Second marriage : ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగి. పెళ్లి అయింది. అయితే ఆనారోగంతో ఆయన పనిచేస్తున్న ఆస్పత్రికి వచ్చిన యువతి ప్రేమలో పడ్డాడు. తనకు పెళ్లయిన విషయం మర్చిపోయాడు. అప్పటికే పెళ్లయిన భార్య బాగానే ఉంది. ఇద్దరిదీ అన్యోన్యమైన దాంపత్యమే. ఎప్పుడూ గొడవలు కూడా జరగలేదు. ఒకరినొకరు బాధపెట్టుకోలేదు కానీ, ఆస్పత్రికి వచ్చిన యువతిని లైన్‌లో పెట్టాడు. మొదటి భార్యకు తెలియకుండా యువతి మెడలో తాళికట్టాడు. అటు అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అతడు చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు. ఈ ఘటన అన్యోన్య దంపపంపతుల జీవితాన్ని మార్చేసింది. తన భర్త శ్రీరాముడు అనుకుని మురిపోయిన మొదటి భార్య, బ్యాచ్‌లర్ అని నమ్మి పెళ్లి చేసుకున్న యువతి ఇద్దరూ ఇప్పుడు అతడిని రాక్షసుడిలా చూస్తున్నారు.
ఏం జరిగిందంటే..
పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన ఓ యువతి ఆనారోగ్యంతో తరచూ కరీంనగర్ ఆస్పత్రికి వచ్చేది. ఆస్పత్రిలో పనిచేస్తున్న కొత్తపల్లికి చెందిన యువకుడు శ్రీకాంత్ ఆమెతో పరిచయం పెంచుకున్నారు. క్రమంగా ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ఫిబ్రవరి 15న ఇటు యువకుడి ఇంట్లోగానీ, అటు యువతి ఇంట్లోగానీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.
యువ తల్లిదండ్రుల ఫిర్యాదు..
ఆలస్యంగా విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. ఈ విషయమై కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. అతడిని విచారణ చేయగా షాకింగ్ వివరాలు వెల్లడించాడు. తనకు అప్పటికే పెళ్లి జరిగిందని చెప్పాడు. దీంతో అతడి భార్యను, రెండో పెళ్లి చేసుకున్న యువతిని పిలిపించి జరిగింది వారికి చెప్పారు. దీంతో ఇన్నాళ్లూ శ్రీకాంత్ మంచివాడు అనుకున్న భార్య, ప్రియురాలు ఇప్పుడు వీరు రాక్షసుడు అని నిందిస్తున్నారు. మోసపోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
రెండో పెళ్లి చేసుకునేవారికి హెచ్చరిక..
పెళ్లి చేసుకుని ఏ కారణంతో అయినా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునేవారికి ఇదో హెచ్చరిక. పెళ్లయి భార్య ఉండి కూడా ఇలా రెండో పెళ్లి చేసుకుంటున్నారు ప్రబుద్ధులు. కోర్టులు ఇలాంటి వారికి శిక్షలు విధిస్తున్నా.. తీరు మాత్రం మార్చుకోవడం లేదు. కొందరైతే రహస్యంగా పెళ్లి చేసుకుని కాపురాలు చేసి పిల్లల్ని కూడా కంటున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకుని లబోదిబో మంటున్నారు. ఇలాంటి ఘటనలు చూసి అయినా.. అమ్మాయిలు ప్రేమించే ముందు.. పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు.. అమ్మాయిలు పెళ్లయినవాడిని, వేధించేవాడినే నమ్మడం గమనార్హం.