KTR: తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు.. దాదాపు పక్షం రోజులుగా దేశంలో లేదు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ఒక్క రోజు ముందు కేటీఆర్ దేశం విడిచి వెళ్లారు. తన కొడుకు కోసం అమెరికా వెళ్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ ఆయన లేని సమయంలో రాష్ట్రం భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా విశ్వనగరం హైదరాబాద్ వర్షాలు, వరదలకు చిగురుటాకులా వణుకుతోంది. ఇప్పటికే నాలాల్లో పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కీలక సమయంలో కేటీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
తలసానిని పట్టించుకునేవారు లేదు..
వరద ప్రభావిత ప్రాంతాల్లో మేయర్, ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు పర్యటిస్తున్నా వారిని పట్టించుకునేవారు కానీ, వారి మాటలు నమ్మే వారు కాని లేదు. ముఖ్యంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినా.. బాధితులకు ఎలాంటి హామీ ఇవ్వలేని పరిస్థితి. ఊరికే తిరిగి వచ్చారంతే. ఎందుకంటే ఆయన చేతిలో కూడా ఏమీ లేదు. నిధులు ఇవ్వాలన్నా.. మంజూరు చేయాలన్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్ మాత్రమే ఇవ్వాలి.
కేటీఆర్ ఎక్కడ…
మరి ఇంతటి కీలక సమయంలో ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఎక్కడున్నాడో తెలుసా.. అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన అటునుంచి అటే దుబయ్ వెళ్లాడు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కొందరు దుబాయ్ జైళ్లలో మగ్గుతున్నారు. వారికి క్షమాభిక్ష కోరేందుకు ఆయన అమెరికా నుంచి దుబయ్ వెళ్లారు. ఈమేరకు రాష్ట్రం తరఫున దుబాయ్ అధికారులకు మంత్రి కేటీఆర్ వినతిపత్రం అందించారు. 15 ఏళ్లుగా జైలుగోడల మధ్యే ఉన్నవారికి శిక్ష నుంచి వారికి విముక్తి కల్పించాలని కోరారు. భారత కాన్సులేట్ జనరల్‌తో సమావేశమైయ్యారు. న్యాయవాదులతో కూడా భేటీ అయ్యారు. దుబాయ్ రాజు ద్వారా క్షమాభిక్షకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దుబాయ్ జైల్లో సిరిసిల్ల వాసులు..
బతుకు దెరువు కోసం పొట్ట చేతపట్టుకుని భార్యాపిల్లలను వదిలి దుబాయ్‌కి వెళ్లిన రాజన్న సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరుకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేశం, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు 2005లో నేపాల్‌కు చెందిన దల్ ప్రసాద్ రాయ్ మరణం కేసులో దోషులుగా ఖరారై జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు తమ వారిని విడిపించాలని మంత్రి కేటీఆర్‌ను కలిసి చాలాసార్లు మొరపెట్టుకున్నారు. చలించిన కేటీఆర్, ‘తెలిసీ తెలియక చేసిన తప్పిదం ఏదైనా కావచ్చు’ అని వారిని విడిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
నేపాలీ కుటుంబానికి ఆర్థికసాయం..
ఖైదీల నేరంతో నష్టపోయిన నేపాల్ బాధిత కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారాన్ని షరియా చట్టం ప్రకారం దియా రూపంలో అందించామని కేటీఆర్ దుబాయ్ అధికారులకు తెలిపారు. ఆ తరువాత 2013లోనే నేపాల్ విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకొని క్షమాభిక్షకు అవసరమైన అన్ని రకాల పత్రాలను దుబాయ్ ప్రభుత్వానికి భారత కాన్సుల్ జనరల్ కార్యాలయం ద్వారా అందించామని గుర్తుచేశారు. అయినా ఇంతవరకు ఖైదీల విడుదల అంశం ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుదీర్ఘకాలం శిక్ష అనుభవించి, జైలు అధికారుల ద్వారా మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలుగా పేరొందిన సిరిసిల్ల వాసులకు వెంటనే క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు.
రాజు తలచుకుంటేనే క్షమాభిక్ష
అనంతరం మంత్రి కేటీఆర్ దుబాయ్ కాన్సుల్ జనరల్‌గా వ్యవహరిస్తున్న రామ్‌కుమార్‌తోపాటు, కేసు వాదిస్తున్న అరబ్ లాయర్, బాధిత కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు, పలువురు తెలంగాణ ఎన్నారైలతో ప్రత్యేకంగా సమావేశమై ఖైదీల క్షమాభిక్ష ప్రక్రియ పురోగతి గురించి తెలుసుకున్నారు. దుబాయ్ రాజు క్షమాభిక్ష ప్రసాదిస్తేనే విముక్తి లభిస్తుందని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు జరిగిన బిజినెస్ సమావేశాల సందర్భంగా రాజ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉన్న పలువురు వ్యాపార వేత్తలతోనూ చర్చించారు. ఖైదీల క్షమాభిక్షకు సహకరించాలని కోరారు.