https://oktelugu.com/

News Channels Debates : ఘటన ఏదైనా సరే.. ఛానల్ ఏదైనా సరే.. వీరే విశ్లేషకులు

ప్రస్తుతం ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో పనికిమాలిన విశ్లేషణ చేసే వారి మీద ప్రజలకు ఎంత ఆగ్రహం ఉందో తేటతెల్లమవుతున్నది. మరి ఈ వీడియో చూసైనా యాజమాన్యాలు తమ తీరు మార్చుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 5, 2024 9:13 pm
    Follow us on

    News Channels Debates ఒక రైతుకు వ్యవసాయం గురించి తెలుస్తుంది. ఒక ఇంజనీర్ కు నిర్మాణరంగం గురించి తెలుస్తుంది. ఒక పాత్రికేయుడికి సమాజం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక డాక్టర్ కి రోగి కి ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అంతేతప్ప ప్రతి మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉండాలని లేదు. ఉంటే తప్పేమీ లేదు. అలాగని తమకున్న మిడిమిడి జ్ఞానాన్ని ఇతరుల మీద ప్రదర్శిస్తేనే తేడా కొడుతుంది. విషయం పక్కదారికెళ్ళిపోయి వాగాడంబరం తెరపైకి వస్తుంది. అప్పుడు అసలు చర్చకు బదులు అవాస్తవాలు వ్యాప్తిలోకి వస్తాయి. అవి సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

    తెలుగు నాట ఎలక్ట్రానిక్ మీడియా అనేది పార్టీల వారీగా విడిపోయింది. ఉదాహరణకు టిడిపి మీద వ్యతిరేక వార్తలు అంటే సాక్షి, టీవీ9, ఎన్టీవీ, టీ న్యూస్ లో ఎక్కువగా ప్రసారమవుతుంటాయి. ఇక జగన్ ను వ్యతిరేకంగా ఏబీఎన్, టీవీ5, మహా టీవీ, ఈటీవీ కథనాలను ప్రసారం చేస్తాయి. అంతేకాదు ప్రతిరోజు వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తూ ఉంటాయి. అయితే ఈ చానల్స్ కు సంబంధించి ప్రతిరోజు సాయంత్రం టెలికాస్ట్ చేసే డిబేట్ లో కొంతమంది ప్రత్యేక విశ్లేషకులు హాజరవుతూ ఉంటారు. టిడిపి భావజాలం ఉన్నవారు చానల్స్ మారుతూ ఉంటారు. అలాగే వైసిపి భావజాలం ఉన్నవారు కూడా అలానే మారిపోతూ ఉంటారు. ఏ విషయం ఏదైనా సరే.. ఈ విశ్లేషకులే చానల్స్ ఆఫీసుల్లో కూర్చుని విశ్లేషణలు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి కోపం తట్టుకోలేక ఆగ్రహంగా మాట్లాడుతూ ఉంటారు.

    ఇటీవల టీవీ 5 ఛానల్ నిర్వహించిన ఓ డిబేట్లో రాంగోపాల్ వర్మపై కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ తలను తీసుకొని వస్తే కోటి రూపాయలు ఇస్తానని కొలికపూడి శ్రీనివాసరావు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంటే ఆ వ్యాఖ్యలు శ్రీనివాసరావు వ్యక్తిగతమైనప్పటికీ.. అవి సమాజం మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ మీద టిడిపి నాయకులకు కోపం ఉండి ఉంటే.. దానికి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వాలి. లేకుంటే మరో రూపంలో ఆయనకు ప్రతి సమాధానం చెప్పాలి. అంతేతప్ప తల తీసేయాలి.. కోటి రూపాయలు ఇస్తా అంటే.. అది ఎంతవరకు సమంజసం. పైగా ఇలాంటి వారిని విశ్లేషణ పేరుతో టీవీ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలు తమ ఆఫీసుల్లోకి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్?

    ఇక ఎన్నికల సమయంలో ఈ విశ్లేషకుల పైత్యం కూడా తారాస్థాయికి చేరింది. కేవలం వ్యక్తిగత దూషణలకే వీరు పరిమితమవుతున్నారు. ఫలితంగా అసలు విశ్లేషణ పక్కదారి పట్టి వేరే వేరే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా ఆ చానల్స్ చూసే ప్రేక్షకులకు తలనొప్పి వస్తుంది. వాస్తవానికి ఒక విశ్లేషణ అంటే ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలి. వాస్తవ విషయాలను వారి కళ్ళ ముందు ఉంచాలి. అంతేతప్ప న్యూస్ చానల్స్ పేరుతో.. వారికి ఉన్న రాజకీయ పైత్యాన్ని ప్రజల మెదళ్లోకి చొప్పించడం కాదు. రాజకీయ వ్యాపకాలు ఉన్న న్యూస్ చానల్స్ యాజమాన్యాలు కూడా ఇటువంటి విశ్లేషకులను ఎంకరేజ్ చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. అయితే వారిని పిలిచే తీరులో ఎలాగూ అవి పద్ధతి మార్చుకోవు కాబట్టి.. వారి విశ్లేషణాత్మకమైన విన్యాసాలు చూసి నెటిజన్లకు ఒళ్ళు మండుతోంది. అందుకే సోషల్ మీడియా లో తమ ఆగ్రహాన్ని వినూత్న రీతిలో వ్యక్తపరుస్తున్నారు. తాజాగా అలాంటి వీడియోని ఒకటి రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో పనికిమాలిన విశ్లేషణ చేసే వారి మీద ప్రజలకు ఎంత ఆగ్రహం ఉందో తేటతెల్లమవుతున్నది. మరి ఈ వీడియో చూసైనా యాజమాన్యాలు తమ తీరు మార్చుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.