KCR Vs Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ టీకాంగ్రెస్ అధికార బీఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరుస షాక్‌లు ఇస్తోంది. ఈసీ తెలంగాణలో పర్యటించిన సమయంలో పలువురు ఐఏఎస్, ఐసీఎస్ అధికారులపై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఫిర్యాదు చేశాయి. దీంతో విచారణ జరిపిన ఈసీ నలుగురు ఐఏఎస్‌లు, పలువురు ఐపీఎస్‌లను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఇది బీఆర్‌ఎస్‌కు మొదటి షాక్..
తాజాగా రెండో షాక్..
తాజాగా టీ కాంగ్రెస్ ప్రతినిధులు మరోమారు కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ బుధవారం కలిశారు. తెలంగాణలో కొంత మంది అధికారులను తమ సొంత పార్టీ నాయకులుగా బీఆర్‌ఎస్ వాడుకుంటోందని ఫిర్యాదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేశ్, సీనియర్ నేత సల్మాన్ కుర్షిద్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఎంపీ ఉత్తంకుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్‌ను కలిశారు. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. పలువురు అధికారుల పేర్లను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వారు ఎలా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో ఆధారాలత సహా వివరించారు.
ఫిర్యాదు చేసింది వీరిపైనే..
సీఈసీకి ఫిర్యాదు అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రిటైర్డ్ ఆఫీసర్లు వేణుగోపాలరావు, నర్సింగరావు, భుజంగరావు, జగన్మోహన్‌రావును బీఆర్‌ఎస్ తమ సొంత పార్టీ నాయకులుగా వాడుకుంటోదని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల పారదర్శకత లోపించిందని ఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
ఫోన్ల ట్యాపింగ్‌పై…
సిట్, ఇంటెలిజెన్స్ అధికారులతో ప్రతిపక్షాలపై నిఘా పెడుతూ టెలిఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. వారందరూ కేసీఆర్ ప్రైవేట్ సైనికులుగా పనిచేస్తున్నారన్నారు. సీఎంవోలో అరవింద్‌కుమార్, సోమేశ్‌కుమార్, స్మిత సబర్వాల్, రాజశేఖర్ వీరందరూ బీఆర్‌ఎస్ ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. దీర్ఘకాలంగా పదవుల్లో కొనసాగుతున్న వారిపై దృష్టి పెట్టాలని కోరామని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
టీన్యూస్, నమస్తే తెలంగాణపై..
రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు సొంత న్యూస్ చానళ్లు, దినపత్రికలు ఉన్నాయని, అధికార పార్టీకి చెందిన పత్రిక నమస్తే తెలంగాణ, న్యూస్ చానల్ టీ న్యూస్‌లో వారికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే చూపిస్తురని తెలిపారు. ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ప్రసారాలు చేస్తున్నాని ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికలు అవినీతిమయంగా మారాయని సీఈసీకి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
వాళ్లకు మూడేళ్ల నిబంధన వర్తించదా..
ఇదిలా ఉంటే.. ఎన్నికల కమిషన్.. షెడ్యూల్‌కు ముందే.. ఒకేచోట మూడేళ్లుగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు ప్రభుత్వం బదిలీలు చేసింది. ఇందులోనూ తమకు అనుకూలమైన ఐపీఎస్, ఐఏఎస్‌లను పోస్టింగ్ ఇప్పించుకున్నారు. అయితే భారీగా బదిలీలు చేసినా, సీఎంవోలో పనిచేసే ఒక్క ఐఏఎస్‌ను గానీ, ఒక్క ఐపీఎస్‌ను గానీ మార్చలేదు. దీంతో ఈసీ నిబంధనలు సీఎంవోలో పనిచేసే అధికారులకు వర్తించవా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.