Karnataka Election Results- BJP: “అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది” ఇదే కర్ణాటకలో బిజెపి ఓటమిని శాసించింది. ఇదే సమయంలో కర్ణాటక పిసిసి అధ్యక్షుడు శివకుమార్ ను తిరుగులేని హీరోను చేసింది. అన్ని బాగుంటే రేపో మాపో ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ శివకుమార్ ఇంతటి వాడు అయ్యేందుకు దానికి కారణమైంది భారతీయ జనతా పార్టీనే. ఎందుకంటే 2020లో కర్ణాటక పిసిసి అధ్యక్షుడు శివకుమార్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. విచారణ నిమిత్తం ఆయనను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించింది. అప్పట్లో ఆయనను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరామర్శించారు. కాకపోతే సోనియాగాంధీ ఆయనకు ధైర్యవచనాలు చెప్పి ఊరడించారు.
అవి కసిని పెంచాయి
కర్ణాటకలో బిజెపి కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు.. ప్రతిపక్షాలను అణగదొక్కడంలో వాటికి అవే సాటి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే చేసింది. కాకపోతే కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి మారిన తర్వాత ఒకప్పుడు దానివల్ల ఇబ్బంది పడిన పార్టీలు అంతకుమించి అనేలాగా చేశాయి. ఒక దశ వరకు ఇవి బాగున్నప్పటికీ అవి రాను రాను కాస్త శృతిమించడంతో జనాలకు ఏవగింపు కలిగింది. పైగా కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీ నాయకులు అతిగా ప్రవర్తించడం, అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేరడంతో జనాల్లో వ్యతిరేకత పెరిగింది.. ఆ వ్యతిరేకతను ఉద్యమాలుగా మలచడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. ముఖ్యంగా గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయడమే ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి.
శివకుమార్ లో కసిని పెంచింది
ఇక ఈడీ వల్ల తీహార్ జైలుకు వెళ్లిన శివకుమార్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విచారణ పేరుతో అధికారులు ఆయనను గంటలు గంటలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఆయనలో కసి పెరిగింది. ఆ కసి ఏకంగా సొంత పార్టీలో తన శత్రువైన సిద్ధరామయ్యతో చేయి కలిపేదాకా వెళ్ళింది. ఇద్దరు కూడా గత వైరాన్ని పక్కనపెట్టి ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందంటే దానికి కారణం ముమ్మాటికి శివకుమార్ అని చెప్పవచ్చు.
అవినీతి ఆరోపణలు
ఇక కర్ణాటకలో బసవరాజు ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఎన్నికలకు ముందు బసవరాజును పదవి నుంచి తొలగిస్తారని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. గుజరాత్ రాష్ట్రం మాదిరే ఇక్కడ కూడా ప్రయోగాలు చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. టికెట్ విషయంలో కొత్తవారికి అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ.. ముఖ్యమంత్రి మార్పు విషయంలో అటువంటి కీలక నిర్ణయం తీసుకోలేకపోయింది. దీనికి తోడు ఎన్నికలకు ముందు అక్కడి లోకాయుక్తకు అధికార పార్టీ ఎమ్మెల్యే డబ్బు సంచులతో దొరికిపోవడం భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టింది. హిజాబ్, అమూల్, కేరళ స్టోరీస్, బజరంగబలి, బజరంగ్ దళ్ వంటి వివాదాలు తెరపైకి వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీని గెలిపించలేకపోయాయి.. స్థానిక సమస్యలు, అవినీతి ఆరోపణలు బలంగా పనిచేయడం, వాటిని కాంగ్రెస్ నాయకులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అక్కడ అధికార మార్పు సాధ్యమైంది. ఇక ఈ తీర్పు ద్వారా కర్ణాటక ఓటర్లు ఈ ప్రభుత్వాన్ని కూడా రెండవసారి ఎన్నుకోరని రుజువు చేశారు.