https://oktelugu.com/

CM KCR: ప్రతిపక్షాలు లేకుండా చేసే కేసీఆర్ స్కెచ్ ఇదీ

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీని దెబ్బకొట్టడానికి కేసీఆర్‌ తొలి నుంచీ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ఆ పార్టీని దెబ్బకొట్టడానికి ప్రయత్నించారు.

Written By: , Updated On : August 30, 2023 / 10:37 AM IST
CM KCR

CM KCR

Follow us on

CM KCR: తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దాడే బాపతు మన కేసీఆర్ సార్.. అధికారం కోసం ఇప్పుడు ఏమైనా చేయగల నేర్పరిగా మారిపోయారు. శత్రువులు, మిత్రులు తేడా లేదా.. గెలుపు కోసం ఎంతదాకానైనా వెళ్లిపోతున్నారు. ఎవరినైనా చేర్చుకుంటున్నారు. లాబీయింగ్ చేసేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ దెబ్బకు ప్రతిపక్షాలు కుదేలవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్రకు కేసీఆర్ తెర తీశారన్న ప్రచారం జోరందుకుంది.

‘కాంగ్రెస్‌ పార్టీ వాళ్లను ఏమీ అనకండి. వాళ్లు మన వాళ్లే. మనమే కొందరిని ఆ పార్టీలోకి పంపించాం. ఎన్నికలయ్యాక వాళ్లు మళ్లీ మన పార్టీలోకే వస్తారు’ ఇటీవల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వ్యాఖ్య ఇది.

“ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కుక్కల్లా మొరగకుండా.. వారిని పిల్లుల్లా మార్చేందుకే కేసీఆర్‌ బీఆర్‌ఎస్ లోకి చేర్చుకున్నారు.” ఇటీవల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్య

…ఈ వ్యాఖ్యలను బట్టి ఏం అర్థమవుతోంది!? ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేసే వ్యూహాలు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆయన చూసే వైఖరి ఏమిటనేది ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నాయా!? తెలంగాణ రాజకీయ పునరేకీకరణ కోసం కాదు.. ప్రతిపక్షాలను చంపేసి.. తన పార్టీని బలోపేతం చేసుకోవడానికే కేసీఆర్‌ పునరేకీకరణ ఎత్తులు వేశారని అర్థమవుతోందా!? అంటే రాజకీయ విశ్లేషకులు కూడా అవుననే అంటున్నారు. తొలుత కాంగ్రెస్ ను, ఆ తర్వాత బీజేపీని బలహీనం చేయడానికి కేసీఆర్‌ అమలు చేసిన వ్యూహ ప్రతి వ్యూహాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే, తన వ్యూహాలతో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిందని కేసీఆర్‌ భావించారు. కానీ, టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలను రేవంత్‌ రెడ్డి చేపట్టడం, కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్‌ ఫీనిక్స్‌ పక్షిలా మళ్లీ పుంజుకుంటుండడంతో ఇప్పుడు నజర్ పెంచారు.. అందుకే, ఇప్పుడు మళ్లీ కేసీఆర్‌ తన వ్యూహాలకు పదును పెట్టారని, బాల్క సుమన్‌ వంటి నేతల వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-అప్పట్లో అలా..

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీని దెబ్బకొట్టడానికి కేసీఆర్‌ తొలి నుంచీ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ఆ పార్టీని దెబ్బకొట్టడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ తో పాటు మిగిలిన ప్రతిపక్షాలను కూడా నిర్వీర్యం చేయడానికి రాజకీయ పునరేకీకరణ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు టీడీపీ శాసనసభ్యులనూ విలీనం చేసుకున్నారు. అప్పటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యం లేకుండా చేసిన కేసీఆర్‌.. అదే వ్యూహాన్ని 2018 ఎన్నికల తర్వాత మరోసారి కాంగ్రెస్ పై ప్రయోగించారు. ఆ పార్టీ తరఫున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం చేసుకుని సీఎల్పీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తరఫున ప్రజాప్రతినిధులను బీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన వాళ్లు బీఆర్‌ఎస్ లో చేరతారనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. తద్వారా ఆ పార్టీ విశ్వసనీయతనే దెబ్బతీశారు.

– వరుస పరిణామాలతో..

ఇలా వరుస పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీ నిర్వీర్యమైంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు కొత్తమలుపు తిరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు అందుకున్న బండి సంజయ్‌.. దూకుడుగా వ్యవహరించారు. రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లను సాధించి ఊపు మీద ఉన్న బీజేపీకి సంజయ్‌ దూకుడు ఇంకా కలిసివచ్చింది. కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల విశ్వసనీయతను కేసీఆర్‌ దెబ్బతీయడం వల్ల కొంత మేరకు ఏర్పడిన ప్రత్యామ్నాయ శూన్యతను బీజేపీ ఆక్రమించడం ప్రారంభించింది.

– ఓట్లు చీలిపోతాయనుకుంటే..

ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌, బీజేపీ మధ్య చీలిపోతే అంతిమంగా తన పార్టీకే ప్రయోజనం కలిగిస్తుందని భావించిన కేసీఆర్‌.. బీజేపీనే టార్గెట్‌గా చేసుకుని ఆ పార్టీ గ్రాఫ్‌ను మరింత పెంచారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ నాయకత్వంలో దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ సీట్లనే కైవసం చేసుకున్న బీజేపీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలోనూ పోటాపోటీగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు ప్రధాన పోటీదారుగా అవతరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ భారీగా బలహీనం కావడంతో ఇక పోటీ బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యనే అన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో ఢిల్లీలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కూతురు కవిత పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన ప్రయత్నంపై స్టింగ్‌ ఆపరేషన్‌ చేసిన కేసీఆర్‌ ప్రభుత్వం.. దీని వెనుక బీజేపీ కీలక నేత ఒకరు ఉన్నారని ఆరోపించింది. అటు లిక్కర్‌ స్కామ్‌, ఇటు స్టింగ్‌ ఆపరేషన్‌ల నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.

-కొంత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి

ఇక్కడే కేసీఆర్‌ కొంత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌.. బీజేపీ జాతీయ నాయకత్వంతో సయోధ్య కుదుర్చుకున్నారన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్టు వ్యవహారం మరుగున పడింది. అయితే బీజేపీ జాతీయ నాయకత్వంతో కేసీఆర్‌ సయోధ్యలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించారన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అనంతర పరిణామాల్లో ఒక్కసారిగా అలలా ఎగసిన బీజేపీ చటుక్కున చల్లబడిపోయింది. మొత్తంగా కేసీఆర్ స్కెచ్ ఒక్కటే. తెలంగాణలో తనకు బలమైన ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం. ఆ దిశగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఫలవంతం అయ్యారనే చెప్పొచ్చు.