TTD Laddu Issue: తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి సిట్ విచారణ ప్రారంభం అయింది. వేగవంతంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి ప్రాథమిక సమాచారం సేకరణ పూర్తయింది. కొద్దిరోజుల కిందట తిరుమల లడ్డు వివాదం పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేసింది. సిబిఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఆహార కల్తీ నియంత్రణ అధికారి ఒకరితో కూడిన బృందం ప్రస్తుతం విచారణ చేపడుతోంది. వారికి రాష్ట్ర ప్రభుత్వం సైతం సహాయ అధికారులుగా దాదాపు 30 మందిని ఏర్పాటు చేసింది. టీటీడీ ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించింది. ఈ తరుణంలో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్ బృందం. తాజాగా లడ్డు ప్రసాదానికి సంబంధించి నెయి సరఫరా చేసే వైష్ణవి, ఏఆర్ డైరీతో పాటు చెన్నై ల్యాబ్ లో బృందాలు విచారణ చేపట్టాయి. అన్ని కోణాల్లో వివరాలు సేకరించారు. రెండు డైరీ ల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏఆర్ డైరీలో 13 గంటలపాటు సాదాలు జరగడం విశేషం. అక్కడ కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం.
* టీంలుగా విడిపోయి
సిట్ బృందం ఏకకాలంలో రెండు టీంలుగా విడిపోయి తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఒక బృందం వైష్ణవి డైరీ, మరో బృందం తమిళనాడులోని దిండుగల్ కు చెందిన ఏఆర్ డైరీలో తనిఖీలు చేసినట్లు సమాచారం. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ పైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పాము సరఫరా చేసిన నెయ్యి నాణ్యమైనదిగా పేర్కొంటూ జారీ చేసిన సర్టిఫికెట్ను సమర్పించడం పైన సిట్ ప్రత్యేక విచారణ చేస్తోంది. నెయ్యి తయారీకి అమలు చేస్తున్న నాణ్యతా ప్రమాణాలు, పరీక్షించే పరికరాలు, నెయ్యి సాంద్రత, నాణ్యతను గుర్తించిన నిపుణులు ఎవరు? ఎస్ఎంఎస్ ల్యాబ్ నుంచి బయటకు ఎక్కడైనా నమూనాలు పంపించి టెస్టులు చేయించి రిపోర్టులు తెప్పిస్తున్నారా వంటి అంశాలపై సైతం ఆరా తీశారు.
* వీలైనంత త్వరగా విచారణ
వీలైనంత త్వరగా విచారణ చేపట్టి నివేదికలు ఇవ్వాలని ఈ సిట్ బృందం ప్రయత్నాలు చేస్తోంది. కోర్టు ఆదేశాల ప్రకారం వెనువెంటనే సిట్ ఏర్పాటు కాలేదు. చాలా రోజుల జాప్యం తరువాత ఈ సిట్ రంగంలోకి దిగింది. దీంతో ఒక రకమైన గందరగోళం నెలకొంది. తాజాగా సిట్ రంగంలోకి దిగడం, లోతైన విచారణ జరుగుతుండడంతో.. లడ్డు వివాదం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.