Kapu Community: రెడ్డీలకు వైఎస్ జగన్..వెలమలకు కేసీఆర్, కమ్మలకు చంద్రబాబు నాయకులుగా ఉన్నారు. మరి కాపుల విషయానికి వస్తే ఎవరున్నారు?..దశాబ్దాలుగా వేదిస్తున్న ప్రశ్న ఇది. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, అవశేష ఆంధ్రప్రదేశ్ లో అయినా కాపుల జనాభా ఎక్కువ. కానీ రాజ్యాధికారానికి మాత్రం ఆమడ దూరంలో ఉంటున్నారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. ఒక గ్రామంలో ఒక సామాజికవర్గీయులు ఎక్కువగా ఉంటే అదే వర్గీయులకు పదవులు వస్తున్నాయి. మండలంలో అయితే కుల ప్రతిపాదికన పదవులు కేటాయిస్తున్నారు. నియోజకవర్గాల్లో కుల గణన చేసి మరీ ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు కేటాయిస్తున్నారు. మరి సువిశాల రాష్ట్రానికి పాలించే వారి విషయంలో మాత్రం ఈ సూత్రం ఎందుకు వర్తించడం లేదు. దశాబ్ధాల చరితను ఒకసారి గుర్తు చేసుకుంటే కాపు సామాజికవర్గం రాజ్యాధికారం విషయంలో అణగదొక్కబడింది. ఇప్పటికీ అణచివేతకు గురవుతునే ఉంది. కాపులను కాపు కాసేవారిగా చూస్తున్నారే తప్ప.. రాజ్యాధికారం కట్టబెట్టే కనీస ప్రయత్నం చేయలేదు. ఎన్నికల వచ్చిన ప్రతీసారి కాపు కార్డును ఉపయోగించి లబ్ధి పొందుతున్నారు. కాపుల్లో చాలా మంది నాయకులుగా ఎదుగుతున్నారు.. అంతవరకూ బాగానే ఉంది కానీ తమ సామాజికవర్గాన్ని బలీయమైన శక్తిగా మలచలేకపోతున్నారు. నాటి ఎన్టీరంగా నుంచి నేటి ముద్రగడ పద్మనాభం వరకూ కాపు ఉద్యమాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లినా.. రాజ్యాధికారం వరకూ తీసుకెళ్లలేకపోవడం బాధాకరం.
దశాబ్దాల కిందటే కుట్ర
నిజంగా కాపులు కాపుకాసేవారే. మాట మీద నిలబడేవారు. నమ్మారంటే ప్రాణమిస్తారు. అదే ఆ సామాజికవర్గానికి మైనస్ గా మారింది. అందుకే అన్ని రాజకీయ పక్షాలు వారితో చెడుగుడు ఆడుకుంటున్నాయి. ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే ఉమ్మడి రాష్ట్రంలోనైనా, అవశేష ఆంధ్రప్రదేశ్ లోనైనా కాపు సామాజికవర్గ జనాభా ఎక్కువ. దాదాపు రాష్ట్ర జనాభాలో 33 శాతం వరకూ ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాపులను రాజ్యాధికారం దక్కకుండా జరిగిన కుట్రలో ఎప్పుడో ఆ సామాజికవర్గాన్ని చిల్చేశారు. తూర్పుకాపు, గాజుల కాపు, పెద్ద కాపు, తెలగలు, బలిజలు, ఒంటర్లు అంటూ ప్రాంతాల వారీగా విభజించారు. అదే రెండో మూడో శాతం ఉండే కమ్మలు, ఏడో, ఎనిమిదో శాతం ఉండే రెడ్డీలు మాత్రం ఎక్కడికి వెళ్లినా ఏకజాతిగా అభివర్ణించుకుంటారు. తమను తాము అలా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అదే కాపు విషయానికి వస్తే మాత్రం ఏకజాతి భావన లేకుండా చేసేశారు. దాని ఫలితమే సువిశాల రాష్ట్రంలో దశాబ్దాలుగా కాపు జాతి దగాకు గురవుతోంది. సీఎం పీఠంపై రెడ్డీ, కమ్మలుంటే మంత్రులుగా ఐదారుగురు కాపులకు పదవులిచ్చి మీ వర్గానికి మంచి ప్రాధాన్యమిచ్చామని చెప్పుకుంటున్నారు. కాపు నాయకుడు బలీయమైన శక్తిగా ఎదగకుండా వారినే పావుగా వాడుకుంటారు. కాపు నాయకులను తిట్టాలంటే తమ కేబినెట్ లో కాపు మంత్రులను ఉసిగొల్పుతారు. దశాబ్దాలుగా అదే ఒరవడి కొనసాగుతోంది.
జనసేనే వేదిక
వాస్తవానికి కాపులకు చిరంజీవి ప్రజారాజ్యం రూపంలో మంచి అవకాశమే వచ్చింది. కానీ కాపులను ఏకతాటిపైకి తీసుకురావడంలో చిరంజీవి ఫెయిలయ్యారో, రాజకీయ పరిణితి కనబరచలేకపోయారో కానీ కాపుల విశ్వాసానికి నోచుకోలేకపోయారు. అయితే ఇందులో ఇతర రాజకీయ పక్షాల కుట్ర కోణం కూడా ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తో కాపులకు సరైన వేదిక లేకుండా చేయడంలో మిగతా పక్షాలు సక్సెస్ అయ్యాయి. దీంతో వారు ఎన్నికల్లో ఏదో పక్షానికి సపోర్టు చేయక తప్పనిసరి పరిస్థితులను కల్పించారు. ప్రస్తుతం రెడ్డీ సామాజికవర్గం జగన్ వెంట, కమ్మ సామాజికవర్గం చంద్రబాబు వెంట నడుస్తోంది. కానీ కాపు సామాజికవర్గం విషయానికి వచ్చేసరికి ఎదురుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నా ఇంకా తటపటాయిస్తున్నారు. ఈ విషయంలో కాపు సామాజికవర్గీయుల ద్రుక్పదం మారాలి. వారిని మార్చాల్సిన అవసరం కాపు సామాజికవర్గ పెద్దలపై ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకూ, చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం వరకూ కాపు జాతి మూలాలను ఏకతాటిపైకి తీసుకువస్తే పవన్ రూపంలో ఒక బలీయమైన శక్తి కాపులకు దక్కే అవకాశముంది. దశాబ్దాల రాజకీయ కల పవన్ రూపంలో దక్కించుకునే అరుదైన అవకాశం కాపులకు వచ్చింది. షరా మామ్మూలుగా రాజకీయ కుట్రకు సమిధులవుతారో.. ఐదారు మంత్రి పదవులకు వెంపర్లాడుతారో చూడాలి మరీ.
Recommended Videos