Telangana Janasena: తెలంగాణ ఎన్నికల్లో జనసేన బరిలో దిగనుంది. 32 అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించింది. వారందరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏపీలో జనసేనకు బిజెపి మిత్రపక్షంగా ఉంది.అదే సమయంలో పవన్ టిడిపి తో పొత్తు ఉంటుందని ప్రకటించారు. అయితే అది ఏపీ వరకే పరిమితమని స్పష్టమైంది. తెలంగాణలో మాత్రం జనసేన ఒంటరి పోరని తేలిపోయింది.
అయితే పవన్ ఒంటరి పోరుకే మొగ్గు చూపడానికి భారతీయ జనతా పార్టీ వైఖరే కారణం. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ పై అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమకు ఏ పార్టీతో పొత్తుల అవసరం లేదని.. ఒంటరిగానే ముందుకు వెళ్తామని.. జనసేనతో పొత్తు ఏపీకే పరిమితమని తేల్చి చెప్పారు. దీంతో జనసేన కూడా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో పరిమిత సీట్లలో పోటీ చేయడానికి నిర్ణయించుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 32 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీలో పెట్టాలని తుది నిర్ణయానికి వచ్చారు.
తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బిజెపికి జనసేన అవసరం కీలకం. తెలంగాణలో సైతం పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జనసేనతో పొత్తు కుదుర్చుకుని ఉంటే భారతీయ జనతా పార్టీకి ఎంతో లాభించేది. కానీ ఆ అవకాశాన్ని బిజెపి చేజేతులా జారవిడుచుకుంది. అయితే అధికార బి ఆర్ ఎస్ తో పవన్ సన్నిహితంగా ఉండటమే బిజెపి ఆలోచన చేయడానికి ప్రధాన కారణం. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పీవీ నరసింహారావు కుమార్తెకు బి ఆర్ ఎస్ టికెట్ కేటాయించింది. దీంతో పవన్ మద్దతు ప్రకటించారు. అప్పట్లో బీజేపీ అభ్యర్థి ఉన్నా.. బి ఆర్ ఎస్ కు పవన్ మద్దతు తెలపడం తెలంగాణ బిజెపి నాయకుల ఆగ్రహానికి కారణమైంది.
అయితే తెలంగాణలో జనసేన విడిగా పోటీ చేస్తుండడంతో ఆ ప్రభావం బిజెపి పై పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ త్రిముఖ పోరు నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెటిలర్స్ ప్రభావం ఎక్కువ. అక్కడ జనసేన తో పాటు టిడిపి సైతం బరిలో ఉండడం ఎక్కువగా బిజెపికి డ్యామేజ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ బహుముఖ పోరుతో అధికార పార్టీకి లాభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా పవన్ ను వదులుకొని భారతీయ జనతా పార్టీ భారీ మూల్యం చెల్లించుకోనుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.