తవానికి ఇవన్నీ కూడా మలయాళం మీడియాలో పతాక శీర్షికలతో ప్రచురితమైన, ప్రసారమైన వార్తలు. ఇందులో దాపరికాలు లేవు. తెర వెనుక యవ్వారాలు అసలు లేవు. బిజెపి దొంగ దొంగ అని కేసిఆర్ పదేపదే ఆరోపించే ఈ తుషార్ అసలు కథ ఇది.
ఇలాంటి వ్యక్తి చెప్తే బిఎల్ సంతోష్ వింటాడా? సంతోష్ చెప్తే వింటాడా? ఈ సో కాల్డ్ వ్యక్తి డబ్బు మూటలు తీసుకురాగానే ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారా? 19 కోట్ల బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన వాడు వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను ఎలా కొంటాడు? ఏమో కేసీఆర్ సార్ ఈసారి మీ ప్లాన్ బెడిసి కొట్టింది. 2015 మాదిరి లక్ష్మీ బాంబులా పేలుతుంది అనుకుంటే.. కనీసం తోక పటాకు స్థాయిలో కూడా పేలడం లేదు.