Aboriginal Graves: తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా రాకాసి గూళ్లు కనిపిస్తున్నాయి. టీవీలు, పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడే అవి వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రోజులు చర్చ జరుగుతుంది. తర్వాత వాటిని పట్టించుకునేవారు కానీ, సంరక్షణ చర్యలు కానీ కానరావడం లేదు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి, కామారం గ్రామాల పరిధి అటవీ ప్రాంతంలోనూ గతంలో ఈ గూళ్లను గుర్తించారు. తాజాగా అదే మండలంలోని బందాల, బొల్లెపల్లి సమీప అడవుల్లో పెద్ద సంఖ్యలో రాకాసి గూళ్లను గుర్తించారు.
2 వేల వరకు రాకాసి గూళ్లు..
బందాల, బొల్లెపల్లి సమీపంలోని అడవుల్లో సుమారు 2 వేల రాకాసి గూళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అవి 2500–3000 ఏళ్ల నాటి ఆదిమానవుల సమాధులుగా భావిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 22 గ్రామాల్లో ఇలాంటి సమాధులు ఉన్నాయని చరిత్రకారుడు, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య తెలిపారు. ప్రభుత్వం వీటిని గుర్తించి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చరిత్రకారుడు, బందాల, బొల్లెపల్లి గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
భద్రాద్రి జిల్లాలోనూ..
గతంలో భద్రాద్రి– కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అమరారం అడవుల్లో శిలాయుగం నాటి వందలాది ఆదిమానవుల సమాధులు వెలుగు చూశాయి. చుట్టుపక్కల ప్రజలు రాకాసిగూళ్లుగా పిలిచే ఈ సమాధులను అమరారానికి పది కిలోమీటర్ల దూరంలోని ఓ గుట్టపై కనుగొన్నట్లు తెలంగాణ జాగృతి చరిత్ర బృందం సభ్యులు కొండవీటి గోపి, నాగులపల్లి జగన్‌మోహన్‌రావు, సింహాద్రి నారాయణ వెల్లడించారు.
లోహ యుగపు సంస్కృతికి చిహ్నం..
ఈ ప్రాంతాన్ని స్థానికులు రాకాసిపట్నంగా పిలుస్తారని వారు తెలిపారు. ఈ సమాధులు లోహయుగపు సంస్కృతికి చారిత్రక ఆనవాళ్లుగా నిలుస్తాయని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇవి ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి అడవుల్లో వెలుగు చూసిన డోల్మన్ సమాధులను పోలి ఉన్నట్లు తెలిపారు. రాకాసిపట్నం ప్రాంతంలో ఆదిమానవులు కొన్ని ప్రత్యేక విశ్వాసాలతో, సమూహాలుగా జీవనం సాగించి ఉంటారని చరిత్ర బృందం సభ్యులు వెల్లడించారు.