TDP Janasena Alliance: ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అధికార వైసిపి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది.. అందుకు అనుగుణంగానే మార్పులు, చేర్పులు చేపడుతోంది. పలుచోట్ల పార్టీకి సంబంధించిన ఇన్చార్జిలను మార్చేసింది. కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వబోనని జగన్మోహన్ రెడ్డి ముందుగానే చెప్పేశారు. దీంతో ఇన్నాళ్లు అధికార వైసీపీలో ఉన్న నాయకులు మొత్తం ఒక్కసారిగా టిడిపి బాట పడుతున్నారు. మునుముందు ఈ చేరికలు మరింత జోరందుకోవచ్చని టిడిపి నాయకులు భావిస్తున్నారు. చేరికల నేపథ్యంలో ఎన్నికలకు ముందు మరింత బలం పెరుగుతుందని అటు టిడిపి ఇటు జనసేన పార్టీలు భావిస్తున్నాయి. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో అధికారం తమది అని బల్లా గుద్ది చెబుతున్నాయి. టీవీ చర్చా వేదికల్లో జనసేన తరఫున మాట్లాడే వక్తలు కూడా అధికారం తమదే అని హింట్ ఇస్తున్నారు. అయితే దానిని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా అది సోషల్ మీడియాలో ట్రోల్ కు కారణమవుతోంది.
ఇటీవల ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఏపీలో ఎవరిది అధికారం అనే అంశం మీద చర్చ నిర్వహించింది. దీనికి జనసేన పార్టీ నుంచి ఒక వక్త హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గత ఎన్నికల్లో అటు టిడిపి, ఇటు జనసేనకు వచ్చిన ఓట్ల శాతాన్ని లెక్క కట్టారు. ఏ సమయంలో వైసీపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని కూడా వివరించారు. అయితే అప్పటి ఎన్నికల్లో టిడిపి జనసేన విడివిడిగా సాధించిన ఓట్ల శాతాన్ని ఆయన ఇప్పుడు కలిపారు. ఆ ఓట్ల శాతం కలిపితే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమి విజయం సాధిస్తాయని తేల్చి చెప్పారు. కానీ ఇక్కడే ఆయన అసలైన లాజిక్ మర్చిపోయారు. కథ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు రెండవ మాటకు తావులేకుండా గ్లాస్ గుర్తుపై ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో పెట్టుకున్న పొత్తును టిడిపి నాయకులు కొంతకాలానికి ఇలా వక్రీకరించారో ఇప్పటికీ జనసేన కార్యకర్తలకు గుర్తుకే ఉంది. అలాంటప్పుడు వారు ఈ ఎన్నికల్లో టిడిపికి ఎలా ఓటు వేస్తారు? పైగా కులాల కంపు అధికంగా ఉండే ఏపీలో జనసేన కార్యకర్తల ఓట్లు సైకిల్ గుర్తుకు ఎలా బదిలీ అవుతాయనేది ఒకింత ఆశ్చర్యకరమే. కానీ క్షేత్రస్థాయిలో ఈ విషయాలను పట్టించుకోకుండా టీవీ డిబేట్లో జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తలు ఎన్నికల్లో అధికారం తమదే అని తేల్చి చెప్పడం ఆశ్చర్యం అనిపిస్తోంది.
అయితే ప్రస్తుతం ఏపీలో అధికార ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని.. అధికార పార్టీ నాయకులే జగన్ ప్రభుత్వం పనితీరును విమర్శిస్తున్నారనే వాదనలు లేకపోలేదు. పైగా వారంతా జగన్ ప్రభుత్వం పనితీరుపై తీవ్ర అగ్రహంతో ఉన్నారని.. కేవలం పంచుడు పథకాలు తప్ప.. దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో కచ్చితంగా టిడిపి జనసేన కూటమికి ఓటు వేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. అలాంటప్పుడు జనసేన పార్టీ నాయకులు అధికారంలోకి వస్తామని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదని తేల్చి చెబుతున్నారు. కాకపోతే ఇలాంటి విశ్లేషణలు చేసేటప్పుడు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇలా అర్థం కాని విశేషణాలు చేస్తే.. కొరుకుడు పడని విశ్లేషణలు చేస్తే ఇబ్బందికరంగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. డిబేట్లకు హాజరయ్యే వ్యక్తులు కొంతమేర ప్రిపేర్ వస్తే అటు ఎన్నికల సమయంలో పార్టీకి ఎంతో కొంత లాభం జరుగుతుందని అంటున్నారు. ఏమాత్రం టంగ్ స్లిప్ అయినా సోషల్ మీడియాలో హేళనకు గురికావడం తధ్యమని హెచ్చరిస్తున్నారు. టీవీ డిబెట్లకు హాజరయ్యే జనసేన నాయకులు ఈ సూచనలు పాటిస్తారో, లేదో చూడాలి మరి.
నవ్వకండి.. సీరియస్ మ్యాటర్.. pic.twitter.com/R3pYqOlRbN
— Inturi Ravi Kiran (@InturiKiran7) December 18, 2023