powerful countries : ప్రపంచ దేశాలన్నీ తమ సైనిక సామర్థ్యాలను, హోదాను పెంచుకునేందుకు పోటీపడుతున్నాయి. , ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న అనేక దేశాలు తమ సైనిక బలాన్ని పెంచుకోవడానికి ఫైటర్ జెట్‌లు, క్షిపణులు, డ్రోన్‌లు, వాయు రక్షణ వ్యవస్థలు, ట్యాంకులు, ఫిరంగి వంటి అత్యంత అధునాతనమైన, శక్తివంతమైన ఆయుధాలను కొనుగోలు చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. అయితే సైనిక శక్తి వల్ల ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితా ప్రతి సారి మారుతూనే ఉంది. ఇక ఈ సారి అక్టోబర్ 2024 నాటికి ప్రపంచంలోని 10 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితా గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలోని 10 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. US మిలిటరీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. దీని సైనిక స్థావరాలు ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా ఉన్నాయి. అమెరికా మిలిటరీ వ్యయం ఏటా దాదాపు $876 బిలియన్లతో అత్యధికంగా ఉంది. USA తర్వాత ప్రపంచంలో రెండవ అత్యంత శక్తివంతమైన సైన్యం రష్యాదే. ఈ దేశ సైనిక వ్యయం సంవత్సరానికి $ 86.3 బిలియన్లు. రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి.
రష్యా తర్వాత ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తివంతమైన సైన్యంగా చైనా అవతరించింది. చైనా సైనిక వ్యయం దాదాపు 292 బిలియన్ డాలర్లు. చైనా వద్ద 3166 విమానాలు, 4950 ట్యాంకులు ఉన్నాయి. ప్రపంచంలోని 10 అత్యంత శక్తివంతమైన దేశాలలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. భారతదేశ సైనిక వ్యయం దాదాపు 81.3 బిలియన్ డాలర్లు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, భారతదేశం తన సైనిక శక్తిని విపరీతంగా పెంచుకుంది. ఇక దక్షిణ కొరియా ప్రపంచంలో ఐదవ స్థానాన్ని ఆక్రమించింది. దక్షిణ కొరియా తన మిలిటరీ కోసం ఏకంగా సంవత్సరానికి 46.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది.
బ్రిటన్ ప్రపంచంలోని ఆరవ అత్యంత శక్తివంతమైన దేశంగా జాబితాలో చేరింది. యునైటెడ్ కింగ్‌డమ్ తన మిలిటరీపై సంవత్సరానికి $68.5 బిలియన్లను ఖర్చు చేస్తుంది. UKలో పెద్ద సంఖ్యలో విమాన వాహక నౌకలు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు ఉన్నాయి. జపాన్ ఆసియాలో మూడవ స్థానంలో, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. ఈ దేశం ప్రతి సంవత్సరం తన సైన్యం కోసం $ 46 బిలియన్లను ఖర్చు చేస్తుంది. రీసెంట్ గానే జపాన్ తన సైనిక సామర్థ్యాన్ని విస్తరించింది.
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో టర్కీ ఎనిమిదో స్థానంలో ఉంది. టర్కీ సైనిక వ్యయం సుమారు $10.6 బిలియన్లు. గత కొన్నేళ్లుగా మిలిటరీ డ్రోన్‌ల విషయంలో టర్కీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది పాకిస్తాన్. పాకిస్తాన్ తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇందులో దాదాపు 110-130 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు కూడా ఉన్నాయి. ఇక సైనిక శక్తి పరంగా ఇటలీ ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది. దీని సైనిక వ్యయం సంవత్సరానికి $33.5 బిలియన్లు.