Homeఆంధ్రప్రదేశ్‌Ramoji Rao: పోలీసులు రామోజీరావు ఇంటి గడపదొక్కడం బహుశా ఇదే తొలిసారి!

Ramoji Rao: పోలీసులు రామోజీరావు ఇంటి గడపదొక్కడం బహుశా ఇదే తొలిసారి!

Ramoji Rao
Ramoji Rao

Ramoji Rao: రామోజీరావు.. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలోనూ తెలియని వారు ఉండకపోవచ్చు. ప్రియా పచ్చళ్ళతో వ్యాపార ప్రస్తానాన్ని ప్రారంభించిన రామోజీరావు కొన్నేళ్ల వ్యవధిలోనే అనేక రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా పత్రికా రంగంలోకి ఈనాడుతో అడుగుపెట్టిన ఆయన మీడియా మొగాల్ గా పేరుగాంచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలను గత కొన్నాళ్లుగా ఆయన తన కొనసాగులతో శాసించారని చెప్పవచ్చు. అటువంటి వ్యక్తి ఇప్పుడు క్లిష్ట దశను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొడుతున్న దెబ్బలను తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా రామోజీ..

ఈనాడు అధినేతగా మీడియా సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక వ్యవస్థను నిర్మించుకున్న రామోజీరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయంగాను అత్యంత కీలకమైన వ్యక్తిగా మారారు. ఉమ్మడి రాష్ట్రంలో తనకు నచ్చిన వ్యక్తులను మంత్రులుగా చేసుకున్న ఘనత రామోజీరావుకు దక్కుతుంది. తనకు నచ్చని వారిని సీఎం సీటు నుంచి దింపేసిన చరిత్ర రామోజీరావుది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావుపై చంద్రబాబునాయుడు నేతృత్వంలో పలువురు రెబల్స్ ఎదురు తిరిగినప్పుడు రామోజీరావు చంద్రబాబుకు అండగా నిలబడ్డారు. ఎన్టీ రామారావు కు వ్యతిరేకంగా తన పత్రికలో పెద్ద ఎత్తున కథనాలు వండి వార్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో సుస్తరంగా కొనసాగేందుకు రామోజీరావు తన ఆశీస్సులను పుష్కలంగా అందించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డిని మీడియాను అడ్డం పెట్టుకొని రామోజీరావు, చంద్రబాబు నాయుడు ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలను వండి వారుస్తూ ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రాజశేఖర్ రెడ్డి రెండోసారి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి తో తీవ్ర వైరం..

రాజశేఖర్ రెడ్డి తో ప్రారంభమైన వైరాన్ని రామోజీరావు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డితోనూ కొనసాగించారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి అక్రమాసుల కేసులో అరెస్ట్ అయినప్పుడు, అంతకుముందు అనేక కారణాలను ఆయన పత్రికలో పతాక శీర్షికల్లో వండి వార్చారు. ఒకానొక దశలో జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ను లక్ష్యంగా చేసుకొని కథనాలను పత్రికల్లో ప్రముఖంగా రాసేలా రామోజీరావు చేశారు. ఆ స్థాయిలో రామోజీరావు జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపులకు పాల్పడ్డారని ఎంతోమంది చెబుతూ ఉంటారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య కొంతవరకు ఆగాధం తగ్గిందని భావించారు. ఒకానొక దశలో జగన్మోహన్ రెడ్డి రామోజీరావు వద్దకు వెళ్లారని.. ఇరువురి మధ్య ఒప్పందం కారణంగానే ఈనాడు పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రావడం తగ్గాయని ప్రచారం జరిగింది. అయితే ఏం జరిగిందో తెలియదు రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాజశేఖర్ రెడ్డి హయాంలో అప్పటి ఎంపీ అరుణ్ కుమార్ వేసిన మార్గదర్శి కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కావడం, ఆ తర్వాత సిఐడికి కేసు విచారణ బాధ్యతలు అప్పగించడం, రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శ కార్యాలయాల్లో జోరుగా తనిఖీలు నిర్వహించడం, పలువురిని అరెస్టు చేయడం చకచకా జరిగిపోయింది. దీంతో మళ్లీ రామోజీరావుకు, మోహన్ రెడ్డికి మధ్య వైరం పెరిగినట్లు అయింది.

Ramoji Rao
Ramoji Rao

మొదటిసారి రామోజీరావు అడ్డాలోకి పోలీసులు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా రామోజీరావుకు పేరు ఉంది. ఫిలిం సిటీలో సువిశాలమైన సామ్రాజ్యంలో అధునాతన హంగులతో కూడిన ప్యాలెస్ లో రామోజీరావు జీవనం సాగిస్తున్నారు. కొద్ది మందికి మాత్రమే ఆ ప్యాలస్ లోకి అనుమతి ఉంటుంది. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ ప్యాలెస్ కి వెళ్లి రామోజీరావు తో చర్చలు జరిపారు. అటువంటి ప్యాలెస్ లోకి రామోజీరావుని విచారించేందుకు ఏపీ సిఐడి అధికారులు తాజాగా వెళ్లడం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశంలోని చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీరావు విస్తరించుకున్న తర్వాత తొలిసారిగా పోలీసులు ఆయన అడ్డాలోకి అడుగు పెట్టారు అని చెప్పవచ్చు. కేంద్రం, రాష్ట్రస్థాయిలో ప్రముఖులు కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో రామోజీరావును ఒక కేసులో ఏ1 ముద్దాయిగా చేర్చి విచారణ చేయడం అంటే మామూలు విషయం కాదు. కేంద్రంలోనూ తనకు అత్యంత ఆప్తులైన వ్యక్తులు అధికారంలో ఉన్నప్పటికీ ఈ విచారణను రామోజీరావు తప్పించుకోలేకపోయారంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఈ కేసును డీల్ చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా నాలుగు దశాబ్దాలకు పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వెలుగు వెలుగుతున్న రామోజీరావు జీవిత చరమాంకంలో ఈ తరహా పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Exit mobile version